కారును ఢీకొన్న బస్సు.. హెచ్‌ఎం మృతి

ABN , First Publish Date - 2022-12-07T01:32:54+05:30 IST

పొగమంచు కమ్మేయడంతో రోడ్డుప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతిచెందిన ఘటన మండలంలోని యర్రపల్లి వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

కారును ఢీకొన్న బస్సు.. హెచ్‌ఎం మృతి

మరో నలుగురికి తీవ్రగాయాలు

శోకసంద్రంలో కుటుంబసభ్యులు

కొమరోలు, డిసెంబరు 6 : పొగమంచు కమ్మేయడంతో రోడ్డుప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతిచెందిన ఘటన మండలంలోని యర్రపల్లి వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొమరోలు ఎస్‌బీఎన్‌ఆర్‌ఎం ఎయిడెడ్‌ పాఠశాలలో గుత్తి నారాయణరెడ్డి(44) హెచ్‌ఎంగా పనిచేస్తున్నాడు. ఉద్యోగ నిమిత్తం ఆయన కుటుంబం కొమరోలులో ఉంటోంది. ఆయన పినతండ్రి కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో మృతిచెందారు. నారాయణరెడ్డి కుటుంబంతో కలిసి అంత్యక్రియలకు వెళ్లి మంగళవారం వేకువజామున కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనతోపాటు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె, సోదరుడు శ్రీనివాసరెడ్డి, సోదరుడి కుమారుడు కార్తీక్‌ ఉన్నారు. కారు కొమరోలుకు దగ్గరలోని యర్రపల్లి గ్రామ సమీపంలోకి రాగానే దట్టమైన పొగమంచు కప్పి ఉంది. దీంతో నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును కొమరోలు వైపు నుంచి వస్తున్న ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. అదేక్రమంలో వెనుక వైపు నుంచి వస్తున్న ఇసుక టిప్పర్‌ కూడా బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నారాయణరెడ్డి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు కార్తీక్‌కు తీవ్రగాయాలయ్యా యి. వారిని నంద్యాల వైద్యశాలకు తరలించారు. మిగిలిన వారిని గిద్దలూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఎస్‌ఐ సుబ్బరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. నారాయణరెడ్డి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్బరాజు తెలిపారు. వైద్యశాలను గిద్దలూరు సీఐ ఫిరోజ్‌ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణరెడ్డి మృతి వార్త తెలియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. మా మంచి మాస్టర్‌ మృతిచెందారని విద్యార్థులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Updated Date - 2022-12-07T01:32:56+05:30 IST