భూమంతర్‌..!

ABN , First Publish Date - 2022-07-06T05:00:45+05:30 IST

తాళ్లూరు మండలంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణ చెరలో చిక్కాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతోపాటు ఏటా మూడు పంటలు పండుతాయి. దీంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది.

భూమంతర్‌..!


ఆక్రమణల చెరలో ప్రభుత్వ భూములు

తాళ్లూరు మండలంలో వందల ఎకరాలు అన్యాక్రాంతం

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా వేస్తున్న వైసీపీ నేతలు

వాటిలో దర్జాగా పంటల సాగు 

కన్నెత్తిచూడని రెవెన్యూ అధికారులు

మామూళ్లు ముట్టడమే కారణమని ఆరోపణలు 


సోమవరప్పాడు గ్రామానికి చెందిన సుబ్బన్న చెరువు సర్వే నెంబర్లు 324, 325, 326ల్లోని 61.24 ఎకరాలు, అదే గ్రామంలోని సర్వే నెంబర్లు 336, 337, 322/1లోని 23.72 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఆక్రమణదారులు అక్కడ సొంతంగా బోర్లు వేసుకున్నారు. వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. దీనికి తోడు వాగు పోరంబోకు భూమి సర్వే నంబర్‌ 336లో 6.36 ఎకరాలు, 339లో 6.72 ఎకరాలు, 337లో 5.82 ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేపట్టారు.

బొద్దికూరపాడు గ్రామానికి చెందిన చెరువులో దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నాగంబొట్లపాలెంలో 675/5లోని అటవీ భూములు, రెవెన్యూ శాఖకు చెందిన పాపిరెడ్డికుంట, రామయ్యకుంటల్లో 14 ఎకరాల భూమిని ఆక్రమించి బత్తాయి తోటల సాగు చేపట్టారు.


ఇలా.. తాళ్లూరు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వందల ఎకరాలు పరులపరమైంది. రూ.కోట్ల విలువ చేసే ఈ భూముల్లో పాగా వేసిన కబ్జారాయుళ్లు వాటిలో దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు. కొందరు బోర్లు సైతం వేయించుకోవడం విస్తుగొలుపుతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఆక్రమణలవైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీవారు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడం పరిపాటైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాల వ్యవహారం హద్దులు దాటిపోయింది. 


తాళ్లూరు, జూలై 5 : తాళ్లూరు మండలంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణ చెరలో చిక్కాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతోపాటు ఏటా మూడు పంటలు పండుతాయి. దీంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములపై దృష్టి సారించారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. వాగులు, కుంటలు, వంకలు ఇలా అన్నీ పరులపరమయ్యాయి. మరికొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని వందలాది ఎకరాలను యథేచ్ఛగా ఆక్రమించుకుని ఏళ్లుగా అనుభవిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యాడు. దేవుడి మాన్యాల్లో సైతం పాగా వేసి పూజలు కూడా జరగకుండా చేస్తున్నారు. 


కబ్జాలపర్వం ఇదీ.. 

మండలంలోని గుంటిగంగ, నాగంబొట్లపాలెం, బొద్దికూరపాడు, మన్నేపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను అక్రమార్కులు పోటాపోటీగా ఆక్రమించుకున్నారు. ఆక్రమణలకు గురైన భూముల విలువ దాదాపు రూ.25 కోట్లపైనే ఉంటుందని అంచనా. మన్నేపల్లి గ్రామంలో చెన్నకేశవస్వామికి చెందిన 63ఎకరాల భూమలను దారంవారిపాలెం, విఠలాపురం, మన్నేపల్లి గ్రామాలకు చెందిన కొందరు కబ్జా చేసి పంటలు సాగు చేస్తున్నారు. మన్నేపల్లికి చెన్నకేశవస్వామికి చెందిన సర్వే నెంబర్లు 130/1లో 6.02 ఎకరాలు, 134లో 12.10 ఎకరాలు, 457/1లో 14.46 ఎకరాలు, 545లో 16.92 ఎకరాలు, 621/1లో 10.90 ఎకరాలు, 621/3లో 0.63, 675/5లో 0.96, ఎకరాల భూమితోపాటు మరో 28 ఎకరాలు కలిపి మొత్తం 88 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆక్రమించిన పొలాల్లో బత్తాయి, సజ్జ, సుబాబుల్‌, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. అందుకు వసరమైన నీటి కోసం బోర్లు కూడా తవ్వించారు. వాటికి పక్కన ఉన్న పొలాల పేరుతో విద్యుత్‌ కనెక్షన్లు తీసుకొని అక్రమంగా వాడుతున్నారు.  


రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు

గత కొంతకాలంగా ప్రభుత్వ భూములను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామంటూ రికార్డులు పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను తేల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. పేద కుటుంబాలకు ఎకరా భూమిని పంపిణీ చేసేందుకు సవాలక్ష కారణాలు చూపే వారు వందలాధి ఎకరాల ప్రభుత్వ భూములను, వాగులను, వంకలను ఆక్రమంచి పంటలు సాగు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆక్రమణదారుల వద్ద ముడుపులు పుచ్చుకొని మిన్నకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేసమయంలో ఆక్రమణదారుల్లో కొందరు ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ వైపు ఉండి అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ వారు తమ జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. 


విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటా

పాలపర్తి బ్రహ్మయ్య, తాళ్లూరు తహసీల్దార్‌

ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగినట్లు చెప్తున్న గ్రామాల్లో వీఆర్వోల ద్వారా విచారణ చేయిస్తాం. వీఆర్వోలు, సర్వేయర్ల బృందాలను నియమించి ఆక్రమిత భూములను గుర్తిస్తాం. జిల్లా అధికారులకు నివేదించి వారి సూచనల పేరుతో ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని రక్షణ కల్పిస్తాం. Updated Date - 2022-07-06T05:00:45+05:30 IST