ఇన్చార్జుల పాలనలో విసిగిపోతున్న ప్రజలు
ABN , First Publish Date - 2022-08-15T06:18:41+05:30 IST
మండలంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో రెవెన్యూ ఒకటి. వివిధ పనుల కోసం ప్రజలు, రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు వస్తుంటారు.

పొదిలి రూరల్ ఆగస్టు 14 : మండలంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో రెవెన్యూ ఒకటి. వివిధ పనుల కోసం ప్రజలు, రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు వస్తుంటారు. పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ తహశీల్దార్, పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.
రెండున్నరేళ్లుగా మండలంలో ఇన్చార్జ్ తహసీల్దారే దిక్కయ్యారు. అర్హులైన అధికారులు ఉన్నా పొదిలి అనగానే ఏదో తెలియని భయానికి గురై అధికారులు మొహం చాటేస్తున్నారు. ప్రస్తుతం కొనకనమిట్ల, పొదిలికి ఒకే తహశీల్దార్ కొనసాగుతున్నారు. రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనేది జోరుగా ప్రచారం సాగుతోంది. అందులోనూ, ఆక్రమణలు కూడా అధికంగా ఉంటాయని నానుడి. ప్రతి మండల నాయకుని వద్ద నుంచి గ్రామ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ, ఏ చిన్న పని ఉన్నా చేయకూడని పనులు కూడా చేయాలని హుకుం జారీ చేస్తున్నారని కొందరు అధికారులు అంటున్నారు. ఎమ్మెల్యేతో చెప్పిస్తాం, మంత్రితో చెప్పిస్తాం అంటూ దబాయింపులకు దిగుతున్నారనేది ఉద్యోగుల వాదన. దీంతో ఉద్యోగం చేయాలంటే నాయకులకు అనునా యులుగా ఉండాల్సి వస్తోందని బదిలీలు చేయిస్తామని బెదిరింపులు ఉన్నాయని అధికారులు అంటున్నారు. రెండెళ్లకుపైగా ఉన్న తహసీల్దార్ ప్రభాకర్ రావు మాత్రమే ఏడాదికాలం పనిచేఽశారు. ఆయన జగనన్న కాలనీల విషయంలో వైసీపీ నాయకులకు సహకరించలేదని ఉన్నఫలంగా ఆయనపై బదిలీ వే టుపడింది. ఆ తరువాత కొండపి నుంచి పద్మావతిని పొదిలి తహసీల్దార్‌గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆమె పొదిలి అనగానే బాధ్యతలు చేపట్టకుండానే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత యర్రగొండపాలెంలో రేషన్ డీటీగా పనిచేస్తున్న రవీంద్రారెడ్డిని ఎఫ్ఏసీ తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆయన పట్టుమని పదిరోజులు కూడా కుర్చీలో కూర్చోకుండానే సెలవుపై వెళ్లారు. ఆ తరువాత ఆరు నెలలు పదవీకాలం ఉందనగా హనుమంతరావును తహసీల్దార్‌గా నియ మించారు. అయితే ఆరు నెలలకు ఒక్కరోజు ముందు ప్రభుత్వ ఆస్తులు కాపడటంలో విఫలమయ్యారనే కారణంగా పదవి విరమణకు ఒక్కరోజు ముందు హనుమంతరావుపై సస్పెండ్ వేటు పడింది. ఆతువాత రఫీ భాద్యతలు చేపట్టారు. అయితే ఆయనకూడా నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక మూడు నెలలకే సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం దర్శి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న దేవప్రసాద్‌ను ఎఫ్ఏసీపై పొదిలి తహసీల్దార్‌గా నియమించారు. అయితే అయన నాలుగు నెలలకు మించి పనిచేయలేకపోయారు. ప్రస్తుతం సాధారణ బదిలీల్లో భాగంగా తహసీల్దార్‌గా ఉన్న దేవ ప్రసాద్ బదిలీ కావడంతో పొదిలికి రావడానికి ఎవరు సహసించడం లేదు. కొనకనమిట్ల మండలం తహసీ ల్దార్‌గా వచ్చిన ప్రసాదరావును పొదిలి ఇన్చార్జి తహసీల్దార్‌గా నియమించారు. అసలే సిబ్బంది కొరతతో సతమతమౌతున్న తహసీల్దార్ కార్యాలయానికి పరిమినెంట్ తహసీల్దార్ లేకపోవడంతో అనేక రాకాల పనులపై వచ్చిన ఫైళ్లు పేరుకుపోతున్నాయి. కావలసిన పనులుకాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్, రికార్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ తహసీల్దార్‌తోపాటు మిగతా సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.