వైసీపీలో ‘ముందస్తు’ అలజడి..

ABN , First Publish Date - 2022-01-15T05:03:00+05:30 IST

అధికార వైసీపీలో ‘ముందస్తు’ అలజడి ఆరంభమైంది. నియోజకవర్గాల్లో ఉండే...

వైసీపీలో ‘ముందస్తు’ అలజడి..

  • దూకుడు పెంచిన వారసులు
  • బానినేని, మాగుంట కుమారులకుతోడు 
  • శిద్దా, రాంబాబు తనయులు
  • కాపు సామాజికవర్గానికే 
  • పర్చూరు అంటున్న అధిష్ఠానం
  • తగ్గేదే లేదంటున్న కరణం, ఆమంచి
  • గ్రూపు బలోపేతానికి మాధవ్‌ తహతహ
  • దర్శిలో దిగొచ్చిన ఎమ్మెల్యే, 
  • ససేమిరా అంటున్న అసమ్మతి

ఆంధ్రజ్యోతి, ఒంగోలు : అధికార వైసీపీలో ‘ముందస్తు’ అలజడి ఆరంభమైంది. నియోజకవర్గాల్లో ఉండే అంతర్గత కలహాలకు తోడు, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్టే ధ్యేయంగా నేతలు దూకుడు పెంచారు.  ప్రధానంగా తమ వారసులుగా కుమారులకు పట్టం కట్టాలనే వారి సంఖ్య పెరిగిపోవడంతో పోటీ నెలకొంది. టీడీపీ నుంచి కరణం బలరాంను పార్టీలో చేర్చుకోవడం ద్వారా చీరాలలో ఎదురైన సమస్యకు అధిష్ఠానం ఇంతవరకు పుల్‌స్టాప్‌ పెట్టలేకపోయింది. ఇంకోవైపు పర్చూరు విషయంలో నాన్చుడు వైఖరి మూడు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోంది. నిర్ధిష్టమైన సంకేతం లేకపోయిన్పటికీ ముందుస్తు ఎన్నికలు రావచ్చనే అనుమానం, మరింత ముందుగానే అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం పలుకుతారన్న ప్రచారం ఈ అలజడి పెరిగేందుకు దోహదపడింది. దీనికితోడు పర్చూరు ఇన్‌చార్జిని మార్చబోతున్నాం. మరి కొందరు ఇన్‌చార్జులపై దృష్టి సారించామంటూ మంత్రి బాలినేని పార్టీ కిందిస్ధాయి నేతలకు చెప్పటం కూడా చర్చనీయాంశమైంది.

  

దూకుడుపెంచిన వారసులు

వైసీపీ నాయకుల కుమారుల రాజకీయంగా దూకుడు పెంచారు. ఆ విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ముందున్నారు. తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్‌, గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు కుమారుడు కృష్ణచైతన్య కూడా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల  మంత్రి సురేష్‌ కుమారుడు విశాల్‌ కూడా అడపాదడపా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ గరటయ్య కుమారుడు ఇప్పటికే పార్టీ అద్దంకి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. చీరాల ఎమ్మెల్యే బలరాం కూడా భవిష్యత్‌లో రంగంలో ఉండేది వెంకటేష్‌ అని తేల్చి చెప్పారు. వీరిలో ఒంగోలు ఎంపీ మాగుంట వచ్చే ఎన్నికల్లో ఎంపీగా తన కుమారుడే పోటీ చేస్తాడని బహిరంగంగా ప్రకటించారు. అయితే అవకాశం వస్తే అసెంబ్లీకైనా పోటీ చేయించవచ్చన్న ప్రచారం ఉంది. కొవిడ్‌ రెండో వేవ్‌ సందర్భంగా రిమ్స్‌లో బాధితులకు సేవా కార్యక్రమాలు చేసే విషయంలో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట పోటీపడటం అఽఽధికారులు బాలినేనికి జై కొట్టడం తెలిసిందే. తాజాగా తన విషయంలో ప్రొటోకాల్‌ పాటించటం లేదంటూ మాగుంట చేసిన ఆరోపణ వైసీపీ శ్రేణుల్లో కలకలం రేకెత్తించింది. 


మరోవైపు ఇటీవల మంత్రి బాలినేని కుమారుడు రాజకీయ జోక్యం పెరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన రంగంలోకి వస్తారా.. మరలా బాలినేని పోటీ చేస్తారా అన్న మీమాంస కొనసాగుతోంది. ఇటు ప్రణీత్‌రెడ్డి అటు రాఘవరెడ్డిల మధ్య పరోక్షంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. ఇక అద్దంకి పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న చైతన్య అద్దంకిలో పోటీకి తహతహలాడుతూ అక్కడ బలం పెంచుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తండ్రి బలరాం స్థానంలో చీరాలలో అవకాశం రాకపోతే అద్దంకిలో పోటీకైనా వెంకటేష్‌ సిద్ధపడతారన్న ప్రచారం ఆ పార్టీ కేడర్‌లో అయోమయాన్ని రేకెత్తిస్తోంది. సీఎం, మంత్రి బాలినేని ఆశీస్సులు చైతన్యకు పుష్కలంగా ఉన్నప్పటికీ వెంకటేస్‌కు చీరాలలో అవకాశం ఇవ్వకపోతే పరిస్ధితి ఏంటనే అంశం పీడిస్తోంది. 


తగ్గేదే లేదు.. 

 చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మధ్య  సయోధ్యకు అధిష్ఠానం చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఎవరికివారు తేగ్గేదేలే అనడంతో ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతానికి చీరాల బాధ్యతలు మొత్తం కరణంకు అప్పగించారు. ప్రత్యామ్నాయంగా ఆమంచిని పర్చూరు ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టాలని సూచించారు. అందుకు ఆమంచి సిద్ధపడలేదు. బలరాంను చీరాల నుంచి తప్పిస్తామంటేనే పర్చూరు వెళతానని ఆమంచి షరతు పెట్టినట్లు ప్రచారం. అయితే అధిష్ఠానం చీరాల బాధ్యతను ప్రస్తుతం బలరాం చూస్తానని తేలచ్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో ఆమంచి కృష్ణమోహన్‌ అన్న ఆమంచి స్వాములు తనకు పర్చూరు ఇన్‌చార్జి అవకాశం ఇవ్వాలని ఇటు మంత్రి బాలినేని, అటు సజ్జల, ఇతర నాయకులను కలిశారు. గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏమైనప్పటికీ తాజాగా బాలినేని పర్చూరు ఇన్‌చార్జిగా కాపు సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తామని బహిరంగంగా చెప్పటం చర్చనీయాంశమైంది. పర్చూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ లింగిశెట్టి రామాంజనేయలుతోపాటు మరొకరు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. దీంతో రామనాధంబాబు వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.స్పీడు పెంచిన నేతలు 

దర్శి నియోజకవర్గంలో దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం మాజీ మంత్రి శిద్దా వర్గీయులు స్పీడు పెంచారు. శిద్దా తనయుడు సుఽధీర్‌ పోటీకి సిద్ధమన్నట్లుగా ముందుడుగు వేస్తున్నారు. గిద్దలూరులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యే రాంబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తుండగా రాంబాబు కూడా దూకుడు పెంచారు. ఆయన కుమారుడు కృష్ణచైనత్య మండల, గ్రామస్ధాయిలో నేతలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ దర్శి మున్సిపాలిటీ ఓటమి అనంతరం అసమ్మతి గ్రూపును కలుపుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా కలిసేందుకు వారు ససేమిరా అంటున్నారు.  కనిగిరిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి భవిష్యత్‌లో మనకే టిక్కెట్టు అంటూ ఒక నాయకుడు ప్రత్యేక సమావేశాలు ప్రారంభించారు. కందుకూరులో స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఎన్నికైన తూమాటి మాధవ్‌ ఎమ్మెల్యే మహీధరరెడ్డితో సంబంధం లేకుండా స్థానిక నాయకులను మంత్రి బాలినేని, అలాగే సజ్జల వద్దకు తీసుకెళ్లడం ప్రారంభించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక ఎంపీపీ భర్త అయితే ఎమ్మెల్యేపై సవాళ్లు విసిరారు.


అసమ్మతి వర్గం సజ్జలను కలసి పలు ఫిర్యాదులు చేసింది. మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబసభ్యుల్లో ఇద్దరి పోకడపై పెద్ద ఫిర్యాదుల జాబితాను అదే సామాజికవర్గానికి చెందిన నేతలు అధిష్ఠానంకు అందించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం నాయకులలో ముఖ్యులు మంత్రి సురేష్‌పై కత్తులు నూరుతున్నారు. ఒంగోలులో ఆర్యవైశ్య సామాజికవర్గంకు చెందిన సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడి కొంత బాలినేనికి తలనొప్పిగా మారింది. ఇలా అంతర్గత సమస్యలు, ఆదిపత్యపోరుతో ఇటు ఉద్యోగులు, అటు మధ్య తరగతి ప్రజల్లో  పెరిగిన అసంతృప్తి అధికారపార్టీని అతలాకుతలం చేస్తున్నాయి.

Updated Date - 2022-01-15T05:03:00+05:30 IST