వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు షురూ

ABN , First Publish Date - 2022-08-05T05:02:23+05:30 IST

జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు బిగిస్తున్నామని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత కార్యాలయాలలో అందజేయాలని ఆ శాఖ ఎస్‌ఈ కేవీవీ సత్యనారాయణ చెప్పారు.

వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు షురూ

ఈ నెల 15లోపు రైతులు అన్ని పత్రాలు ఇవ్వాలి

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సత్యనారాయణ


ఒంగోలు(క్రైం), ఆగస్టు : జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు బిగిస్తున్నామని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత కార్యాలయాలలో అందజేయాలని ఆ శాఖ ఎస్‌ఈ కేవీవీ సత్యనారాయణ చెప్పారు. స్థానిక విద్యుత్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1,85,677 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు 1,57,783 కనెక్షన్లకు ఆధార్‌ కేవైసీ చేశామని చెప్పారు. ఇంకా 27,894 మంది ఈకేవైసీ చే యాలన్నారు. అదేవిధంగా 1,19,899 మంది రైతుల బ్యాం క్‌ అకౌంట్‌లు సేకరించామని చెప్పారు. ఇంకా 65,778 మంది రైతులు బ్యాంక్‌ అకౌంట్‌లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మ్యాండేటరీ ఫారాలు 44447 మంది మాత్రమే ఇచ్చారని ఇంకా 1,41,230 మంది ఇవ్వాలని చెప్పారు. 

ఈ మొత్తం పత్రాలను ఈ నెల 15వ తేదీ లోపు ఇవ్వాలని కోరారు. తద్వారా నేరుగా రైతుల అకౌంట్‌లలోకి విద్యుత్‌ బిల్లుకు సంబంధించిన నగదు వస్తుందని, తిరిగి విద్యుత్‌ శాఖకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పథకం ద్యారా ఏర్పాటు చేసే విద్యుత్‌ మీటరు, కెపాసిటర్‌, సంబంధిత సామగ్రి సుమారు ఎనిమిదివేల రూపాయలు ఉంటుందని, రైతులకు ఉచితంగా ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. సమావేశంలో టెక్నికల్‌ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:02:23+05:30 IST