పేదల కోటాకు కన్నమేశారు..!

ABN , First Publish Date - 2022-12-10T00:52:30+05:30 IST

కరోనా కాలంలో పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యానికి కన్నం పడింది. కేంద్రం నుంచి బియ్యం కోటా వస్తున్నా.. అవి పేదలకు పంపిణీ జరగడం లేదు.

పేదల కోటాకు కన్నమేశారు..!

మురికిమల్లపెంట గ్రామానికి అందని రేషన్‌ బియ్యం

పుల్లలచెరువు, డిసెంబరు 9: కరోనా కాలంలో పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యానికి కన్నం పడింది. కేంద్రం నుంచి బియ్యం కోటా వస్తున్నా.. అవి పేదలకు పంపిణీ జరగడం లేదు. రెండు నెలలుగా మండలంలోని మురికిమల్లపెంటలో పేదలకు పంపిణీ చేయాల్సిన పీఎంజికెఎవై ఉచిత బియ్యాన్ని గిరిజనులకు పంపిణీ చేయకుండా ఢీలరు అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది రోజులు గడిచినా నేటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం. ఢీలర్‌ తమకు కోటా కింద వచ్చిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ నెట్‌ సిగ్నల్‌ రాకపోవడంతో లబ్ధిదారులకు ఆఫ్‌లైన్‌లో బియ్యం పంఫీణీ చేసినా చేయకపోయినా అధికారులకు వివరాలు అందటం లేదు. .ఇప్పటికైనా జిల్లా కలెక్టరు స్పందించి మురికిమల్లపెంటలో రెండు నెలల కేంద్ర బియ్యంతో పాటు ఈ నెల రాష్ట్ర రేషన్‌ బియ్యం ఇప్పించాలని గిరిజన చెంచులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బియ్యం గిరిజనులకు అందలేదు : వీఆర్‌వో చంద్రకళ

గిరిజనుల నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై విచారించా. రెండు నెలలుగా కేంద్రం కోటాలో వచ్చిన, ఈ నెల రాష్ట్రం ప్రభుత్వం ద్వారా వచ్చిన బియ్యం ఢీలరు నుంచి గిరిజనులకు చేరలేదు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తా.

గోడౌన్‌ నుంచి బియ్యం పంపాం : అన్నపురెడ్డి, తిరుపతిరెడ్డి

మురికిమల్ల రేషన్‌ దుకాణానికి రెండు నెలల కేంద్రం కోటా, ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యాన్ని పంపించాం. గోడౌన్‌ వద్ద పెండింగ్‌ ఏమీ లేదు. ఆ బియ్యాన్ని ఢీలర్‌కు చేర్చాం.

Updated Date - 2022-12-10T00:52:33+05:30 IST