వామ్మో జ్వరం

ABN , First Publish Date - 2022-09-11T06:03:05+05:30 IST

ల్లాలో సీజనల్‌ వ్యాధులతో ప్రజానీకం తల్లడిల్లిపోతోంది.. గ్రామాలకు గ్రామాలు వ్యాధుల బారిన పడుతుండ టంతో ప్రజానీకం వైద్య సేవల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వామ్మో జ్వరం
జ్వరపీడితులతో నిండిపోయిన ఒంగోలు రిమ్స్‌లోని జనరల్‌ వార్డు

తల్లడిల్లుతున్న ప్రజానీకం

మంచం పడుతున్న పల్లెలు

డెంగ్యూతో మృత్యువాతపడుతున్నా   వైద్య సేవలు అంతంతమాత్రమే

జిల్లాలో వందకుపైగా డెంగ్యూ కేసులు

 ప్రభుత్వ జాబితాలో మాత్రం 60లోపే

లక్ష మందికిపైగా సాధారణ జ్వరాలతో  బాధపడుతున్న వైనం

ముండ్లమూరు మండలంలోని పోలవరంలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభించాయి. గ్రామానికి చెందిన ఇద్దరు గురువారం రాత్రి మృతిచెందారు. అలాగే మరొకరు వారంక్రితం మరణించారు. గ్రామం మొత్తం మీద 500మందికి పైగానే విషజ్వరాల బారినపడి వణికిపోతున్నారు. 

అదే మండలం పూరిమెట్లలో వారం వ్యవధిలో ఇద్దరు విషజ్వరాలతో మృతిచెందారు. 20రోజుల నుంచి ప్రతి ఇంటిలో ఒకరిద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. గ్రామంలో మొత్తం 300మంది మంచం పట్టారు. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం పొందినాలాభం లేక పట్టణాలకు వెళుతున్నారు. 

విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ విజృంభిస్తోంది. వరుస మరణాలు నమోదవుతున్నాయి. జిల్లాలో ఎక్కడచూసినా జ్వరం, ఒళ్లునొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలు మంచంపట్టాయి. పల్లె నుంచి పట్టణం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో బాధితులు అధికమవుతున్నారు. వారంతా వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. పల్లెల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దోమల దాడి కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యానికి వేలకువేలు ఖర్చుచేయాల్సి రావడంతో ఇబ్బందిపడుతున్నారు. 

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 10 : జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో ప్రజానీకం తల్లడిల్లిపోతోంది.. గ్రామాలకు గ్రామాలు వ్యాధుల బారిన పడుతుండ టంతో ప్రజానీకం వైద్య సేవల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా జూలై, ఆగస్టులో జిల్లావ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు తీవ్రంగా ఉంటా యి. అటువంటిది ఈ ఏడాది సెప్టెంబరులో  ప్రబలా యి. జిల్లావ్యాప్తంగా లక్షలాది మందికిపైన జ్వరాల  బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తం గా వందకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 59లోపే ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారణ అయిన కేసులనే వైద్యారోగ్య శాఖ అధికా రులు పరిగణనలోకి తీసుకుంటు న్నారు. బయట ల్యాబ్‌లలో వచ్చే కేసులను నమోదు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏగ్రా మంలో చూసిన జ్వరాలతో జనం వైద్యశాలలకు వెళుతున్నారు. ప్రభు త్వ వైద్యశాలల్లో సక్రమంగా సేవలు అందకపోవడం తో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. 


జిల్లాలో సాధారణ జ్వరపీడితులు లక్షకుపైగానే

జిల్లాలో సాధారణ జ్వర పీడితులు లక్షమందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో వైద్యారోగ్యశాఖ ద్వారా ఫీవర్‌ సర్వే చేస్తుండగా అందులో 60వేల మందికిపైగా జ్వరపీడితులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే అంతకు రెట్టింపు మంది జ్వరం బారిన పడి వైద్యసేవలు పొందుతున్నారు. ఎక్కువమంది గ్రామాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దే వైద్యం చేయించుకుంటున్నారు.  జలుబు, దగ్గు, తుమ్ములతోపాటు జ్వరం వస్తూపోతూ ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెలరోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలో ప్రస్తుతం 1100మందికిపైగా విషజ్వరాలతో బాధపడుతున్నట్లు  సమాచారం. కొన్ని గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలే మంచం పట్టాయి. 


దడపుట్టిస్తున్న డెంగ్యూ 

జిల్లాలోని అనేక గ్రామాల్లో డెంగ్యూ దడపుట్టి స్తోంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ముం డ్లమూరు మండలం పోలవరం, పూరిమెట్లతోపాటు చీమకుర్తి, వైపాలెం, ఒంగోలునగరం, సంతనూతలపాడు, దోర్నాల, సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం తదితర మండలాల్లో ఎక్కువమంది డెంగ్యూ బారిన పడుతున్నారు. ఇలా అనేక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వ వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.


అస్తవ్యస్తంగా పారిశుధ్యం

జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షాలు అధికంగా పడుతుండటంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. కొద్దిపాటి జల్లులకే గ్రామాల్లోని కాలువల్లో ఉన్న మురుగు రోడ్లమీద ప్రవహిస్తోంది. మరోవైపు దోమల ఉధృతి పెరిగింది.  ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం అరకొర చర్యలు మాత్రమే చేపడుతోంది. ఇంకోవైపు గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా పాలకవర్గాలు పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు.  



Updated Date - 2022-09-11T06:03:05+05:30 IST