ప్ర..కా..శం...!

ABN , First Publish Date - 2022-02-02T04:19:41+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తొలుత ఏర్పడింది. ప్రకాశం జిల్లా. నాడు గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఒంగోలు, కందుకూరు మార్కాపురం రెవెన్యూ డివిజన్లు కలిపి 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుచేయగా 1972 డిసెంబరు 5న జిల్లాకు చెందిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు.

ప్ర..కా..శం...!

మళ్లీ మూడు ముక్కలు

ఇవే చివరి ఆవిర్భావ వేడుకలు

అర్ధ శతాబ్ది దాటినా నెరవేరని జిల్లా ఏర్పాటు లక్ష్యం

సాగు, తాగునీరు, విద్య, వైద్యం అంతంతమాత్రం

ముందుకు సాగని గ్రామీణ  అభివృద్ధి, ఉపాధి మార్గాలు

తీవ్ర సంక్షోభంలో కీలక వ్యవసాయరంగం

మౌలిక సదుపాయాల మెరుగుపైనా నిర్లక్ష్యం

అశాస్త్రి్త్రయంగా బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాలుగా విభజన ప్రతిపాదనలు

ప్రభుత్వ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనలు


వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో మూడు జిల్లాల్లోని మూడు ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా మళ్లీ మూడు ముక్కలవుతోంది. జిల్లా ఆవిర్భావించి అర్ధ శతాబ్ది దాటినా అభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపు, మౌలిక సదుపాయాల మెరుగు వంటి అంశాలలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించక ముందే ప్రభుత్వం తాజా నిర్ణయంతో మళ్లీ జిల్లా విడిపోతోంది. జిల్లా ఆవిర్భవించి 52 ఏళ్లు పూర్తయి మంగళవారం 53వ ఏట అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో నాటి జిల్లా ఆవిర్భావ లక్ష్యం ఏ మేరకు సాధించారన్నది పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనిపిస్తోంది.  ప్రభుత్వ తాజా నిర్ణయం చూస్తే జిల్లా పునర్విభజన పూర్తి అశాస్త్రీయంగా, అధికశాతం మంది ప్రజలకు అసౌకర్యంగా ఉందన్న విమర్శలున్నాయి.  ఈ విభజనను వ్యతిరేకిస్తూ పలుప్రాంతాల ప్రజలు ఉద్యమబాట పట్టారు. 

ఒంగోలు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తొలుత ఏర్పడింది. ప్రకాశం జిల్లా. నాడు గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఒంగోలు, కందుకూరు మార్కాపురం రెవెన్యూ డివిజన్లు కలిపి 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుచేయగా 1972 డిసెంబరు 5న జిల్లాకు చెందిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు. మూడు ప్రాంతాల ప్రజలు విభిన్న సమస్యలతో సతమతం అవుతుండేవారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధే లక్ష్యంగా జిల్లా ఏర్పాటుచేయగా కీలక రంగాల అభివృద్ధి, ప్రజల జీవన విధానంలో మార్పు, మౌలిక సదుపాయాల మెరుగు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంపులో ఇంతవరకు ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. జిల్లా ఆవిర్భవించి 52 ఏళ్లు పూర్తితో పాటు మళ్లీ విభజన జరుగుతున్న తరుణంలో ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన కీలక అంశాల పరిస్థితి పరిశీలిస్తే నాడు జిల్లా ఏర్పాటు లక్ష్యం ఇంతవరకు నెరవేరలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.


ముందుకు కదలని ప్రాజెక్టులు

జిల్లా అభివృద్ధి, ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర అంశాలలో ప్రధానమైన సాగు, తాగునీరు, విద్య, వైద్య  రంగాల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండగా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపు అడుగు ముందుకు సాగలేదు. ఇక ప్రధాన జీవనాధారంగా ఉన్న వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో నెట్టివేయబడగా మౌలిక సదుపాయాల మెరుగు ముందుకు సాగలేదు. జిల్లా ఏర్పాటు సమయంలో సాగర్‌ కాలువలు జిల్లాలోకి ప్రవేశించగా ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి సౌకర్యాలు పెరిగి వ్యవసాయం, పాడి పరిశ్రమలు వృద్ధి చెందాయి.  అవి కొద్దిప్రాంతాలకే పరిమితంతో పాటు కొన్నేళ్లకే సాగర్‌ నీరు సరిగా రాక ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. కీలక ప్రాజెక్టులు మూడడుగులు ముందుకు ఆరడులు వెనక్కి అన్నచందంగా మారాయి. వెలిగొండ ప్రాజెక్టు పాతికేళ్లుగా సాగుతుండగా ఇప్పటికి ఒక టన్నెల్‌ పూర్తయింది. రూ.8,800 కోట్లకు నిర్మాణ వ్యయం అంచనాలు పెరగ్గా ఇంచుమించు రూ.5500కోట్లు ఖర్చుచేశారు. అయినా పునరావాస ప్రక్రియకు నిధులు కేటాయింపుల జాప్యంతో తొలిదశకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి. ఇక గుండ్లకమ్మ, రామతీర్థం పూర్తయినా లక్ష్యం మేర వాటి ప్రయోజనం ప్రజలకు అందడం లేదు. పాలేరు రిజర్వాయర్‌, కొరిశపాడు ఎత్తిపోతల పథకం, భవనాశి, పాలేటిపల్లి ఇతర పలు పథకాలు కదల్లేదు. అలాగే జిల్లా ప్రజలందరికీ రక్షిత తాగునీటి సరఫరా కోసం రూ.5300కోట్లతో చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ పథకం అడుగు ముందుకు పడలేదు. దీంతో వేసవిలో అయితే సగం జిల్లాకు తాగునీటి ఇక్కట్లే.


యూనివర్సిటీ లేని జిల్లా

విద్య, వైద్య రంగాలను పరిశీలిస్తే నేటికి యూనివర్సిటీ లేని ఏకైక జిల్లాగా ప్రకాశం ఉంది. మూడేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఆంధ్రకేసరి వర్సిటీ అడుగు  ముందుకు  పడలేదు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత మంజూరైన అబ్దుల్‌ కలాం ట్రిపుల్‌ఐటీ నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాకపోగా ఇతర ఉన్నత విద్య కావాలంటే పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సిందే. వైద్య రంగం పరిస్థితి అలాగే ఉంది. జిల్లాకేంద్రంలో పేరుకు మెడికల్‌ కాలేజీ, అనుబంధంగా పెద్దాస్పత్రి ఉన్నా ఏ ఒక్క సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అవసరమైన ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిందే. ప్రైవేటు రంగంలోనూ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండగా పశ్చిమ ప్రాంత పరిస్థితి మరింత దారుణం. ఈ పరిస్థితుల్లో మార్కాపురం దగ్గర మెడికల్‌ కాలేజీ మంజూరైనా నిర్మాణం పూర్తి, సేవలు అందుబాటులోకి ఎన్నడు అన్నది అర్థం కాని పరిస్థితి. 


ఉపాధి కల్పన లేదు

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోం ది. జిల్లాలో అపారంగా వనరులు, ముడిసరుకు ఉన్నా ఆ దిశగా ప్రయత్నా లు జరగకపోగా మంజూరైన ప్రాజెక్టులు కూడా వెనక్కిపోయాయి. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, కనిగిరి నిమ్జ్‌, రామాయపట్నం పోర్టు, పేప రు పరిశ్రమ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, సోలార్‌ ప్లాంట్లు వంటివి అడుగుముందుకు పడటం లేదు. గ్రామీణ ప్రజల జీవనాధారంగా ఉన్న వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తీరుతో సంక్షోభం లో పడ్డాయి. జిల్లాకు తలమానికంగా ఉండే ఒంగోలు డెయిరీకి సమాధి కట్టేసి అమూల్‌సేవలో తపిస్తుడటం పాడి పరిశ్రమకు శాపంగా మారింది. 


హేతబద్ధత లేని విభజన

 వారంక్రితం రాష్ట్రప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తూ ముసాయిదాను ప్రకటించింది. ఆ ప్రకారం ప్రస్తుతం జిల్లాలో ఉన్న ప్రాంతాలు తిరిగి మూడు ముక్కలు కానున్నాయి. పార్లమెంట్‌ స్థానం ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటును ప్రకటించిన ప్రభుత్వం ఒంగోలు పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు ఎస్‌ఎన్‌పాడును కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను ప్రకటించారు. ఇక కందుకూరు సెగ్మెంట్‌ను నెల్లూరు జిల్లాలోకి, మిగిలిన చీరాల, పర్చూరు, అద్దంకిలను బాపట్ల జిల్లాలో కలిపారు. అదే సమయంలో ఒంగోలు, మార్కాపురం డివిజన్లను కొనసాగిస్తూ అతి పెద్దదిగా ఉన్న కందుకూరును రద్దుచేశారు. అలాగే చీరాల, కనిగిరి కేంద్రాలుగా డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాపై అత్యధిక ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 


మార్కాపురం కోసం నిరసనలు

ఒంగోలుకు సుదూరంగా పశ్చిమాన 100 నుంచి 150కి.మీ దూరంలో ఉన్నందున ఆ ప్రాంత ప్రజలు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోరుతూ ఏకంగా ఉద్యమబాట పట్టారు. ఈనెల 7 నుంచి పాదయాత్రకు సన్నద్ధం అవుతున్నారు. అలాగే కందుకూరు డివిజన్‌ రద్దుపై కూడా ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా తదనుగుణంగా ఉద్యమాలు వస్తున్నాయి. అద్దంకి ప్రాంతంలోనూ ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా అమలులోకి వస్తే బుధవారం నిర్వహించేదే ప్రస్తుత జిల్లా చివరి ఆవిర్భావ వేడుకలు కానున్నాయి. ప్రస్తుత ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేసినా 52 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన జిల్లా బౌగోళిక, నైసర్గిక స్వరూపం మారిపోనుంది. 

Updated Date - 2022-02-02T04:19:41+05:30 IST