‘చెత్త’ విధానం

ABN , First Publish Date - 2022-12-31T00:32:42+05:30 IST

చెత్త సేకరణ వాహనాలు మళ్లీ నిలిచిపోయాయి. సిబ్బంది తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ ఆటోల నిర్వహణ బాధ్యత, సిబ్బంది వేతనాల మంజూరును ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది.

‘చెత్త’ విధానం

రంగా.. రంగా అంటూ శ్రమదోపిడీ

మళ్లీ ఆగిన చెత్త సేకరణ ఆటోలు

పీఎఫ్‌, ఈఎస్‌ఐ సంగతి తేల్చాలంటున్న కార్మికులు

విధులు బహిష్కరించి నిరసన

ఇటీవల డీజిల్‌ లేక ఆగిన వైనం

రెండోసారి నిలిచిపోవడంతో పాతపద్ధతిలోనే చెత్తసేకరణ

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 30: చెత్త సేకరణ వాహనాలు మళ్లీ నిలిచిపోయాయి. సిబ్బంది తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ ఆటోల నిర్వహణ బాధ్యత, సిబ్బంది వేతనాల మంజూరును ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. సీఎం సామాజిక వర్గానికి చెందిన (గుంటూరుకు చెందిన రెడ్డి) ఏజెన్సీకి కట్టబెట్టడంతో నిర్వహణ అస్తవ్య స్తంగా మారింది. అడిగే వారు లేకపోవడంతో నెలనెలా వేతనాలు ఇవ్వకుండా, వాహనాలకు ఆయిల్‌ కొట్టించకుండా ఆ సంస్థ ముఖం చాటేసింది. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ఈనెల 24వతేదీన ‘ఆయిల్‌కు డబ్బుల్లేవ్‌’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన కార్పొరేషన్‌ అధికారులు నెలనెలా ఏజెన్సీకి చెల్లించే డబ్బులు మినహాయించి ఆయిల్‌ కొట్టించడంతో తిరిగి రోడ్డెక్కాయి. శుక్రవారం మరోసారి కార్మికులు నిరసనకు దిగడంతో మళ్లీ ఆగిపోయాయి. ఏజెన్సీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా కాకముందే సమస్యల్లో చిక్కుకోవడంతో పట్టణాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అటు పాత విధానం కొనసాగిం చలేక, ఇటు కొత్త విధానం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

ఏజెన్సీ నిర్వాకంతో..

మొన్న జీతాలు.. నిన్న ఆయిల్‌.. నేడు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సమస్య వేధిస్తుండటంతో కార్మికులు చేసేదేమీ లేక, తమ సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లోకి వెళ్లమంటూ తెల్చిచెప్పేస్తున్నారు.ఇవే సమస్యలతో వారంక్రితం విజయవాడలో, నాలుగు రోజుల క్రితం నెల్లూరులో, నేడు ఒంగోలులో చెత్త సేకరణ ఆటోల సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఇదంతా చూస్తే సదరు నిర్వహణ బాధ్యతలు చూసే ఏజెన్సీ తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తోంది. కార్మికులకు హామీ ఇచ్చిన మేరకు జీతాలు, ఇతర ప్రయోజనాలు కల్పించడం లేదు. పైగా వారి సమస్యలను పెడచెవిన పెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. పైపెచ్చు నెలనెలా తమకు రావాల్సిన చెత్తపై పన్ను డబ్బులు మాత్రం లక్షల్లో ఆయా మునిసిపాలిటీల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. చెత్తసేకరణ ఆటోల నిర్వహణ బాధ్యతల నుంచి ఏజెన్సీని తప్పించి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ అధికారులే చూడాలని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. విధుల్లోకి తీసుకునేటప్పుడు కార్మిక చట్టాలు అమలు చేస్తామని ‘చెత్త’హామీలు ఇచ్చారని, ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:32:54+05:30 IST

Read more