నగరంలో మారనున్న పోలీసు స్టేషన్‌లు
ABN , First Publish Date - 2022-12-22T01:21:18+05:30 IST
నగరంలో పోలీసు స్టేషన్ల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది. నగరం వేగంగా అభివృద్ధి చెందడం, అదేక్రమంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపఽథ్యంలో ప్రస్తుతం ఉన్న స్టేషన్ల పరిధిని భౌగోళికంగా మార్పు చేసేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
తాలూకా స్టేషన్ ప్రక్షాళన.. కొత్తగా త్రీటౌన్, రూరల్
తాలూకా స్థానంలో త్రీటౌన్ ఏర్పాటు
ఒంగోలు టూటౌన్ సర్కిల్‌లోకి రూరల్
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
ఒంగోలు(క్రైం), డిసెంబరు 21: నగరంలో పోలీసు స్టేషన్ల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది. నగరం వేగంగా అభివృద్ధి చెందడం, అదేక్రమంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపఽథ్యంలో ప్రస్తుతం ఉన్న స్టేషన్ల పరిధిని భౌగోళికంగా మార్పు చేసేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ స్థానంలో త్రీటౌన్, నూతనంగా రూరల్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. అదనంగా రూరల్ స్టేషన్ ఏర్పాటు చేయడం కాస్త భారమవుతుందని అంచనా. అందుకోసం ఆర్థిక శాఖ అనుమతులు అవసరం. త్రీటౌన్ ఏర్పాటుకు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. కేవలం తాలూకా స్టేషన్ పేరు మారిస్తే సరిపోతుంది. ప్రస్తుతం తాలూకా పరిధి ఎక్కువ కావడంతోపాటు నెలవారీ కేసులు కూడా అధికంగా ఉంటున్నాయి. దీంతోపాటు పోలీసింగ్ కాస్త ఇబ్బందిగా మారింది. ప్రజలకు పోలీసు సేవలు అందడం కూడా అంతంతమాత్రంగా ఉంది. దీంతో స్టేషన్ల పునర్విభజనకు అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. అన్ని స్టేషన్లు సమానంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మారనున్న పరిధులు
నూతనంగా రూరల్‌తోపాటు త్రీటౌన్ ఏర్పాటు చేస్తే పరిధులు కూడా భారీగా మారనున్నాయి. తాలూకా పరిధిలో ఉన్న గ్రామాలు అంటే జాతీయ రహదారికి తూర్పున ఉన్న త్రోవగుంట, కరవది, కొప్పోలు, ఆలూరు, అగ్రహారం, పెళ్లూరుతోపాటు రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్‌నగర్, బృందావన్ నగర్, డ్రీమ్స్ స్కూల్ ప్రాంతాలను కలిపి రూరల్ స్టేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వన్‌టౌన్ కింద ఉన్న ప్రాంతంతోపాటుగా కొత్తగా బృందావన నగర్, నిర్మల్‌నగర్, వీఐపీ రోడ్డు, భాగ్యనగర్ పూర్తిగా, దక్షిణ బైపాస్ వరకు కలుపుతారు.
ూ ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రస్తుతం తాలుకాలో ఉన్న బిలాల్ నగర్, గోపాల్‌నగర్ ఎక్స్‌టెన్షన్, కరవదివారి వీధి, అరవకాలనీ రామ్‌నగర్ ఎనిమిదో లైన్ నుంచి 11 లైన్ వరకు, సంఘమిత్ర ఆసుపత్రి జంక్షన్ వరకు కలపనున్నారు.
ూ కల్వరీ టెంపుల్ నుంచి సంఘమిత్ర వరకు పాత బైపాస్ రోడ్డుకు పడమర ఉన్న ప్రాంతంతోపాటు కర్నూలు రోడ్డు, సత్యన్నారాయణపురం, చంద్రయ్యనగర్, ఎన్‌జీవో కాలనీ, పేర్నమిట్టతోపాటు పరిసర కాలనీలు ఒంగోలు త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటాయి.
టూటౌన్ సర్కిల్ పరిధి పెంపు
ఒంగోలు టూటౌన్ సర్కిల్ పరిధి పెరగనుంది. ప్రస్తుతం ఉన్న టూటౌన్‌తో పాటుగా కొత్తపట్నం, నూతనంగా ఏర్పాటు చేయనున్న రూరల్ స్టేషన్‌లో కలుపుతారు. ఈమేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే ఇలాంటి ప్రతిపాదనలే దశాబ్దం క్రితం రూపొందించినప్పటికీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడైనా మార్పులు జరుగుతాయా? అనే చర్చ నడుస్తోంది.