ఎట్టకేలకు స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

ABN , First Publish Date - 2022-03-05T06:08:19+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుం టున్నారు.

ఎట్టకేలకు స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు
విద్యార్థినిని పరామర్శిస్తున్న వేటపాలెం తహసీల్దార్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), మార్చి 4: ఉక్రెయిన్‌ నుంచి తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుం టున్నారు. మెడిసిన్‌ చేయడం కోసం ఉక్రెయిన్‌ దేశంవెళ్లి రష్యా దాడుల నేపథ్యంలో వారంతా వారం రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ  గడిపారు. ఒంగోలుకు చెందిన పుట్టా లక్ష్మీసాయి జస్వంత్‌, ఉలిచి శివసంపత్‌లతో పాటు, పలువురు జిల్లాకు చెందిన వారు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు తమ ఇళ్లకు చేరుకున్నారు. కాగా ఒంగోలుకు చెందిన శివ సంపత్‌, పొనుగుపాటి కాలనీకి చెందిన జశ్వంత్‌ నేడు ఇంటికి రానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న వారు ప్రత్యేక విమానాలు లేకపోవడంతో శనివారం మధ్యాహ్నం గన్నవరం చేరనున్నట్లు సమాచారం.


ఉక్రెయిన్‌ నుంచి నలుగురు రాక

ఉక్రెయిన్‌ నుంచి నలుగురు విద్యార్థులు శుక్రవారం జిల్లాకు చేరారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయగా వారు వాటిలో స్వదేశానికి చేరుకున్నారు. జిల్లాకు చెందిన మొత్తం 37మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్లు గుర్తించగా, ఇప్పటివరకు తొమ్మిది మంది స్వస్థలాలకు చేరారు. శుక్రవారం మార్కాపురం, వేటపాలెం, అర్థవీడు మండలం బొల్లాపల్లి, కనిగిరికి చెందిన విద్యార్థులు వారి స్వగ్రామాలకు చేరుకున్నారు. కాగా వేటపాలెం చేరుకున్న విద్యార్థిని అక్కడి తహసీల్దార్‌ శుక్రవారం పరామర్శించారు.


‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు : నాగప్రణవ్‌

కురిచేడు : మండలంలోని పడమర వీరాయపాలెంనకు చెందిన నాగప్రణవ్‌ ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ ఫస్టియర్‌ చదువుతున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో భయానక వాతావరణం ఏర్పడగా వారంపాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా స్వగ్రామానికి చేరారు. ఉక్రెయిన్‌లోని ఇవానో ప్రాంక్‌విస్క్‌ నుంచి గత శనివారం బస్సులో బయలుదేరి అనేక కష్టాలు పడుతూ రుమేనియా బోర్డర్‌కు చేరారు. నాలుగురోజుల తర్వాత అక్కడి నుంచి రాజధాని బుకారెస్ట్‌కు బస్‌లో తీసుకొచ్చి అక్కడ విమానాశ్రయంలో దించారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరారు. తర్వాత గన్నవరం చేరుకోగా అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి పడమరవీరాయపాలెం వచ్చారు. ‘మాకు కష్టం మొదలైన దగ్గర నుంచి ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి అండగా నిలిచాయి. మా ప్రతి విషయాన్ని కవర్‌ చేశారు. మాతో నిత్యం మాట్లాడుతూ మాకు ఽధైర్య వచనాలు చెప్పారు’ అని నాగప్రణవ్‌ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రణవ్‌ తల్లిదండ్రులు అందరికీ స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు. 


Read more