రేషన్ బియ్యం నిల్వలే నిల్వలు
ABN , First Publish Date - 2022-08-16T04:33:20+05:30 IST
జిల్లాలో రేషన్ షాపుల్లో అక్రమంగా బియ్యాన్ని వందలాది బస్తాలను నిల్వ చేశారు. గత నెల నుంచి ఆయా దుకాణాల వద్ద ఉన్న బియ్యాన్ని తరలించని పరిస్థితి ఏర్పడింది.

ఒక్కొక్క షాపులో 100 నుంచి 50 బస్తాల వరకు స్టాక్
తనిఖీలను విస్మరించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
ఈనెలలో ఒకేసారి రెండు ప్రభుత్వాల బియ్యం పంపిణీ
పోలీసుల తనిఖీలతో షాపుల నుంచి తరలించలేకపోతున్న అక్రమ వ్యాపారులు
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 15 : జిల్లాలో రేషన్ షాపుల్లో అక్రమంగా బియ్యాన్ని వందలాది బస్తాలను నిల్వ చేశారు. గత నెల నుంచి ఆయా దుకాణాల వద్ద ఉన్న బియ్యాన్ని తరలించని పరిస్థితి ఏర్పడింది. జిల్లా విభజన అనంతరం 1,392 రేషన్ షాపుల పరిధిలో 6.55 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ప్రతినెల 10,393 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నారు. 10,393 మెట్రిక్ టన్నుల బియ్యంలో పట్టుమని పదిశాతం కూడా లబ్ధిదారులు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఆ బియ్యాన్ని మొత్తం మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తుండగా కార్డుదారుల వేలిముద్ర వేసుకొని కేజీకి రూ.10లెక్కన డబ్బులిచ్చి బియ్యాన్ని అదే వాహనంలో తిరిగి తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్ళిన బియ్యాన్ని రాత్రికిరాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. గతనెలలో జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు విస్తృతంగా చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో అధికారపార్టీ మాఫియా షాపుల్లో బియ్యాన్ని తరలించేందుకు ఽధైర్యం చేయలేదు. దీంతో ప్రస్తుతం ఆ రేషన్‌షాపుల్లోనే నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది.
తనిఖీలను విస్మరించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
కాగా పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలను విస్మరించారు. దీంతో రేషన్‌షాపుల డీలర్లందరూ 90శాతం మంది అధికారపార్టీ సానుభూతి పరులు కావడంతో ఆ శాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో పోలీసులు రాత్రి సమయంలో గస్తీలు తిరగడంతోపాటు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా ఇటీవల త్రిపురాంతకంతో పాటు కొమరోలు మండలం కొత్తపల్లిలో 300 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ నెల 5న తెల్లవారుజామున ఒంగోలు నుంచి ఒక లారీలో బియ్యం తరలించేందుకు ప్రయత్నించగా ఆ సమయంలో బ్లూకోట్స్ టీం ఆ ప్రాంతానికి రావడంతో వెనక్కితగ్గారు. దీంతో అక్రమార్కులు బియ్యం తరలించేందుకు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రేషన్‌షాపుల్లో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. అలా అన్ని ప్రాంతాల్లో భారీగా రేషన్‌బియ్యం నిల్వలు ఉన్నా పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.