ఈకేవైసీకి దూరం
ABN , First Publish Date - 2022-08-14T05:55:16+05:30 IST
కేంద్రం నిర్దేశించిన గడువు ముగిసినా రైతాంగంలోని సగంమంది ఇంకా ఈకేవైసీకి దూరంగానే ఉన్నారు. దీంతో వారంతా కేంద్రప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం 12వ విడత సాయం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఇంకా చేయించుకోని సగంమంది రైతులు
ఇప్పటివరకు చేయించుకుంది 54శాతం మాత్రమే
ఈనెల 15 వరకు గడువు పెంపు
ఒంగోలు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నిర్దేశించిన గడువు ముగిసినా రైతాంగంలోని సగంమంది ఇంకా ఈకేవైసీకి దూరంగానే ఉన్నారు. దీంతో వారంతా కేంద్రప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం 12వ విడత సాయం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. అవగాహనలోపం, ఆ దిశగా వారిని చైతన్యపర్చడంలో సంబంధిత యంత్రాంగం తగుచర్యలు చేపట్టక పోవడం వల్ల పెద్దసంఖ్యలో రైతులు సకాలంలో ఈకేవైసీ చేయించుకోలేదు. రైతులకు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నా తగు స్పందన ఉండటం లేదని వ్యవసాయశాఖ అధికారులు చెప్తుండగా.. ఈకేవైసీ చేసే కామన్ సర్వీస్ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో సర్వర్లు పనిచేయక, సిబ్బంది నుంచి సరైన స్పందన లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతుసంఘాల నేతలు అంటున్నారు. జిల్లాలో అధికారవర్గాల సమాచారం ప్రకారం 3,18,889 మంది రైతులకు ఆధార్ అథెంటికేషన్ ఉంది. వారిలో సుమారు లక్షా 31వేల మంది గతంలోనే పలు అవసరాల కోసం, వివిధ సందర్భాలలో ఈకేవైసీ వేయించుకుని ఉన్నారు.
విధిగా ఈకేవైసీ చేయాలి
2018లో కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఏటా ఒక్కో రైతుకు రూ.6వేల మొత్తాన్ని రూ.2వేల వంతున మూడు విడతలు నేరుగా బ్యాంకు అకౌంట్లకు జమచేస్తోంది. దానికి మరో రూ.7500 కలిపి రాష్ట్రప్రభుత్వం రైతుభరోసా పేరుతో ఇస్తోంది. కాగా ఇప్పటివరకు కేంద్రం 11 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలకు జమచేసింది. అలాగే 12వ విడత నిధులు సెప్టెంబరు, అక్టోబరుల్లో జమచేయ నుంది. అయితే ఈసారి పీఎం కిసాన్ నగదు అందుకునే రైతులందరూ విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు జూన్ తొలి వారంలో ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం జూలై ఆఖరు వరకు అందుకు గడువు విధించింది. జిల్లాలో ఆధార్ అథెంటికేషన్ ఉన్న 3.13 లక్షలమంది రైతుల్లో 1.31లక్షల మంది మాత్రమే అప్పటివరకు ఈకేవైసీ చేయించుకొని ఉన్న విషయం గుర్తించిన అధికారులు మిగిలిన వారంతా జూలై ఆఖరులోగా పూర్తిచేసుకోవాలని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఆర్బీకేల ద్వారా రైతులకు ఆమేరకు తెలియజేసినట్లు చెప్తున్నారు.
54శాతమే నమోదు
గడువు ముగిసినా జిల్లాలో కేవలం 54శాతం మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నట్లు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అధికారవర్గాల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఒంగోలు మండలంలో గరిష్ఠంగా 69శాతం మంది రైతులు ఈకేవైసీ చేయించుకోగా అత్యల్పంగా పక్కన ఉన్న కొత్తపట్నం మండలంలో 32శాతం మంది మాత్రమే చేయించుకున్నారు. కొండపి, కురిచేడు, మర్రిపూడి, పీసీపల్లి, పొన్నలూరు టంగుటూరు, జరుగుమల్లి మండలాల్లో 60 నుంచి 66శాతం వరకు పూర్తయ్యింది. వెలిగండ్ల, త్రిపురాంతకం, తర్లుపాడు, పుల్లలచెరువు, పామూరు, కనిగిరి, కంభం, చీమకుర్తి, సీఎస్‌పురం, తదితర మండలాల్లో 40 నుంచి 50శాతంలోపు మాత్రమే ఈకేవైసీ జరిగింది. దీనిని బట్టి చూస్తే ఒకవైపు రైతులకు అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు కొన్ని ప్రాంతాల్లో తగుస్థాయిలో చర్యలు తీసుకోకపోగా, మరోవైపు రైతాంగంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈకేవైసీ చేయించుకునేందుకు ఈనెల 15 వరకు గడువును ప్రభుత్వం పెంచినట్లు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఏడీ రమేష్‌బాబు తెలిపారు. కిసాన్ సమ్మాన్ సాయానికి కేంద్రం ఈకేవైసీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో రైతులందరూ పెంచిన గడువును సద్వినియోగం చేసుకొని ఆలోపు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.