ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాల్లో భారీ అక్రమాలు

ABN , First Publish Date - 2022-12-12T00:02:23+05:30 IST

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో అనర్హుల పేర్లను అధికారులు చేర్చారు. ఇటీవల ప్రకటించిన ముసాయిదా జాబితాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాల్లో   భారీ అక్రమాలు

వైసీపీ నేతల ఒత్తిళ్లకు

అధికారులు తలొగ్గినట్లు ఆరోపణలు

గుర్తించే పనిలో వాపమక్షాలు

ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 11 : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో అనర్హుల పేర్లను అధికారులు చేర్చారు. ఇటీవల ప్రకటించిన ముసాయిదా జాబితాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అందులో ఓటర్లుగా ఉన్న వారిలో అనేక మందికి కనీస విద్యార్హతలు లేకపోవడాన్ని బట్టి చూస్తే జాబితాలో ఏమేరకు అవకతవకలు చోటుచేసుకున్నాయో తేటతెల్లమవుతుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుహక్కు కోసం నవంబరు 7వ తేదీ నుంచి మొదటి విడత దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లాలోని పట్టభద్రుల నియోజకవర్గానికి 1,30లక్షల మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఏడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 1,15,680 మందికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 6,298 మందికి ఓటు హక్కు కల్పిస్తూ ముసాయిదా జాబితాలను ప్రకటించారు. వాటిలో అర్హత లేకున్నా జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో వందలాది అనర్హులకు అక్రమంగా ఓటు హక్కు కల్పించారని సీఐటీయూ నాయకులు ఇటీవల ఆరోపించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం పీడీఎఫ్‌ అభ్యర్థి (వామపక్షాల మద్దతు)కి మద్దతుదారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించగా అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు బహిర్గతమైంది.

700 మంది అనర్హులున్నట్లు గుర్తింపు

అలా జిల్లావ్యాప్తంగా ఎలాంటి విద్యార్హత లేకుండానే సుమారు 700 మందికి పైగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు హక్కు పొందినట్లు తెలుస్తోంది. ఈమేరకు పీడీఎఫ్‌ అభ్యర్థికి మద్దతుగా ఉన్న వామపక్షాల నేతలు ఇప్పటి వరకూ గుర్తించారు. ఇంకోవైపు ఉపాధ్యాయుల ఓట్ల జాబితాలో ప్రైవేటువిద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పించినట్లు సమాచారం. అయితే ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో గ్రామ, వార్డు వలంటీర్ల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో తుంగలో తొక్కారు. అధికార పార్టీకి చెందిన సానుభూతిపరులకు అర్హత లేకపోయినా ఓటు హక్కును కల్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-12-12T00:02:23+05:30 IST

Read more