‘దర్శి రెవెన్యూ’లో సిబ్బంది కొరతతో ఇబ్బంది
ABN , First Publish Date - 2022-08-11T04:30:19+05:30 IST
దర్శి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పనులు ముందుకు సాగటం లేదు. పనుల కోసం వచ్చిన అవసరార్థులు కా ర్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగాల్సి వస్తోంది.

సకాలంలో కాని పనులు
అల్లాడిపోతున్న అవసరార్థులు
దర్శి, ఆగస్టు 10 : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పనులు ముందుకు సాగటం లేదు. పనుల కోసం వచ్చిన అవసరార్థులు కా ర్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగాల్సి వస్తోంది. దర్శికి రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవటం, డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండటం వలన ఇబ్బంది నెలకొంది. ప్రస్తుతం దొనకొండ తహసీల్దార్ కె. వెంకటేశ్వర్లు ఇక్కడ కూడా ఎఫ్‌ఏసీగా విధులు నిర్వహిస్తున్నారు. రెండూ పెద్ద మండలాలు కావటంతో రెండుచోట్ల పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. డిప్యూటీ తహసీల్దార్ కొద్దిరోజుల క్రితం సస్పెం డ్ కావటంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉంది. రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఏడాది క్రితం కురిచేడు డిప్యూటేషన్‌పై పంపించారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. మండలంలో విధుల న్నీ ఏఆర్‌ఐ ఒక్కరే చూడాల్సి వస్తుంది. అదేవిదంగా దర్శి పట్టణంలో మూడు వీఆర్వో పోస్టులు కొత్తపల్లి, రాజంపల్లి, పోతకమూరు వీఆర్వో పోస్టులు ఇన్‌చార్జులతో నడుస్తున్నాయి. ఆ వీఆర్వోలు రెండుచోట్ల విధులు నిర్వహించటం వలన ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికశాతం అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో వివిధ రకాల పనుల కోసం వచ్చిన ప్రజలు సకాలంలో పనులు కాక ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గుర్తించి పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించి మెరుగైన సేవలు సత్వరమే అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అవసరార్థులు కోరుతున్నారు.