ఇక ‘గల్ల’కమ్మ!
ABN , First Publish Date - 2022-12-15T01:30:12+05:30 IST
గుండ్లకమ్మ పరీవాహకంలో ఇసుక తవ్వకాలతో భారీగా దండుకుంటున్న అధికారపార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా రిజర్వాయర్లోనే తోడేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టులోని అన్నంగి ప్రాంతంలో ఇసుక కోసం డ్రెడ్జర్ను ఏర్పాటు చేశారు. అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తుండటంతో చర్యలు తీసుకునే విషయంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
జలాశయంలో కాసుల వేట
ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం
ఇసుక తవ్వితే పర్యావరణం దెబ్బతినే అవకాశం
ఆలస్యంగా అనుమతులు కోరిన ప్రైవేటు కంపెనీ
నిబంధనలు బేఖాతరు
వైసీపీ నాయకుల అండదండలతోనే అంతా..
చోద్యంచూస్తున్న అధికారులు
గుండ్లకమ్మ పరీవాహకంలో ఇసుక తవ్వకాలతో భారీగా దండుకుంటున్న అధికారపార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా రిజర్వాయర్లోనే తోడేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టులోని అన్నంగి ప్రాంతంలో ఇసుక కోసం డ్రెడ్జర్ను ఏర్పాటు చేశారు. అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తుండటంతో చర్యలు తీసుకునే విషయంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. పోలీసులైతే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. డ్రెడ్జర్ ఏర్పాటు చేసి ఐదు రోజులు కావస్తున్నా తీయించలేకపోతున్నారు. రెవెన్యూ, జలవనరులు, గనుల శాఖ అధికారులు మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి అక్రమార్కులు చెప్పిన మాటలు విని వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే అధికారులకు స్వామిభక్తి ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఒంగోలు(క్రైం)/మద్దిపాడు, డిసెంబరు 14 : గుండ్లకమ్మ ప్రాజెక్టును గుల్లచేసేలా ఇసుక వేట ప్రారంభమైంది. నిబంధనలు తుంగలో తొక్కి రిజర్వాయర్లో ఉన్న ఇసుక మేట నుంచి కాసులు తీసేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ అండతో ఎలాంటి అనుమతులు లేకుండానే ఏకంగా డ్రెడ్జర్తో తవ్వకాలకు దిగిపోయారు. జలాశయాన్ని కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండగా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం అసలు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. మొత్తంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును సాగునీటితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందించేందుకు నిర్మిస్తే.. అధికారపార్టీ వారికి మాత్రం ఇసుక వనరుగా మారింది. నిబంధనల ప్రకారం.. ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే జిల్లా శాండ్ కమిటీ అనుమతి పొందాలి. ఇలాంటివేమీ లేకుండా సంబంధిత వ్యక్తులు నేరుగా డ్రెడ్జర్ను జలాశయంలో దింపి చుట్టూ కనీసం కిలోమీటర్ లోపు ఉన్న ఇసుకను బయటకు తీసి అమ్ముకునేందుకు పన్నాగం పన్నారు. అయితే మీడియాలో కథనాల నేపథ్యంలో అనుమతులు కోసం కలెక్టర్కు ప్రైవేటు కంపెనీ లేఖ రాయడం గమనార్హం. స్థానిక అధికారులు మాత్రం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు.. అయినా ఏం చేయలేకపోతున్నామని చెబుతుండటం విడ్డూరంగా ఉంది.
నీరు తక్కువగా ఉండటంతోనే..
ప్రాజెక్టులో 1.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్ల మరమ్మతులు పూర్తికాకపోవడంతో పైనుంచి వస్తున్న వరదను సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో నిండా నీరుంటే ఇసుక తవ్వడం అంత సులభం కాదు. నీరు లేకపోవడం ఇసుకాసురులకు కలిసొచ్చింది. ఇదే అదనుగా ఏకంగా ప్రాజెక్టులో యంత్రంతోపాటు దిగిపోయారు. ఎవరూ గమనించకుండా ఉంటే ఈపాటికే వందల టన్నుల ఇసుకను తరలించేవారు. అయితే వారి ప్రయత్నాన్ని స్థానిక రైతులు మొదటే గుర్తించి మీడియాకు తెలియజేశారు. డ్యాం ప్రాంతంలో అధికారులు, మీడియా హడావుడి ఎక్కువ కావడంతో యంత్రాన్ని బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి ప్రాంతానికి తరలించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గుండ్లకమ్మలోని ఇసుకను కొల్లగొట్టే ప్రయత్నం
గుండ్లకమ్మను గుల్ల చేసి భారీఎత్తున ఇసుకను కొల్లగొట్టాలని ప్రైవేటు కంపెనీ ముసుగులో కొందరు వైసీపీ నేతలు సన్నద్ధమయ్యారు. అందుకు వారం క్రితం ఇసుక తోడే యంత్రాన్ని రిజర్వాయర్లోకి దించడంతోపాటు అందుకు కావాల్సిన ఇనుప పైపులను భారీగా తెచ్చిపెట్టారు. అంతేకాదు జలాశయంలో డ్రెడ్జర్ ఎక్కడికైనా వేళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇసుకను తరలించేందుకు బోట్లు సిద్ధం చేశారు.
అనుమతులు ఇచ్చేందుకు రెండు శాఖల పరిశీలన
డ్రెడ్జర్ను ప్రాజెక్టులోకి దించిన విషయం బయటప డటంతో ఇసుక తవ్వకాలకు పన్నాగం పన్నిన వారు అధికారులకు దరఖాస్తు చేశారు. దీంతో ఇరిగేషన్, మైనింగ్ అధికారులు హడావుడిగా మంగళవారం పరిశీలన చేశారు. వారిచ్చే నివేదిక ఆధారంగా జిల్లా శాండ్ కమిటీ వారి ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంది. అనంతరం కలెక్టర్ అనుమతులు ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులు లేవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కలెక్టర్కు ప్రైవేటు కంపెనీ అనుమతి కోసం లేఖ ఇవ్వగానే హడావుడిగా అధికారులు పరిశీలనకు రావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఉన్న డ్రెడ్జర్ను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మీనమేషాలు లెక్కపెడుతున్నారు
ఈనెల 7న గుండ్లకమ్మ రిజర్వాయర్లోకి ఇసుక తోడే యంత్రాన్ని దించి తవ్వకాలకు సిద్ధమవుతుంటే సంబంధిత ఇరిగేషన్ శాఖ తూతూమంత్రంగా పోలీసులకు ఫిర్యాదు చేసి తమ పనై పోయిందన్నట్లు చూస్తున్నారు. అంతే తప్ప ఆ డ్రెడ్జర్ను బయటకు తీసేందుకు అసలు సమాయత్తం కాలేదు. అదే సమ యంలో పోలీసులు కూడా ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు గురించి పట్టించుకోని పరిస్థితి. తహసీల్దార్ సైతం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. అంటే అధికారపార్టీ అండ ఉందనే భయంతో అందరూ వెనకడుగు వేస్తున్నారని ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు.
పర్యావరణం దెబ్బతినే అవకాశం
వాల్టా చట్టం ప్రకారం నది పరీవాహక ప్రాంతంలో మూడు మీటర్ల లోతు మాత్రమే తవ్వకాలు చేయాలి. అయితే డ్రెడ్జర్తో ఇసుక తవ్వితే ఎక్కువ లోతు గోతులు పడి మొత్తంగా ఆ జలాశయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. ఒకపక్క డ్యాం కింది ప్రాంతంలోని కొలచనకోట, మల్లవరం ప్రాం తాల్లో అక్రమార్కులుు ఇష్టానుసారంగా రాత్రుళ్లు ఇసుకను తవ్వుతున్నారు. నియంత్రిం చాల్సిన పోలీసు, రెవెన్యూ, గనులు, జలవన రుల శాఖ అధికారులు పట్టించుకోపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకాసురులు ఇచ్చే మామూళ్లు పుచ్చుకొని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.