ఎస్‌ఎస్‌ ట్యాంకుకు వెంటనే మరమ్మతులు

ABN , First Publish Date - 2022-12-06T23:21:00+05:30 IST

మండలంలోని నడిగడ్డలోని ఎస్‌ఎస్‌ ట్యాంకుకు పడిన గండిని పూడ్చి త్వరితగతిన మరమ్మతులు చేయాలని మంత్రి సురేష్‌ అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఎస్‌ ట్యాంకుకు వెంటనే మరమ్మతులు

త్రిపురాంతకం, డిసెంబరు 6 : మండలంలోని నడిగడ్డలోని ఎస్‌ఎస్‌ ట్యాంకుకు పడిన గండిని పూడ్చి త్వరితగతిన మరమ్మతులు చేయాలని మంత్రి సురేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం గండి పడి నీరు వృథాగా పోయిన విషయం తెలుసుకున్న మంత్రి మంగళవారం ఎస్‌ఎస్‌ ట్యాంకును పరిశీలించారు. మార్కాపురం సబ్‌కలెక్టర్‌ సేతుమాధవన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌అలి, డీఈఈ రామకృష్ణ, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ట్యాంకు నిర్వహణ కాంట్రాక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకులో నీరు ఉధృతి ఎక్కువగా ఉన్నందున పనులకు అంతరాయం ఏర్పడుతోందని, వారంరోజుల్లోపు పనులు పూర్తిచేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. కట్టల వెంట పెరిగిన పిచ్చిచెట్లను వేర్లతో సహా తొలగించాలన్నారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, తహసీల్దారు వి.కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:21:02+05:30 IST