అలవి మాలిన నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-13T06:38:12+05:30 IST

దివ్యాంగులకు అందాల్సిన పరికరాల పంపిణీలో తీవ్రజాప్యం జరిగింది. వారికి అవసరమైన ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు ఇతర పరికరాలు అందజేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసి రెండేళ్లకుపైగా అవుతోంది.

అలవి మాలిన నిర్లక్ష్యం

దివ్యాంగులకు పరికరాల పంపిణీలో జాప్యం

రెండున్నరేళ్ల కిందట లబ్ధిదారుల ఎంపిక

వాటాధనం కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం

అప్పటి నుంచి  తప్పని ఎదురుచూపులు 

ఇప్పుడు ఎంపీ మాగుంట నిధుల నుంచి  చెల్లింపు

నేడు పంపిణీకి రంగం సిద్ధం

అంతా ఆర్భాటం.. అమలు అంతంతమాత్రం. దీనికితోడు అలవిమాలిన నిర్లక్ష్యం. ఇదీ ప్రస్తుత సర్కారు తీరు. ఏ పథకాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. మాటలు తప్ప ఆచరణ ఉండదనేది పలు విషయాల్లో తేటతెల్లమైంది. పాలకులకు తగ్గట్లే అధికార యంత్రాంగం కూడా అదే బాటలో నడుస్తోంది. అందుకు దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన పరికరాలే నిదర్శనం. రెండేళ్ల కిందట లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇప్పుడు పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇన్నాళ్ల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తన వాటాధనం చెల్లించకపోవడంతో ఇప్పటివరకు ఆగాల్సి వచ్చింది. దీంతో పరికరాల కోసం ఎంపికైన దివ్యాంగులు వాటిని ఎప్పుడిస్తారోనని ఎదురుచూస్తూ ఇబ్బందులు పడ్డారు. ఒంగోలు ఎంపీ తన లాడ్స్‌ కేటాయించడంతో ఇప్పటికి మోక్షం లభించింది. 

ఒంగోలు నగరం, సెప్టెంబరు 12 : దివ్యాంగులకు అందాల్సిన పరికరాల పంపిణీలో తీవ్రజాప్యం జరిగింది. వారికి అవసరమైన ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు ఇతర పరికరాలు అందజేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసి రెండేళ్లకుపైగా అవుతోంది. అప్పటి నుంచి దివ్యాంగులు పరికరాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో అందించే ఈ పరికరాలకు కొంత వాటాధనం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ దాన్ని మంజూరు చేయకపోవడంతో పరికరాల పంపిణీ రెండేళ్ల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. అయితే వాటాధనం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన ఎంపీ లాడ్స్‌ నుంచి చెల్లించారు. దీంతో రెండేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ పరికరాలు ఇప్పుడు దివ్యాంగులకు అందబోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం వారికి గత ప్రభుత్వం అమలుచేసిన అనేక పథకాలను నిలిపివేయటంతోపాటు కేంద్రప్రభుత్వం అందించే అనేక పథకాలను కూడా దక్కకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో గత మూడేళ్లుగా దివ్యాంగులకు ఒక్క పథకం అంటే ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అందనేలేదు.

 

2020లోనే లబ్ధిదారుల ఎంపిక

కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎలిమ్‌కో జిల్లాలోని దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, అంధులకు, మూగ,చెవిటి వారికి, వృద్ధులకు అవసరమైన పరికరాలను అందించేందుకు రెండేళ్ల క్రితం ప్రత్యేక శిబిరాలు నిర్వహించింది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. కానీ పరికరాలు మాత్రం నేటికీ అందనేలేదు. కేంద్రప్రభుత్వం దివ్యాంగులకు కొన్ని పరిరకాలను మాత్రమే ఉచితంగా ఇస్తుంది. ఎక్కువ ధర ఉన్న ట్రైసైకిళ్లు వంటి వాటికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాధనం చెల్లించాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవటంతో రెండేళ్లుగా ఈ పరికరాల పంపిణీ వాయిదాపడుతూ వస్తోంది.


540మందికి బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు..

జిల్లాలోని 540మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను అందజేస్తున్నారు. ఒక్కో ట్రైసైకిల్‌ విలువ రూ.37వేలుగా ఉంది. ఇందులో రూ.25 వేలు కేంద్రప్రభుత్వ నిధులు కాగా రూ.12వేలు రాష్ట్రప్రభుత్వం వాటాధనంగా చెల్లించాల్సి ఉంది. ఈ వాటాధనాన్ని మాగుంట తన ఎంపీ లాడ్స్‌ నుంచి చెల్లించా రు. దీంతో దివ్యాంగులకు పరికరాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. జిల్లాలోని దివ్యాంగులకు ఈ బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు ఎంతగానే ఉపయోగకరంగా ఉండనున్నాయి. వీటిని వారికి అందజేసేందుకు ఒంగోలు నగరంతోపాటు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో కూడా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు వీటిని అక్కడే అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. 


నేడు కేంద్రమంత్రి చేతుల మీదుగా పంపిణీ

రెండేళ్లుగా వాయిదాపడ్డ పరికరాల పంపిణీ మంగళవారం చేపట్టనున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖామంత్రి చేతులమీదుగా పరికరాలను ఒంగోలులో అందజేయనున్నారు. కేంద్రప్రభుత్వంలోని ఈ శాఖ ద్వారానే దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, చేతికర్రలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు సమకూరాయి. మంత్రి లాంఛనంగా పరికరాల పంపిణీని ప్రారంభించిన అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ పరికరాలను జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాల సంక్షేమశాఖ పంపిణీ చేయనుంది.

Read more