రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-12-15T01:16:17+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ కారణంగా పంటలు భారీగా దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. భారీవర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు, చదలవాడ గ్రామాల్లో పొగాకు, మిర్చి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

రైతులను ఆదుకోవాలి

ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.25వేలు ఇవ్వాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 14 : మాండస్‌ తుఫాన్‌ కారణంగా పంటలు భారీగా దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. భారీవర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు, చదలవాడ గ్రామాల్లో పొగాకు, మిర్చి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పత్తి, మిర్చి, పొగాకు పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. ఇంకా నీళ్లలోనే పంటలు ఉన్నాయని తెలిపారు. తిరిగి మళ్లీ అవకాశం ఉన్న పంటలు వేసుకునేందుకు ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.25వేలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రైతులు పొగాకు, మిర్చి పంటకు రూ.50వేలు, శనగకు రూ.25వేల వరకు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పాత బీమా విధానాన్ని రద్దుచేయడంతో రైతులకు తీవ్రనష్టం జరుగుతున్నదన్నారు. ఇప్పుడు కేంద్రమే బీమా పథకాన్ని అమలుచేస్తున్నదని, దాని ప్రకారం ఎప్పుడో నూర్పిడి పూర్తయ్యాక క్రాప్‌ కటింగ్‌ను బట్టి పరిహారం ఇస్తారన్నారు. దీనివలన రైతులకు ఎలాంటి లాభం ఉండన్నారు. రైతుల నుంచి వ సూలు చేసిన బీమా ప్రీమియంలో 40శాతం మాత్రమే పరిహారం రూపంలో ఇస్తున్నారని తెలిపారు. మునిగిన పంటలకు ఎన్యుమరేషన్‌ చేసి పరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్‌కే మాబు, బాలకోటయ్య, జయంతిబాబు, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. అనంతనం మాకినేని బసవపున్నయ్య 108వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హానీఫ్‌, పూనాటి ఆంజనేయులు, జి.వి.కొండారెడ్డి, షేక్‌మాబు, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, ఎం.రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:16:37+05:30 IST