రిమ్స్‌కు పొటెత్తిన టీచర్లు
ABN , First Publish Date - 2022-12-15T23:11:41+05:30 IST
బదిలీల కోసం దరఖాస్తు చేస్తున్న ఉపాధ్యాయులు గురువారం ఒంగోలు రిమ్స్(జీజీహెచ్)కు పోటెత్తారు. బదిలీల్లో పాయింట్లు పొందేందుకు, ప్రాధాన్యత క్రమంలో ముందుగా లబ్ధి పొందేందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల కోసం టీచర్లు రిమ్స్‌లో క్యూకట్టారు. బదిలీలు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికగా జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే టీచర్లందరూ మెడికల్ సర్టిఫికెట్ల కోసం ఒంగోలు రిమ్స్‌కు రావాల్సిందే.
బదిలీల్లో పాయింట్లు పొందేందుకు పాట్లు
ఒంగోలు(విద్య), డిసెంబరు 15 : బదిలీల కోసం దరఖాస్తు చేస్తున్న ఉపాధ్యాయులు గురువారం ఒంగోలు రిమ్స్(జీజీహెచ్)కు పోటెత్తారు. బదిలీల్లో పాయింట్లు పొందేందుకు, ప్రాధాన్యత క్రమంలో ముందుగా లబ్ధి పొందేందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల కోసం టీచర్లు రిమ్స్‌లో క్యూకట్టారు. బదిలీలు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికగా జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే టీచర్లందరూ మెడికల్ సర్టిఫికెట్ల కోసం ఒంగోలు రిమ్స్‌కు రావాల్సిందే. దీంతో గురువారం వందల మంది అక్కడకు చేరుకున్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండురోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో వైద్య ధ్రువీకరణ పత్రాల కోసం అందరూ హైరానా పడుతున్నారు. కాగా ధ్రువీకరణ పత్రం కోసం రూ.2,500 చలానా తీయాల్సి ఉంది. కాగా ఉపాధ్యాయులు, వారి బంధువులను పరిశీలించిన వైద్యులు ధ్రువీకరణ పత్రం మాత్రం 17వ తేదీన ఇస్తామని చెబుతున్నారు. దీంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17న దరఖాస్తుకు చివరి రోజు కాగా అదే రోజు సరిఫికెట్ ఇస్తే ఎలా అప్లై చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య పత్రం పొందాలంటే..
- మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉపాధ్యాయులు ఆ పిల్లలకు వైద్య సౌకర్యాలు లభించే ప్రాంతానికి దగ్గర స్థానాలకు బదిలీ చేయమన్నారు.
-క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్, అవయవ మార్పిడి, న్యూరో సర్జికల్ ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి, డయాలసిస్ పేషెంట్లు అయిన టీచర్లకు వారి వైద్యసేవలు లభించే ప్రాంతానికి దగ్గరలో బదిలీ చేయనున్నారు. ఉపాధ్యాయుడు స్వయంగా కానీ జీవిత భాగస్వామి కానీ తనమీద ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
- ప్రాధాన్యత కేటగిరిలో వీరు బదిలీలు పొందాలంటే ఉపాధ్యాయులు తాజా మెడికల్ రిపోర్టులను జిల్లా మెడికల్ బోర్డు ద్వారా ధ్రువీకరించి బదిలీ దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కమిటీకి కూడా వైద్య ధ్రువీకరణ పత్రాలు అంద జేయాలి.
- దివ్యాంగుల రిజర్వేషన్‌లో ఉద్యోగాలకు ఎంపికైన టీచర్లు తమ సేవా పుస్తకాల్లో 20 శాతం వైకల్యం తదితర వివరాలు నమోదు చేసి ఉంటే అటువంటి శారీరక వైకల్యం గల టీచర్లు కొత్తగా ఎటువంటి వైద్య ధ్రువీకరణ సమర్పించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు రెండురోజులే గడువు
ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండు రోజులే మిగిలి ఉంది. ఈనెల 14 నుంచి 17 వరకు టీచర్లు తమ బదిలీల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని షెడ్యూల్ ప్రకటించారు ఆ ప్రకారం గురువారానికి రెండు రోజులు ముగిసింది. ఇక శుక్ర, శనివారాలు మాత్రమే మిగిలి ఉంది. బదిలీ కోసం టీచర్లు ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. టీచర్లు ముందుగా నమూనా దరఖాస్తు వివరాలను నమోదు చేసి ఆ వివరాలను సంబంధిత హైస్కూలు హెచ్‌ఎం, మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి ధ్రువీకరించిన తర్వాతే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. బదిలీల్లో అక్రమగా లబ్ధిపొందేందుకు తప్పుడు సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఒకటికి రెండుసార్లు వివరాలు ధ్రువీకరించకున్న తర్వాతనే అప్‌లోడ్ చేయాలి.