మాన్యం భూములు మటాష్‌

ABN , First Publish Date - 2022-11-27T23:47:24+05:30 IST

పామూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు, మాన్యం భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. సుమారు పదిహేనేళ్ల క్రితం దేవాలయ భూమిని ఆక్రమించి నకిలీ పత్రాలు పుట్టించి ఆధీనంలో ఉంచుకున్నారు.

మాన్యం భూములు మటాష్‌

ఆన్‌లైన్‌లో ఆక్రమణదారుల పేర్లు

వైసీపీ నేతలు, అధికారుల సహకారం

ఇప్పటికే రూ.25కోట్ల విలువైన

భూములు పరులపరం

జోరుగా కట్టడాల నిర్మాణం

కొన్నిచోట్ల రియల్‌ వెంచర్లు

పట్టించుకోని దేవదాయశాఖ అధికారులు

పామూరులో దేవాలయ మాన్యం భూములు పరులపరమవుతున్నాయి. ఏళ్ల తరబడి వాటిలో పాగా వేసిన వారు ఇప్పుడు సొంతం చేసుకునే పనిలో పడిపోయారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల సంపూర్ణ సహకారంతో ఆక్రమిత భూములను తమ పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకుంటున్నారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ స్థలాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు రూ.కోట్ల విలువైన భూములను అప్పనంగా ఆక్రమణదారులకు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీని వెనుక భారీ మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఆక్రమిత భూముల్లో కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు రియల్‌ వెంచర్లుగా మార్చారు. అయినప్పటికీ వారిపై చర్యలు కరువయ్యాయి.

పామూరు, నవంబరు 27 : పామూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు, మాన్యం భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. సుమారు పదిహేనేళ్ల క్రితం దేవాలయ భూమిని ఆక్రమించి నకిలీ పత్రాలు పుట్టించి ఆధీనంలో ఉంచుకున్నారు. తాజాగా అధికార పార్టీ నేతలు, అధికారుల సహకారంతో ఆభూములను అక్రమార్కులు ఆన్‌లైన్‌ చేయించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఖాళీగా ఉన్న ఎండోమెంట్‌, అసైన్డ్‌, మాన్యం, వంక పోరంబోకు భూములు క్రమక్రమంగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

రూ.25కోట్లకుపైగా విలువైన ఆలయ భూమి హాంఫట్‌

స్థానిక శ్రీమదనవేణుగోపాలస్వామి దేవస్థానానికి నెల్లూరు రోడ్డులోని సర్వే నెంబర్‌ 322/11లో 55 సెంట్ల దేవదాసి మాన్యం ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.70లక్షలకుపైగా ఉంటుంది. అలాగే నెల్లూరు రోడ్డులో సర్వే నెంబర్‌ 329/2లో 3.29 ఎకరాలు, విరువూరు రోడ్డులో సర్వే నెంబరు 256/2, 257/2లో దాదాపు 35ఎకరాల దేవదాయకు చెందిన మాన్యం భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంది. ఈ భూముల మొత్తం విలువ దాదాపు రూ.25 కోట్లకుపైగానే ఉంది.

తాజాగా ఆన్‌లైన్‌లో నమోదు

సుమారు 15ఏళ్ల క్రితం ఈ భూములను కొందరు అక్రమార్కులు (ప్రస్తుతం వైసీపీ మద్దతుదారులు) ఆక్రమించారు. అప్పటి అధికారులు, నేతల అండతో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు పుట్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇటీవల ఆక్రమిత భూములను ఆన్‌లైన్‌లో తమ పేర్ల మీద నమోదు చేయించారు. దీన్ని అదునుగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కోట్లాది రూపాయలు విలువచేసే ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. కొంతభూమిని రియల్‌ వెంచర్లుగా వేశారు. ఇదిలా ఉంటే తాజాగా రెవెన్యూ రికార్డులను సైతం యథేచ్ఛగా మారుస్తున్నట్లు సమాచారం.

భూమిశిస్తు కూడా చెల్లింపు

ఆక్రమిత భూములను తమ పేర్లపై రికార్డులు మార్చుకొన్న కొందరు భూమిశిస్తు చెల్లిస్తూ బ్యాంకు రుణాలు తీసుకుని ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ పకడ్బందీగా చేయించుకోవడంతో అక్రమార్కులు ఇక తమకేమీ కాదన్న భరోసాతో దిలాసాగా ఉన్నారు. ఆ భూముల పరిరక్షణలో దేవదాయ పాలక మండలి నిర్లక్ష్యం వహించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. విలువైన భూములన్నీ కళ్ల ముందే కరిగిపోయి పక్కా నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పాలక మండలి సభ్యులు కళ్లు మూసుకుని ఉండడం గమనార్హం.

నాడు దానం చేసిన భూములు

నాడు రాజులు పలువురు సేవకులకు మాన్యాలు దానం చేశారు. చాకిరి మాన్యాలు అనుభవించడమే గాని అమ్మకాలు, కొనుగోళ్లు చేయరాదు. అక్రమార్కులకు ఇవేమీ పట్టడం లేదు. ఆ భూములకు సంబంధించిన రికార్డులన్నీ తమకు అనుకూలంగా మార్చుకుని కొంత భాగం ప్లాట్లుగా వేసి అమ్ముతూ జేబులు నింపుకొంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు సయన్వయంగా వ్యవహరించి ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి పామూరులో యథేచ్ఛగా ఆక్రమణకు గురైన అసైన్డ్‌భూముల వివరాలు సేకరించి భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు అందాయి. ఆ దిశగా సర్వే చేస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

అక్రమ కట్టడాలను అడ్డుకుంటాం

వెలగం శ్రీనివాసులు, దేవదాయ శాఖ ఈవో

దేవుడి భూముల ఆక్రమణలు జరుగుతున్నట్లు నా దృష్టికివచ్చింది. మా శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించి అడ్డుకుంటాం. రెవెన్యూశాఖతో దేవదాయ శాఖకు చెందిన కొందరు అధికారులు చేతులు కలిపి దేవుడి మాన్యాన్ని పట్టాభూములుగా మార్చుకున్నారనే ఆరోపణలపై విచారణ చేపడతాం. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటాం.

Updated Date - 2022-11-27T23:47:25+05:30 IST