సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యతకు పాతర

ABN , First Publish Date - 2022-11-22T23:10:52+05:30 IST

దర్శి పట్టణంలో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. ప్రమాణాలు పాటించకపోవటంతో ఏడాదికే అవి దెబ్బతిన్నాయి. పలుచోట్ల నెర్రలు ఇచ్చా యి. సిమెంట్‌ లేచిపోయి కంకర బయటపడింది. అధికారులు సీసీ రోడ్లపై దెబ్బతిన్న ప్రదేశాలను కనిపించకుండా సిమెంట్‌, తారు పూసి మేకప్‌ చేస్తున్నారు. నాసికంగా సిమెంట్‌ రోడ్లు నిర్మించటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యతకు పాతర
సీసీ రోడ్డు దెబ్బతిన్న ప్రదేశం కనిపించకుండా సిమెంట్‌ పూత

ప్రారంభానికి ముందే దెబ్బతిన్న దారులు

పూతలు పూసి కప్పిపుచ్చిన అధికారులు

దర్శి, నవంబరు 22: దర్శి పట్టణంలో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. ప్రమాణాలు పాటించకపోవటంతో ఏడాదికే అవి దెబ్బతిన్నాయి. పలుచోట్ల నెర్రలు ఇచ్చా యి. సిమెంట్‌ లేచిపోయి కంకర బయటపడింది. అధికారులు సీసీ రోడ్లపై దెబ్బతిన్న ప్రదేశాలను కనిపించకుండా సిమెంట్‌, తారు పూసి మేకప్‌ చేస్తున్నారు. నాసికంగా సిమెంట్‌ రోడ్లు నిర్మించటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా దర్శి - కురిచేడు రోడ్డులో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభానికి ముందే దెబ్బతింది. దర్శి - కురిచేడు రోడ్డులో కెనరా బ్యాంకు సమీపం నుంచి కాకతీయ నగర్‌ వరకు సుమారు 1.2 కిలోమీటర్లు సీసీ రోడ్డు అక్కడ నుంచి 0.6 కిలోమీటర్లు తారు రోడ్డు ఎన్నెస్పీ కాలువ వరకు నిర్మించారు. ఈ రోడ్డుకు మొత్తం రూ.2 కోట్లు వెచ్చించారు. దీన్ని గత ఏడాది ప్రారంభించారు. న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ద్వారా నిధులు విడుదల కాగా ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు ఖరారు చేసింది. సంబంధిత పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సీసీ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించటం లేదని ఆది నుంచీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కాంట్రాక్టరు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా రోడ్లు వేయడంతో ఏడాదికే అనేక చోట్ల నెర్రలు ఇచ్చాయి. పలుచోట్ల తారులేచి కంకర బ యటపడింది. నిరంతరం రద్దీ గా ఉండే ఈ రహదారిపై వేసిన రోడ్డు ఆరంభంలోనే దెబ్బతినడంతో ప్రజలు తీ వ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కొన్నిచోట్ల సిమెంట్‌తో పూతలు, మరికొన్ని చోట్ల తారుతో పూతలు వేసి మమ అనిపించారు. అయినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్డు దెబ్బతిని కనిపిస్తోంది. ఈ రోడ్డు ఎన్నాళ్లు ఉంటుందోనని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రారంభానికి ముందే దెబ్బతిన్న విషయంపై ఆంధ్రజ్యోతి ఆర్‌అండ్‌బీ అధికారులను వివరణ కోరగా.. సీసీ రోడ్డు వేసిన వెంటనే వాహనాలు తిరగ డం వలన కొన్నిచోట్ల దెబ్బతిన్న మాట వాస్తవమేనన్నారు. అదేవిధంగా రోడ్డు నిర్మాణ సమయం లో వర్షం పడటంతో సిమెంట్‌ లేచిపోయిందని చెప్పారు. రోడ్డు దెబ్బతిన్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేశామని, మిగిలినచోట్ల కూడా మరమ్మతులు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-11-22T23:10:53+05:30 IST