ధాన్యం వ్యాపారి పరారీ

ABN , First Publish Date - 2022-03-05T06:09:29+05:30 IST

ధాన్యం వ్యాపారి రైతులను నట్టేట ముంచాడు. సరుకు కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా రేపుమాపు అంటూ కాలయాపన చేశాడు. చివరకు ఐపీ పెట్టి పరారయ్యాడు.

ధాన్యం వ్యాపారి పరారీ
ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధిత రైతులు

ఐపీ నోటీసు దాఖలుతో లబోదిబోమంటున్న రైతులు

న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన వైనం 

కారంచేడు(పర్చూరు), మార్చి 4: ధాన్యం వ్యాపారి రైతులను నట్టేట ముంచాడు. సరుకు కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా రేపుమాపు అంటూ కాలయాపన చేశాడు. చివరకు ఐపీ పెట్టి పరారయ్యాడు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన కారంచేడు మండలం స్వర్ణలో చోటుచేసుకుంది. స్వర్ణపాలెం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్‌ మహేష్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తుం డేవాడు. ఎనిమిది నెలలుగా ధాన్యం వ్యాపారి అవతారమెత్తి, అదే గ్రామ రైతుల నుంచి కొనుగోలు చేశాడు. ముందుగానే  డబ్బులు చెల్లిస్తూ వారి ని నమ్మించాడు. తొలినాళ్లలో ఽధాన్యం కొనుగోలు చేసిన నెలలోపే నగదు చెల్లించటంతోపాటు, వడ్డీని కూడా కలిపి ఇస్తూ రైతులను ఆకట్టుకు న్నాడు. రైతులు నమ్మిందే తడవుగా భారీమొత్తంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాడు. ఆ తర్వాత  69 మంది రైతులకు రూ.1.46 కోట్ల మేర సరుకుకు సంబంధించి నగదు చెల్లించకుండా అదిగోఇదిగో అంటూ కాలయాపన చేశాడు. గత కొన్ని రోజులుగా ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. దీనికితోడు ఇంటికి తాళంవేసి తల్లితో సహా కనిపించకుండా పోవటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మోసపోయామని తెలుసుకున్న రైతులు శుక్రవారం నిందితుడు మహేష్‌పై ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ ఎదుట తమకు నగదు ఇప్పించి ఆదుకోవాలని నినాదాలు చేశారు. మహేష్‌ ఐపీ దాఖలు చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


బైకు ఆధారంగా గుర్తించిన బాధితులు

అదృశ్యమైన వ్యాపారి కోసం వెతుకులాట ప్రారంభించిన రైతులకు చినగంజాం సమీపంలో ఓవ్యక్తి వద్ద వ్యాపారి బైక్‌ ఉండటంతో గుర్తించి ఆరా తీశారు. ఓ న్యాయవాది వద్ద బైకును ఉంచి పరారైనట్లు తెలిసింది. రూ.1.42కోట్లకు ఐపీ నోటీసు దాఖలైనట్లు తెలిసుకొని స్థానిక  పోలీసులను ఆశ్రయించారు. బాధిత రైతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అహ్మద్‌జానీ తెలిపారు.


Updated Date - 2022-03-05T06:09:29+05:30 IST