వైసీపీ బరితెగింపు!

ABN , First Publish Date - 2022-12-31T00:29:57+05:30 IST

అధికార వైసీపీ నాయకులు చట్టాన్ని అతిక్ర మించే చర్యలను బహిరంగంగానే నిర్వహిస్తున్నా రు. అందుకు శుక్రవారం జిల్లాలో జరిగిన పార్టీ సమావేశాల తీరుతెన్నులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వైసీపీ బరితెగింపు!

వలంటీర్లతో పార్టీ కన్వీనర్లను కలిపి సమావేశాలు

రెచ్చిపోయిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు

పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్య

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

అధికార వైసీపీ నాయకులు చట్టాన్ని అతిక్ర మించే చర్యలను బహిరంగంగానే నిర్వహిస్తున్నా రు. అందుకు శుక్రవారం జిల్లాలో జరిగిన పార్టీ సమావేశాల తీరుతెన్నులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీలోని అసమ్మతివాదులను హెచ్చరిస్తూ చేసిన ప్రసంగం సంచలనం సృష్ట్టించింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనాపరంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగుల్లా వలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా వారిని వినియోగించుకోవటా న్ని గతంలో ఎన్నికల కమిషన్‌ తప్పుబట్టింది. అయినప్పటికీ వైసీపీ పోకడ మారలేదు. తాజాగా ప్రతి వలంటీర్‌ పరిఽధిలో ఒకగృహ సముదాయ కన్వీనర్‌గా పార్టీ వారిని నియమించాలని అధిష్ఠానం ఆదేశించింది. అలాగే ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు పార్టీ సభ్యులను కోఆర్డినేటర్లుగా ఏర్పాటు చేయాలని సూచించింది. ఇప్పటికే వలంటీర్ల పరిధిలో ప్రతి 50 గృహాలకు పార్టీకి చెందిన ఒకరిని సముదాయ కన్వీనర్‌గా నియమించారు. పార్టీ కమిటీల ఏర్పాటు ఏస్థాయిలో ఉన్నా అది సంబంధిత పార్టీ అంశం. అయితే శుక్రవారం వైసీపీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా ఇటు ప్రభుత్వ పరిధిలోని వలంటీర్లను ఆపార్టీ ఏర్పాటు చేసుకున్న కన్వీనర్లను కలిపి సమావేశాలు నిర్వహించటం చర్చనీయాంశమైంది.

అంతా బహిరంగంగానే..

ఆయా నియోజకవర్గాల వారీ ప్రతి మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వలంటీర్లను పార్టీ ఏర్పాటుచేసిన కన్వీనర్లను కలిపి శుక్రవారం సమావేశాలు నిర్వహించటం వివాదాస్పదంగా మారింది. ఈ సమావేశాలకు ఆయా నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జులు హాజరై ప్రసంగించారు. ప్రత్యేకించి రాజకీయ ఉపన్యాసాలు చేశారు. పార్టీని గెలిపించాలని కోరారు. వలంటీర్లు, కన్వీనర్లు కలిసి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని కోరటం గమనార్హం. ఈ ప్రసంగంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మరింత ముందగుడు వేసి నియోజకవర్గంలో తనను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నాయకుల అంతు చూస్తానని ప్రకటించటం సంచలనం కల్గించింది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను వ్యతిరేకించే కొందరు నాయకులు రాంబాబును కట్టడి చేయకపోతే తాము పార్టీని వీడతామని కూడా రాష్ట్ర నాయకులకు అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాంబాబు బేస్తవారపేటలో జరిగిన సమావేశంలో అసమ్మతి నాయకులపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగంలో తాను రెడ్డియేతర సామాజికవర్గం కాబట్టి నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న కొందరు ఆ సామాజిక వర్గం నాయకులు అసమ్మతి పేరుతో హడావుడి చేస్తున్నారని, వారంతా తన కాలిగోటికి కూడా సరిపోరని అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. అందిన సమాచారం మేరకు ప్రతి సమావేశంలోనూ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ప్రభుత్వ పరిధిలోని వలంటీర్లు, పార్టీ కన్వీనర్లు కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరటంతోపాటు అందుకు అనుగుణంగా వారికి కొన్ని తాయిలాలు కూడా ప్రకటించారు. పాలనాపరంగా వివాదాస్పదమైన ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ ఎలా స్పదిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2022-12-31T00:29:57+05:30 IST

Read more