ప్రొటోకాల్‌పై మాగుంట గరంగరం

ABN , First Publish Date - 2022-01-13T06:09:07+05:30 IST

అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవటంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి గరంగరం అయ్యారు.

ప్రొటోకాల్‌పై మాగుంట గరంగరం
విలేకరులతో మాట్లాడుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీ మాగుంట

వివేకానంద జయంతి వేడుకల ఫ్లెక్సీలో 

తన ఫొటో లేకపోవడంతో అధికారులపై అసహనం 

ఒంగోలు నగరం, జనవరి 12: అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవటంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి గరంగరం అయ్యారు. మంగళవారం జరిగిన దిశ సమావేశంలో ప్రొటోకాల్‌పై అధికారులను నిలదీసిన మాగుంటకు బుధవారం కూడా అదే సమస్య ఎదురైంది. ఆయన పాల్గొన్న కార్యక్రమంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను స్థానిక కొత్తపట్నం బస్టాండ్‌ శివాలయం సెంటర్‌లో నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ సెంటర్‌లో ఉన్న వివేకానందుని విగ్రహానికి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీ మాగుంట, జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. వేదికపై ఉంచిన ఫ్లెక్సీలో నలుగురు మంత్రులు, ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించారు. అందులో ఎంపీ ఫొటో లేకపోవటంతో ఆయన అభిమానులు అధికారులను ప్రశ్నించారు. ‘ప్రొటోకాల్‌ పాటించరా?’ అంటూ ఆయన అభిమానులు సభలోనే గందరగోళానికి తెరలేపారు. దీనిపై ఎంపీ కూడా అఽధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 





Updated Date - 2022-01-13T06:09:07+05:30 IST