కలగా కంభం చెరువు పర్యాటక కేంద్రం

ABN , First Publish Date - 2022-06-02T05:33:57+05:30 IST

ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రస్తుత కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ చెప్పిన మాటలు ఈ ప్రాంత ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేశాయి. మూడు దశాబ్దాల నుంచి కంభం చెరువును సందర్శించిన ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కంభం చెరువు ప్రకృతి అందాలు చూసిన వెంటనే తన్మయత్వం చెందేవారు.

కలగా కంభం చెరువు పర్యాటక కేంద్రం
విశాలమైన కంభం చెరువు కట్ట

అమలు కాని ముఖ్యమంత్రులు, మంత్రులు, కలెక్టర్ల హామీలు

నెరవేరని దశాబ్దాల నాటి ప్రజల ఆశలు 

 కంభం, జూన్‌ 1 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రస్తుత కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ చెప్పిన మాటలు ఈ ప్రాంత ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేశాయి.  మూడు దశాబ్దాల  నుంచి కంభం చెరువును సందర్శించిన ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కంభం చెరువు ప్రకృతి అందాలు చూసిన వెంటనే తన్మయత్వం చెందేవారు. ఇంతటి విశాలమైన చెరువును ఎక్కడా చూడలేదని, పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చి చెరువుకట్ట దిగిపోగానే తాము హామీ ఇచ్చిన హామీలను మరచిపోవడం జరుగుతోంది.  ప్రజలు మాత్రం ఈ హామీలు కూడా కలలానే మిగిలిపోతున్నాయన్న అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర పర్యాటక కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అది నేటివరకు కలగానే మిగిలింది. రాష్ట్రంలో, జిల్లాలో పలు చారిత్రాత్మక ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా ప్రకటించారు. ఆ విధంగా చూసుకుంటే ఆసియా ఖండంలోనే కంభం చెరువు మొదటి వరుసలో నిలుస్తుంది. 


15వ శతాబ్దంలో బీజం .. 

శ్రీకృష్ణదేవరాయల సతీమణి వరదరాజమ్మ ఈ ప్రాంత ప్రజలు కరువుతో పడుతున్న బాధలను గమనించి ఒక విశాలమైన కట్టను నిర్మింపచేశారు. నల్లమల అడవుల నుంచి ప్రవహించే గుండ్లకమ్మ, జంపలేరు వాగుల నుంచి నీరు కంభం చెరువుకు చేరింది. అప్పటి నుంచి ఈ చెరువు రైతులపాటిన కల్పవృక్షంగా మారింది. ఈ చెరువు ప్రస్తుతం 13 అడుగులమేర పూడిపోయింది. ఈచెరువుకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చేలా  పనులు జరుగుతున్నాయి. కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కంభం చెరువు సందర్శకులను కట్టి పడవేస్తున్నది. 1984లో రెండుసార్లు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కంభం చెరువును చూసి సూర్యాస్తమయం అద్భుతమని, ఇలాంటి చెరువును ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో సహా ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ చెరువును చూసి మంత్రముగ్దులయ్యారు. కంభం చెరువు పరిరక్షణ పేరుతో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యావంతులు కలిసి రైతులతో కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం, సెలవు రోజుల్లో చుట్టుపక్కల వారు కుటుంబసమేతంగా కంభం చెరువుకు వచ్చి సేదతీరుతుంటారు. వినాయక చవితి నిమజ్జనం, ముస్లింల గరికతొక్కుడు పండుగ, కార్తిక మాసంలో వనభోజనాలకు వేలాది మంది చెరువుకట్టకు వస్తారు. చెరువు కట్ట విశాలంగా ఉండటంతో పాటు దేవాలయాలు, అతిథి గృహాలు ఉన్నాయి. కంభం చెరువు అభివృద్ధిపై పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చిన హామీల నేపథ్యంలో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఉన్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో కలిసి కంభం చెరువును చూసి అభివృద్ధికి రూ.70లక్షలు మంజూరు చేయడమే కాక కంభం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుత కలెక్టర్‌ కూడా మే 13న పల్లెనిద్రలో భాగంగా కంభం రాగా చెరువును పరిశీలించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడమే కాకుండా ఇరిగేషన్‌ అధికారులను పిలిపించి మ్యాప్‌ను పరిశీలించారు. ఈసారైనా కంభం చెరువు పర్యాటక కేంద్రంగా మారుతుందేమోనన్న ఆశాభావాన్ని ఇక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-06-02T05:33:57+05:30 IST