అంచనాకంటే ఎక్కువ ధరకు టెండర్లు

ABN , First Publish Date - 2022-08-31T06:09:43+05:30 IST

అధికార బలం ముందు టెండర్లలో పారదర్శకత ఓడిపోయింది. కాంట్రాక్ట ర్లతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కై అంచనా కంటే ఎక్కువ ధరకు బిడ్‌లు దాఖలు చేసినప్పటికీ పాలకవర్గం అడ్డంగా ఆమోదం తెలిపింది.

అంచనాకంటే ఎక్కువ ధరకు టెండర్లు
‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని చూపించి ప్రశ్నిస్తున్న టీడీపీ కౌన్సిలర్‌ వెంకటనారాయణరెడ్డి

ప్రజల సొమ్ము దుర్వినియోగంపై టీడీపీ ప్రశ్న

రద్దు చేయాలని డిమాండ్‌

మేమేమీ మహాత్మాగాంధీలం కాదన్న మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఇస్మాయిల్‌

మార్కాపురం (వన్‌టౌన్‌), ఆగస్టు 30 : అధికార బలం ముందు టెండర్లలో పారదర్శకత ఓడిపోయింది. కాంట్రాక్ట ర్లతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కై అంచనా కంటే ఎక్కువ ధరకు బిడ్‌లు దాఖలు చేసినప్పటికీ పాలకవర్గం అడ్డంగా ఆమోదం తెలిపింది. తామేమీ మహాత్మాగాంధీలం కాదంటూ మున్సిపల్‌ సమావేశంలో అధికారపార్టీ కౌన్సిలర్లు బాహాటంగా ప్రకటించడం గమనార్హం. ఐదుగురు మాత్రమే ఉన్న టీడీపీ కౌన్సిలర్లు ప్రజావాణి వినిపించినా.. అధికారపక్షం పెడచెవిన పెట్టింది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన మున్సిపల్‌ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. 27 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. ప్రధానంగా 27పనులకు 5శాతం అధికానికి కాంట్రాక్టర్లు బిడ్‌ దాఖలు చేయడంపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో ముందుగానే కుమ్మక్కై ఎక్కువ ధరకు బిడ్లు వేయించి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని 35వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ ఏరువ వెంకటనారాయణరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘అధికారం మాది.. అడిగేదెవరు’ శీర్షికన వచ్చిన కథనాన్ని సమావేశంలో ప్రదర్శించారు. దీనిపై చైర్మన్‌ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. పత్రికల్లో కొన్ని వార్తలు రాస్తూనే ఉంటారని సమాధానం దాటవేశారు. ‘ఐదుగురు కౌన్సిలర్లు ఉన్న మీకు మేము సమాధానం చెప్పాలా. మీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగిన వాటిపై విచారణ జరిపించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంకటనారాయణరెడ్డి స్పందిస్తూ, మీరు ప్రజాప్రతినిధులను పత్రికల వారిని బెదిరించడం తగదన్నారు. మీరంతా కావాలని ఎక్కువ రేటుకు కాంట్రాక్టర్లను సిండికేట్‌ చేసి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పనికీ అంచనాకు మించి బిడ్‌ వేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం టెండర్లు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ‘మీరు బిల్లులు ఇస్తే మేము అంచనా రేట్లకే పనులు చేయిస్తాం’ అని సవాల్‌ విసిరారు. దీనిపై మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. మేమేమీ మహాత్మా గాంధీలం కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లు కూడా బతకడానికే వస్తారన్నారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఎక్కువ ధరకే టెండర్లను ఆమోదించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు వెంకటనారాయణరెడ్డి, నాలి కొండయ్యలు మాట్లాడుతూ  రాష్ట్రంలో సీఎం జగన్‌రెడ్డి రివర్స్‌ టెండర్లు పిలుస్తుంటే ఇక్కడ ఇదేం పరిస్థితో అర్థం కావడం లేదని, అధికారపార్టీ కౌన్సిలర్లే ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. 


Read more