విధి నిర్వహణలో అలక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-03-04T06:43:59+05:30 IST

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించ వద్దని ఎంపీపీ సుంకర సునీత అన్నారు. గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.

విధి నిర్వహణలో అలక్ష్యం వద్దు
మాట్లాడుతున్న ఎంపీపీ సుంకర సునీత

సర్వ సభ్యసమావేశంలో ఎంపీపీ సునీత   
తాగునీటి సమస్యపై చర్చ
ముండ్లమూరు, మార్చి 3 :

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించ వద్దని ఎంపీపీ సుంకర సునీత అన్నారు. గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎంపీపీ సునీత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం నేరుగా ప్రజలకు అందే విధంగా ఆ శాఖల అధికారులు పని చేయాలన్నారు. రానున్న వేసవి కాలాన్నీ దృష్టిలో పెట్టుకొని సంబందిత అధికారులు ఆ గ్రామాలను సందర్శించి తాగు నీటి ఎద్దడి సమస్యల లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ నిర్మాణ భవనాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. జెడ్పీటీసీ తాతపూడి మోషెస్‌ రత్నరాజు మాట్లాడుతూ మూడు నెలలకు ఒక సారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి కొందరు అధికారులు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఎంపీడీవో చంద్రశేఖరరావు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ పథకాలు నేరుగా వారికి అందే విధంగా చూడాలని అధికారులను కోరారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో పైర్లను ఈ క్రాపు చేయించు కోవాలన్నారు. పశు వైద్యాధికారి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పశుపోషకులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీ పై దాణా, గడ్డి విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. పశువులకు  బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో చంద్రశేఖరరావు మాట్లాడుతూ మండల సచివాలయాల్లో పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. మండల సమావేశానికి ముఖ్యమైన అధికారులు తహసీల్దార్‌, ఏపీఎం, ఎంఈవో, హౌసింగ్‌ అధికారులు గైర్హాజరయ్యారు. వారి స్థానంలో కింది స్థాయి సిబ్బందిని సమావేశానికి పంపించారు.
సమస్యల పై గళమెత్తిన ఈదర, పూరిమెట్ల ఎంపీటీసీ సభ్యులు
మండల సర్వసభ్య సమావేశంలో ఈదర, పూరిమెట్ల ఎంపీటీసీ సభ్యులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈదర ఎంపీటీసీ అంకమరావు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉపాధి హామి పథకంలో మేట్లు నియమించే విషయంలో నిబందనలు పాటించటం లేదని, ఉన్న జీవోలను సైతం పక్కన పెడుతున్నారని, సంబందిత అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఎంపీడీవో దృష్టికి తీసుకు వచ్చారు. అన్ని గ్రామాల్లో ఉపాధి హామి పనులకు సంబందించి రెండు గ్రామ సభలు నిర్వహించగా తమ గ్రామంలో ఒక్క గ్రామ సభ మాత్రమే నిర్వహించారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. పూరిమెట్ల ఎంపీటీసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ ఏఈ భూరాజు, పశు వైద్యాధికారులు ప్రతాప్‌రెడ్డి, విజయలక్ష్మి, మారెళ్ళ సొసైటీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ మధు, పంచాయతీ రాజ్‌ ఏఈ ఆదిరెడ్డి, ఈవోఆర్‌డీ ఓబులేసు, వైస్‌ ఎంపీపీ బంకా రమణమ్మ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పామూరు : ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని ఎంపీపీ గంగసాని లక్ష్మీ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడి సెంటర్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సీడీపీవో పీఆర్‌ ఇవాంజిలిన్‌, సూపర్‌వైజర్లు దేవ కృపావరం, పద్మజ, డాక్టర్‌ బి పద్మసాయి ప్రశాంతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాళ్లూరు : ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తూ మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయున అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా   పలువురు సభ్యులు సమస్యను ప్రజల దృష్టికి తెచ్చారు. విఠలాపురం గ్రామం, రమణాలవారిపాలెం గ్రామాల్లో వీధిలైట్లు, డీప్‌ బోర్లు పనిచేయని విషయాన్ని గత రెండు నెలలుగా కార్యదర్శికి విన్నవించినా పట్టించుకున్న ధాఖలాలు లేవని మండల కో-ఆప్షన్‌ సభ్యులు కరిముల్లా సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎంపీపీ, జడ్పీటీసీలు ఆ గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా తాను ఈ విషయాన్ని సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.  ఆ సమస్యను పరిష్కరించాలని ఎంపీపీ, జడ్పీటీసీలు సూచించారు. బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాలకు విద్యుత్‌లైన్‌మెన్‌ లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీటీసీలు బాలకోటయ్య, వెంకటేశ్వరరెడ్డిలు అధికారులదృష్టికి తీసుకవచ్చారు. తాళ్లూరు అంబేద్కర్‌ నగర్‌లోని ఎంపీపీ పాఠశాలకు హరివాడ అన్న పేరు తొగించాలని తాళ్లూరు-2 ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు అధికాలకు విన్నవించారు. బొద్దికూరపాడులో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓసీ సెంటర్‌ను బీసీ సెంటర్‌లో విలీనం  చేయటం వల్ల ఇబ్బంది పడుతున్నామని పలువురు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-04T06:43:59+05:30 IST