తవ్వుకో.. పెంచుకో!

ABN , First Publish Date - 2022-03-16T06:38:21+05:30 IST

అద్దంకి ప్రాంతంలో చేపల చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.

తవ్వుకో.. పెంచుకో!
శింగరకొండపాలెం సమీపంలో భవనాసి అంచున తవ్వుతున్న చేపల చెరువు

ఇష్టారాజ్యంగా చేపల చెరువుల తవ్వకాలు

అనుమతులు లేకుండానే కొత్తవి 

చెరువులుగా మారుతున్న పంట పొలాలు

భవనాసి అంచున అడ్డగోలుగా వ్యవహారం

పట్టించుకోని అధికారులు 

 అద్దంకి, మార్చి 15 : అద్దంకి ప్రాంతంలో చేపల చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పదుల సంఖ్యలో కొత్త చెరువులు ప్రత్యక్షమవుతున్నా యి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధన లు పట్టించుకోకుండా కొందరు ఈ వ్యవహారం సాగి స్తున్నారు. పంట పొలాలను సైతం చెరువులుగా మార్చి చేపలు పెంచుతున్నారు. అధికారులు పట్టిం చుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. భారీ మొత్తాలు ముట్టడంతోనే వారు మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


భవనాసి అంచునే కొత్తగా చెరువులు

భవనాసి చెరువు అంచునే రెండు రోజుల నుంచి కొత్తగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్స్‌కవేటర్‌తోపాటు డ్రోజర్‌, ట్రాక్టర్‌ల సాయంతో కట్టలు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు అంచునే నిర్మాణం చేస్తుండటంతో భవనాసి కూడా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పంట పొలాలు కాస్తా చేపల చెరువులుగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఉన్న చేపల చెరువులతోపాటు, ఇప్పుడు నుంచివచ్చే  వ్యర్థాలు మొత్తం భవనాసిలోకి వదులుతున్నారు. దీంతో నీరు కలుషితమవుతోంది. కొత్త వాటి నుంచి కూడా అదే పరిస్థితి ఎదురుకానుంది. 


కిమ్మనని  అధికారులు 

ప్రస్తుతం ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. ప్రతి విభాగానికీ సిబ్బంది ఉన్నారు. ఇలా ఒక్కో సచివాలయంలో సరాసరిన 10 నుంచి 14 మంది పనిచేస్తున్నారు. విచ్చలవిడిగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నా ఉన్నతాధికారు లకు సమాచారం ఇవ్వకపోవడం ఆరోప ణలకు ఆస్కారం ఇస్తోంది. శింగరకొం డపాలెం వద్ద తరచూ అనధికార చేపల చెరువుల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక రోజులో జరిగే పని కాదు. యంత్రాలతో చెరువు తవ్వేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. అంతకాలం సిబ్బందికి తెలియకుండానే పనులు జరుగుతాయనుకుంటే పొరపాటే. విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లి అక్కడ నుంచి ఆదేశాలు వస్తేనే హడావుడి చేస్తున్నారు. పాతవాటి మరమ్మతుల పేరుతో ఇటీవల కొత్త చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు కిమ్మనకపోవడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. 


ఆర్డీవో ఆదేశించినా..

ఇటీవల ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి శింగరకొండ వచ్చారు. ఆ సందర్భంగా భవనాసి చెరువు ఆక్రమణకు గురికాకుండా, అనధికారిక చేపల చెరువుల నిర్మాణం చేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో ఏమాత్రం మార్పు రాకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి లేని చేపల చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయటంతోపాటు, గతంలో అనుమతులు  లేకుండా తవ్విన చేపల చెరువులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.


Read more