ఉదయలక్ష్మి వర్సెస్‌ బలరాం కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2022-11-15T23:30:45+05:30 IST

గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి కలెక్టర్‌ బి.ఉదయలక్ష్మి, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. దాదాపు 16ఏళ్లకు పైగా విచారణ జరిగింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ స్పెషల్‌ కోర్టు జడ్జి జస్టిస్‌ పి.గాయత్రిదేవి బుధవారం ఈ కేసులో బలరాంతోపాటు మరో 20మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.

ఉదయలక్ష్మి వర్సెస్‌ బలరాం కేసు కొట్టివేత

కరణంతో పాటు మరో 20 మందిని నిర్దోషులుగా ప్రకటించిన స్పెషల్‌ కోర్టు

గుండ్లకమ్మ నిర్మాణ సమయంలో నాటి కలెక్టర్‌, కరణం మధ్య ఘర్షణ

ఒంగోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి కలెక్టర్‌ బి.ఉదయలక్ష్మి, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. దాదాపు 16ఏళ్లకు పైగా విచారణ జరిగింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ స్పెషల్‌ కోర్టు జడ్జి జస్టిస్‌ పి.గాయత్రిదేవి బుధవారం ఈ కేసులో బలరాంతోపాటు మరో 20మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించే సమయంలో నిర్వాసితులు, రైతుల పక్షాన నాడు ప్రతిపక్ష టీడీపీ తరఫున అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అదే సమయంలో 2006 నవంబరు 16న ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేసిన మట్టికట్ట తెగిపోయి ఎగువ నుంచి వచ్చే నీరు మల్లవరం గ్రామం వైపు రావడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందారు. వారి పక్షాన బలరాం జిల్లా యంత్రాంగంపై ధ్వజమెత్తారు. ఈక్రమంలో ఆ మరుసటి రోజైన నవంబరు 17న మల్లవరంలో యంత్రాంగం గ్రామస్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా అప్పటి కలెక్టర్‌ బి.ఉదయలక్ష్మి, నాటి జేసీ సిద్ధార్థజైన్‌, ప్రాజెక్టుల ఎస్‌ఈ సూర్యనారాయణబాబు ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన బలరాం గ్రామస్థులు, నిర్వాసితుల పక్షాన అధికారులను నిలదీయడంతోపాటు మట్టికట్ట ఏర్పాటును తప్పుబట్టారు. ఆ సందర్భంగా కలెక్టర్‌, బలరాం మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి సమావేశం రసాభాసగా మారింది. అనంతరం రాత్రికి ఎమ్మెల్యే బలరాంపై కలెక్టర్‌ ఉదయలక్ష్మి, ఎస్‌ఈ సూర్యనారాయణ ఒంగోలులో కేసులు పెట్టారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు ఈ కేసులు పెట్టారన్న ఆరోపణలు రాగా బలరాం రెండురోజులు అజ్ఞాతంలోకి వెళ్లి అనంతరం లొంగిపోయారు. జైలుకు కూడా వెళ్లి రాగా నాటి కాంగ్రెస్‌ నాయకులు కొందరు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంపై దాడులకు కూడా దిగారు. అదేసమయంలో బలరాం మద్దతుగా టీడీపీ రాష్ట్ర నేతలు జిల్లాకు వచ్చి ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టారు. ఇదిలాఉండగా అప్పటి కలెక్టర్‌ ఉదయలక్ష్మి పేరుతో రెండు, ఎస్‌ఈ సూర్యనారాయణబాబుతో ఒకటి మొత్తం మూడు కేసులను ఒంగోలు-2 టౌన్‌ స్టేషన్‌లో రిజిస్టర్‌ చేసి అనంతరం మద్దిపాడుకు బదిలీ చేయగా ఒక కేసును గతంలోనే ఒంగోలు కోర్టులో కొట్టివేశారు. ఆ కేసులో పలుమార్లు ఉదయలక్ష్మి, సిద్ధార్థజైన్‌, సూర్యనారాయణబాబులు కోర్టుకు హాజరయ్యారు. ఇతర రెండు కేసులు బలరాం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో విజయవాడలోని స్పెషల్‌ కోర్టుకు బదిలీ అయ్యాయి. అందులో ఉదయలక్ష్మి ఫిర్యాదుపై కేసు నమోదు కాగా ఎస్‌ఈ సూర్యనారాయణబాబు ఫిర్యాదుపై బలరాంతోపాటు మరో 20మంది మల్లవరం వాసులపై 353, 431, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన కోర్టు ఆకేసులను కొట్టివేసి బలరాంతోపాటు 20 మంది రైతులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తీర్పుపై బలరాం స్పందిస్తూ తనతోపాటు రైతులపై అప్పటి అధికారులు అక్రమ కేసులు పెట్టారన్నారు. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. నిర్దోషులుగా బయటపడటంతో మల్లవరం రైతులు ఆనందం వ్యక్తం చే శారు.

Updated Date - 2022-11-15T23:30:48+05:30 IST