మళ్లీ మొదటికొచ్చిన పర్చూరు వైసీపీ వ్యవహారం
ABN , First Publish Date - 2022-08-05T05:03:17+05:30 IST
పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ను ప్రస్తుత ఇన్చార్జ్ రావి రామనాథంబాబు కలిశారు. ఆ తర్వాత తననే కొనసాగాలని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రామనాథంబాబు వెల్లడించారు.
సీఎంను కలిసిన రామనాథంబాబు
నన్నే కొనసాగమన్నారంటూ నియోజకవర్గంలో వేడుకలు
8న సీఎంను బాలినేని కలిసే అవకాశం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు : పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ను ప్రస్తుత ఇన్చార్జ్ రావి రామనాథంబాబు కలిశారు. ఆ తర్వాత తననే కొనసాగాలని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రామనాథంబాబు వెల్లడించారు. తదనుగుణంగా నియోజకవర్గంలో ఆయన అనుచరులు బాణసంచాలు కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ విషయమై పూర్తిగా ఇంకా నిర్ధారణ కాలేదని, సోమవారం మరోసారి ప్రభుత్వ సలహాదారుడు రామకృష్ణారెడ్డి, పార్టీ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భేటి అయి చర్చించుకోనున్నారని సమాచారం. ఆ తర్వాత బాలినేని సీఎంను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పు వ్యవహారం కొంతకాలంగా పార్టీ నాయకుల్లో అంతర్గత చర్చనీయాంశం కావటం తెలిసిందే.
బుధవారం తాడేపల్లిలో సజ్జల, బాలినేని కలిసి రామనాదంబాబుతో మాట్లాడారు. కాపు సామాజిక వర్గం వారికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం మేరకు ఒంగోలుకు చెందిన కంది రవిశంకర్ పేరును తాము ప్రతిపాదించామని రామనాథంబాబు దృష్టికి వారు తీసుకెళ్లారు. అలాగే పార్టీ మీకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం రామనాథంబాబు సతీమణి డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్నారు. ఆమె పదవీకాలం పూర్తవుతుండగా తిరిగి కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తారని వారు చెప్పారు. దీనికి తోడు రామనాథంబాబు అడిగిన మరికొన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు సమాచారం. రామనాథంబాబు సీఎంను కలవాలని కోరటంతో గురువారం సాయంత్రం అందుకు అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ను రామనాథంబాబు అతని కుమారునితోపాటు కలిసే సమయంలో సజ్జల కూడా ఉన్నారు. ఆ సందర్భంగా రామనాథంబాబు నియోజకవర్గంలో ఇప్పటికీ తాను లేక తన భార్య 60 రోజులకు పైగా గడపగడపకూ కార్యక్రమం నిర్వహించామని, తననే కొనసాగించి తన పనితీరును స్పష్టంగా గమనించాలని కోరినట్లు తెలిసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి రామనాథంబాబు కొనసాగింపునకు అంగీకరించారని అంటున్నారు. కొద్ది రోజులు మాత్రమే చూడమన్నారని, మార్పు తథ్యమని పార్టీలోనే రామనాథంబాబు వ్యతిరేక వర్గం వారు అంటున్నారు. ఈ విషయమై సోమవారం తాడేపల్లికి వస్తానని, ఆ విషయమైన అప్పుడు మాట్లాడతానని బాలినేని సజ్జలకు చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే ఆ రోజు లేక మరుసటి రోజు బాలినేని సీఎంను కలవచ్చని చెబుతున్నారు. ఇలా ఉండగా రామనాథంబాబు తన పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చి తననే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ విషయంలో సహకరించిన సజ్జల, వైవీ, బాలినేని, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు గురువారం సాయంత్రం బాణసంచా కాల్చారు. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన మార్పు వ్యవహారం రానున్న రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాల్సిందే.