అందుబాటులో లేని అధికారులు

ABN , First Publish Date - 2022-10-17T05:58:03+05:30 IST

కంభం తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో పలు సమస్యలపై మండలంలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు చేతపట్టుకుని వచ్చిన బాధితులు సాయంత్రం వరకు ఎదురు చూసి నిరాశతో వెనుతిరిగి పోతున్నారు.

అందుబాటులో లేని అధికారులు
కంభం తహసీల్దార్‌ కార్యాలయం

లాంగ్‌ లీవ్‌లో తహసీల్దార్‌

ఇన్‌చార్జ్‌ను నియమించని వైనం 

కంభం, అక్టోబరు 16 : కంభం తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో పలు సమస్యలపై మండలంలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు చేతపట్టుకుని వచ్చిన బాధితులు సాయంత్రం వరకు ఎదురు చూసి నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. అంతేకాక పలువురు వీఆర్‌వోలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు చేతులు తడపనిదే ఏ పని కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 6 నెలల క్రితం తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్న కె.నరసింహారావు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చే బాధితుల ఫిర్యాదులు, అర్జీలకు ఏమాత్రం స్పందించడం లేదు. కార్యాలయం నుంచి అడుగు బయటకు పెట్టకపోవడంతో పలువురు వీఆర్‌వోలు అడిందే ఆటగా తయారైంది. దీనితో పలువురు తహసీల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో  స్పందించిన కలెక్టర్‌ తహసిల్దార్‌ను లాంగ్‌ లీవ్‌పై  పంపించారు. దీంతో కంభం తహసిల్దార్‌ కార్యాలయంలో రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేడు. ఎవరికీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు కూడా మంజూరు కావడం లేదు. దీంతో విద్యార్థులు, ఆర్మీ సెలక్షన్లకు వెళ్లేవారు, నేటివిటి సర్టిఫికేట్లు, రైతులకు పాస్‌ పుస్తకాలు, ఇతర అర్జీదారులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. అధికారులు ఎప్పుడు వస్తారా..? అని  కార్యాలయం ఎదురుగా ప్రజలు ఎదురు చూస్తూ  కనిపిస్తున్నారు.

ధ్రువపత్రం కోసం ఎదురుచూపులు

యర్రబాలెం గ్రామానికి చెందిన పిక్కిలి రవీంద్ర సోమవారం గుంటూరులో జరిగే ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లాలని, నేటివిటి సర్టిఫికేట్‌ కావాలని, కానీ తహసిల్దార్‌ లేకపోవడంతో ఏమి చేయాలో అర్ధంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సైదాపురంకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి పొలం సమస్యపై 7 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకునేవాడే లేడన్నారు. ఎమ్మెల్యే రాంబాబు రెండుసార్లు తన సమస్యపై రెవెన్యూ అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. డబ్బులు ఎవరిస్తారో వారి పనులు ఎంత అక్రమమైనా చేస్తారని పేర్కొన్నారు. ఈవిషయంపై డీటీ మంజునాథరెడ్డిని ప్రశ్నించగా గతంలో ఏమి జరిగిందో తనకు తెలియదని, తాను ఇటీవలే వచ్చానని చెప్పారు. ప్రజా సమ్యస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - 2022-10-17T05:58:03+05:30 IST