పొగాకు బోర్డులో అధికారుల కొరత

ABN , First Publish Date - 2022-09-10T06:26:45+05:30 IST

పొగాకు బోర్డులో విచిత్ర పరిస్థితి నెలకొంది. మొత్తం బోర్డు కార్యకలాపాల నిర్వహణలో కీలకమైన రీజనల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) స్థాయి అధికారుల కొరత ఏర్పడింది.

పొగాకు బోర్డులో  అధికారుల కొరత
ఒంగోలులోని పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయం

మైసూరుకు బదిలీచేయడంతో వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఎస్‌ఎల్‌ఎస్‌ ఆర్‌ఎం

తాజాగా ఒంగోలు ఆర్‌ఎం అక్కడికి  డిప్యుటేషన్‌

ప్రొడక్షన్‌ మేనేజర్‌కు ఒంగోలు రెండు రీజియన్ల పర్యవేక్షణ బాధ్యతలు

ఒంగోలు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పొగాకు బోర్డులో విచిత్ర పరిస్థితి నెలకొంది. మొత్తం బోర్డు కార్యకలాపాల నిర్వహణలో కీలకమైన రీజనల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) స్థాయి అధికారుల కొరత ఏర్పడింది. సకాలంలో కిందిస్థాయి అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించడం, అవసరమైన మేర నియామకాలు చేపట్టడంలో ఉన్నతస్థాయిలో అలసత్వంతో ఇలా కొరత ఏర్పడింది. ఆ పరిస్థితిని అధిగమించేందుకు ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఒంగోలులోని ఎస్‌ఎల్‌ఎస్‌ రీజనల్‌ మేనేజర్‌గా ఉన్న వై.ఉమాదేవిని మైసూరుకు బదిలీచేశారు. అక్కడ ఉన్న రెండు ఆర్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండటంతో అలా చేసినట్లు చెప్తుండగా మూడు నెలల క్రితమే  పదోన్నతిపై ఇక్కడకు ఆర్‌ఎంగా వచ్చిన తనను బదిలీ చేయడమేమిటంటూ ఆమె ఏకంగా వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. దీంతో మైసూరులో ఉన్న రెండు ఖాళీలతోపాటు ఇక్కడ ఎస్‌ఎల్‌ఆర్‌ రీజియన్‌ కూడా ఖాళీ అయింది. వచ్చేనెలలో కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానుండటంతో ఒంగోలులో ఎస్‌బీఎస్‌ ఆర్‌ఎంగా ఉన్న లక్ష్మణరావును రెండురోజుల క్రితం మైసూరులోని రీజియన్లకు ఇన్‌చార్జి ఆర్‌ఎంగా డిప్యుటేషన్‌పై పంపారు. అదే సమయంలో ఒంగోలులో రెండు ఆర్‌ఎం పోస్టులు ఖాళీకావ డంతో గుంటూ రు బోర్డు ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా ఉన్న కృష్ణవేణికి ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు. 

Updated Date - 2022-09-10T06:26:45+05:30 IST