మా భూములను కాపాడండి
ABN , First Publish Date - 2022-06-28T05:36:16+05:30 IST
తాము సాగు చేసుకుంటున్న భూముల్లో పంటను దున్నేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ సోమవారం యానాదులు స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.

పోలీసుస్టేషన్ ఎదుట ఎస్టీల ధర్నా
తమపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ గేటు ముందు బైఠాయింపు
సీఐ, తహసీల్దార్ చర్చలు
అట్రాసిటీ కేసు నమోదుకు హామీ ఇవ ్వడంతో ఆందోళన విరమణ
కొత్తపట్నం, జూన్ 27: తాము సాగు చేసుకుంటున్న భూముల్లో పంటను దున్నేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ సోమవారం యానాదులు స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. కొత్తపట్నంలోని డీడీ కాలనీవాసులు సాగు చేసుకుంటున్న భూములను కాజేసేందుకు దౌర్జన్యం చేయడంతోపాటు కులం పేరుతో దూషించిన వారిపై పోలీసులు రోజులు గడుస్తున్నా కేసు నమోదు చేయలేదంటూ యానాదుల ఐక్యవేదిక ఆధ్య ర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. యానాదుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ పెంచలయ్య, గౌరవాధ్యక్షుడు మెలికా శ్రీనివాసరావు, అధ్యక్షుడు కత్తి పద్మ తదితరులు నాయకత్వం వహించారు. ఈనెల 20, 24 తేదీల్లో కొందరు బీసీలు డీడీకాలనీ యానాదులు సాగు చేసుకుంటున్న భూముల్లోని పంటను దున్నేసి, మోటార్లు ఎత్తుకుపో యారు. అడ్డువచ్చిన ఎస్టీ మహిళల్ని కులంపేరుతో తిట్టారని ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. బాధితులు రెండుసార్లు ఫిర్యాదుచేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గేటు ఎదుటే బైఠాయించారు. మధ్యాహ్న భోజనాలు అక్కడే చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఒంగోలు టూటౌన్ సీఐ రాఘవరావు కొత్తపట్నం వచ్చి బాధితులతో మాట్లాడారు. భూమి పత్రాలు చూశారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. తహసీల్దార్ విజయలక్ష్మి కూడా ఆందోళన వద్దకు చేరుకున్నారు. భూములు ఎస్టీలకు ప్రభుత్వం పంపిణీ చేసినవేనని నిర్ధారించారు. భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎస్టీలు ఆందోళన విరమించారు.