చెత్త పనుల్లోనూ చేతివాటం

ABN , First Publish Date - 2022-03-05T06:04:55+05:30 IST

పాలకుల కక్కుర్తి, అధికారులు నిర్లక్ష్యం వెరసి విలువైన ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.

చెత్త పనుల్లోనూ చేతివాటం
సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో పిచ్చిమొక్కలతో నిండిన సిమెంట్‌ బెడ్లు

రూ.6.80కోట్లు బూడిదలో పోసిన పన్నీరు

అధికారుల నిర్లక్ష్యంతో లోపభూయిష్టంగా నిర్వహణ

డంపింగ్‌ యార్డుగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌

యంత్రాల కొనుగోలుకు రూ.1.5కోట్ల ఖర్చు 

మరో రూ.1.5 కోట్లు వెచ్చించేందుకు రంగం సిద్ధం

కమీషన్ల కోసమే అంటూ ఆరోపణలు

తమకు ఒక రూపాయి వస్తుందంటే.. నిరుపయోగమైన పనులకు ప్రభుత్వ ధనం రూ.100 వెచ్చించేందుకు కూడా పాలకులు వెనుకాడటం లేదు. ఇక పురపాలకులైతే చెప్పనవసరం లేదు. దొరికిన కాడికి దండుకోవడమే. ఇందుకు చీరాలలో భారీ వ్యయంతో నిర్మించిన సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ దర్పణం పడుతోంది. సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా అధికారులు మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.         ఏ లక్ష్యంతో ఆ యూనిట్‌ను నిర్మించారో అందుకు తిలోదకాలి చ్చారు. అయినప్పటికీ ఆయా నిధుల వినియోగంతో వచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి చెత్తలోనూ చేతివాటం చూపుతున్నా రన్న ఆరోపణలున్నాయి. నిర్వహణలోపంతో కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటుచేసిన యూనిట్‌ ఇప్పుడు నిరుపయోగంగా మారింది.

చీరాల, మార్చి 4 : పాలకుల కక్కుర్తి, అధికారులు నిర్లక్ష్యం వెరసి విలువైన ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. చీరాల పట్ట ణంలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూని ట్‌.. నిర్వహణ లోపంతో డంపింగ్‌ యార్డుగా మారింది. రూ.6.80 కోట్ల వ్యయంతో ఆ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చెత్త సేకరణకు వాహనాలు, చెత్తను వేరుచేసే యంత్రా లు, కొబ్బరి బోండాలు పీచుతీసే మిషన్‌ తదితరాల కొనుగోలుకు రూ.1.5కోట్లకుపైగా వెచ్చించారు. తాజాగా మరో రూ.1.5 కోట్లు ఖర్చు చేసేందుకు టెండరు ప్రక్రియ జరుగుతోంది. చీరాల మున్సిపల్‌ పరిధిలో లక్షమందిపైనే జనాభా ఉన్నారు. సుమారు 23వేల గృహాలు ఉన్నాయి. ప్రతిరోజూ మున్సిపల్‌ పరిధిలో 39 మెట్రిక్‌ టన్నుల చెత్త వస్తుంది. దాన్ని ఎక్కడపడితే అక్కడ వేయకుండా పారిశుధ్యం మెరుగుపరిచేందుకు 2007లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. యూనిట్‌కు యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ (మున్సిపల్‌ పరిధిలో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ పథకాలు) కింద నిధులు కేటాయించారు. అందులోభాగంగా కేంద్రం నిధులు రూ.288.80 లక్షలు, రాష్ట్రప్రభుత్వ నిధులు రూ.36.10 లక్షలు, అర్బన్‌ లోకల్‌ బాడీ నిధులు రూ.254.76 లక్షలు కేటాయించారు. 


స్థలం దొరక్కపోవడంతో..

ఆదిలోనే హంసపాదు అన్నట్లు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు సంబంఽ దించి మున్సిపల్‌ పరిధిలో అవసరమైన మేర స్థలం లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే చొరవతో వేటపాలెం మండలం రామాపురం సమీపంలో 15 ఎకరాల స్థల సేకరణ చేశారు. ఆక్రమంలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ వెంచర్ల కు ఇబ్బందిగా ఉంటుందని భావించి ఆ యూనిట్‌ అక్కడ ఏర్పాటు చేయవద్దని వేరే కారణాలు చూపుతూ కోర్టుకెక్కారు. చివరకు 2010లో పనులు ప్రారంభించారు. 


అంతా అస్తవ్యస్తం

నిధుల వినియోగంలో వచ్చే కమీషన్ల కోసం ఇటీవల మున్సిపల్‌ పాలకులు కొన్ని యంత్రాలు కొనుగోలు చేశారు. కొన్ని అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఇదిలాఉంటే మున్సిపల్‌ పరిధిలో తడి, పొడిచెత్త, హానికర చెత్త(ఆసుపత్రుల వ్యర్థాలు తదితరాలు)కు వేసేందుకు డస్ట్‌ బిన్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు తడి, పొడి చెత్త వేరు చేయకుండానే ఆ యూనిట్‌లోని చెరువులో ఆ చెత్తను డంప్‌ చేస్తున్నారు. దీంతో అది సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (చెత్తశుద్ది, సంపద సృష్టి) అనేది పోయి డంపింగ్‌యార్డుగా మారింది. దీంతోపాటు కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా ఉండి పోయాయి.


 హానికర చెత్తతో ప్రమాదం 

తడి, పొడి చెత్త మాట అటుంచితే ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు ప్రమాదకరంగా ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా నిర్మూలించేందుకు స్థానిక ఏరియా వైద్యశాలలో 2004లో రూ.70వేల వ్యయంతో ఇన్‌సనరేటరీ రూమ్‌(చెత్త తగులబెట్టు గది)ని నిర్మించారు. అందులో ఆసుపత్రి వ్యర్థాలను తగులబెట్టే మిషనరీ బిగించలేదు. తరువాత ఆ గదిని మార్చురీ గదిగా మార్చారు. దీంతో ఆ వ్యర్థాలను కొన్ని ఆసుపత్రులు సొంతంగా నిర్మూలిస్తుండగా, కొందరు చెత్తలో వేస్తున్నారు.


మొదట్లో బాగానే ఉన్నా...

మున్సిపల్‌ పరిధిలో సేకరించిన చెత్తను కుందేరు ఒడ్డున ఉన్న మున్సిపల్‌ స్థలంలో డంప్‌ చేసి, తడి, పొడిచెత్త, హానికర చెత్తను వేరు చేసేవారు. ఎన్‌ఆర్‌ అండ్‌పీఎం హైస్కూల్‌ ప్రాంగణంలో ఉన్న మున్సిపల్‌ స్థలంలోనూ వేరు చేసిన పొడి చెత్తను విక్రయించేవారు. ఆ తర్వాత తడి చెత్తను రామాపురం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ యూనిట్‌కు తరలించేవారు. అక్కడున్న సిమెంట్‌ బెడ్లపైన ఆ చెత్తను పేర్చి వర్మీ కంపోస్టు తయారుచేసి విక్రయించేవారు. ఓ చెరువును తవ్వి అక్కడ బోర్లు వేశారు. సముద్రం దగ్గర్లో ఉన్నందున ఉప్పునీరు వచ్చినా ఇబ్బంది లేకుండా ఇజ్రా యిల్‌ టెక్నాలజీతో వాటిని శుద్ధిచేసి, ఆ నీటిని ఖాళీ ప్రదేశంలో సాగు చేసిన చెట్లు, కూరగాయలు, ఆకుకూరలకు వినియోగించేవారు. రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీల కమిషనర్లకు చీరాలలో అందుకు సంబంధించి అవగాహన సదుస్సులు కూడా నిర్వహించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేణా ఆ యూనిట్‌ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది.


చెత్త తరలింపులోనూ..

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు ముందు గత ఎమ్మెల్యే హయాంలో మున్సి పల్‌ పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ సమీపాల్లో లక్షల  వ్యయంతో చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశా రు. కొన్నాళ్లకే అవి మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చెత్తలో అధికారు లు, కాంట్రాక్టర్లు చేతివాటం చూపుతున్నారనే విమర్శలున్నాయి. చెత్త తరలింపు పేరు తో భారీగా భోంచేస్తున్నారని, అలాగే కూలీల వినియోగంలోనూ దొంగ లెక్కలు చూపు తున్నారన్న విమర్శలున్నాయి. మున్సిపల్‌ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో కూలీలు కాక ఆరుగురు మేస్త్రీలు, 20 మంది శానిటరీ సెక్రటరీలు ఉన్నారు. వీరే ఏం చేస్తున్నారో... అందరూ సమష్టిగా పనిచేస్తుంటే సత్ఫలితాలు ఎందుకు రావటం లేదో ఏలిన వారికే తెలియాలి. దీనిపై వివరణ కోరేందుకు కమిషర్‌కు అనేక సార్లు ఫోన్‌ చేసినా ఆయన అందుబాటులో కి రాలేదు. 
Read more