డ్రగ్స్‌ ప్రకంపనలు

ABN , First Publish Date - 2022-03-19T05:26:38+05:30 IST

ఒంగోలు కేంద్రంగా డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు నెలకొన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ విషయంలో ఇటీవల బయటపడుతున్న పలు అంశాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు ఇక్కడికి వచ్చి నగర పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించడం, దీనితో సంబంధం ఉన్న ఒకరిని అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

డ్రగ్స్‌ ప్రకంపనలు

చెన్నైతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు లింకు 

ఒంగోలులోనే తయారు చేస్తున్నట్లు అనుమానం

తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

కీలక సూత్రధారి రమేష్‌కోసం గాలింపు

ఒంగోలు (క్రైం), మార్చి 18 : ఒంగోలు కేంద్రంగా డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు నెలకొన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ విషయంలో ఇటీవల బయటపడుతున్న పలు అంశాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు ఇక్కడికి వచ్చి నగర పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహించడం, దీనితో సంబంధం ఉన్న ఒకరిని అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 

చెన్నై పోలీసుల విచారణలో బయటపడిన ఒంగోలు లింకు

చెన్నైలో మెథాంపెటమిన్‌ డ్రగ్‌ను వినియోగించే కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ మత్తు పదార్థం ఒంగోలులో తయారు చేస్తున్నట్లు తేలింది. దీంతో ఈనెల 7న ఒంగోలు వచ్చిన తమిళనాడు పోలీసులు కర్నూల్‌రోడ్డులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన పటోళ్ల వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన తర్వాత ఒంగోలు నుంచి చెన్నైతోపాటు హైదరాబాద్‌ తదితర నగరాలకు మెథాంపెటమిన్‌ అనే మత్తు పదార్థం సరఫరా జరుగుతుందన్న నిర్ధారణకు వచ్చారు. తమిళనాడు పోలీసులు వచ్చిన వెళ్లిన అనంతరం మత్తుపదార్థాలు తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్న గోడౌన్‌ను ఒంగోలు ఆర్డీవో నేతృత్వంలో ఐదారు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. అక్కడ అనుమానంగా ఉన్న 650 గ్రాముల పౌడర్‌ను సీజ్‌ చేసి పరీక్షల కోసం లేబొరెటరీకి పంపించారు.

 కేసు నమోదు..

మరోవైపు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో కూలి పనులు చేసుకునే ఆసి బాలకృష్ణ ఫిర్యాదు మేరకు  ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమానాస్పద గోడౌన్‌ నుంచి వచ్చే పొగను పీల్చిన తనతోపాటు మరికొంత మంది కూలీలు ఇబ్బందిపడ్డామని బాలకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమకు ఊపిరితిత్తుల వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు

కీలక సూత్రధారి రమేష్‌ కోసం గాలింపు

మత్తు పదార్థాల తయారీ కేంద్రం విషయంలో కీలక సూత్రధారి అయిన ఐతా రమేష్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చెన్నై పోలీసులకు పట్టుబడిన వెంకటరెడ్డి తాను టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ని మాత్రమేనని మిగతా వ్యవహారమంతా రమేష్‌ చూసుకుంటాడని అక్కడ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అదే క్రమంలో గోదాము లీజుదారుడు బ్రహ్మారావుకు ముఖేష్‌దాస్‌ అనే వ్యక్తి ద్వారా అద్దెను ఫోన్‌ పే ద్వారా చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. ముఖేష్‌దాసు పేర్నమిట్టలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూత్రధారి రమేష్‌ కూడా మన జిల్లా వాసి అని హైదరాబాద్‌లో ఉంటున్నట్లు వెల్లడైంది. ఇతను డ్రగ్స్‌ వ్యవహారం బయటపడిన తర్వాత బెంగళూరు వెళ్లినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను దొరికితే మత్తు పదార్థాల తయారీ వ్యవహారం బట్టబయలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు డ్రగ్స్‌ తయారీ ఉనికి ఒంగోలులో ఉన్నట్లు ఉన్నతాధికారులు సైతం అనుమానిస్తున్నారు. వారి ఆదేశాలతోనే కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

Read more