గుప్తనిధుల కోసం నంది విగ్రహం ధ్వంసం
ABN , First Publish Date - 2022-10-18T05:23:47+05:30 IST
వజ్రాలు ఉన్నాయన్న నమ్మకంతో పురాతన నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
కనపర్తిలో ఘటన
గ్రామస్థులతో కలిసి విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆందోళన
నాగులుప్పలపాడు (ఒంగోలురూరల్), అక్టోబరు 17 : వజ్రాలు ఉన్నాయన్న నమ్మకంతో పురాతన నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన సముద్రతీర ప్రాంత గ్రామమైన కనపర్తిలోని చారిత్రక శ్రీగంగా పార్వతి సమేత ఏలేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు అర్ధరాత్రి కనపర్తిలోని ఏలేశ్వరస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల వైర్లు తొలిగించి మండపంలో ఉన్న రాతి నంది విగ్రహాన్ని పలురకాలు రసాయనాలను ఉపయోగించి పగులకొట్టారు. ఆలయ గర్భగుడి బయట ఇరువైపులా ఉన్న వినాయక విగ్రహాలను తొలిగించటానికి ప్రయత్నించారు. గ్రామానికి చెందిన మహిళ గుండమ్మ వారికి తారసపడటంతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. ఉదయాన్నే గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాగులుప్పపాడు ఎస్‌ఐ రమణయ్య కనపర్తి చేరుకుని విగ్రహాలను పరిశీలించారు. పగిలిన రాతి విగ్రహాల ముక్కలను పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. ముఠా కదలికలకు సంబంధించి అమ్మనబ్రోలు వాటర్‌ప్లాంట్, పెట్రోలుబంకుల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వాటిలో ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చినట్లు గుర్తించారు. గుప్తనిధుల కోసమే నంది, వినాయక విగ్రహాలను పగులకొట్టినట్లు భావిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. దేవాలయ పూజారి పార్దు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గ్రామస్థుల ఆందోళన
గుప్తనిధుల కోసం ఆలయంలోని రాతి నంది, వినాయక విగ్రహాలను పగులకొట్టిన ఘట నపై గ్రామస్థులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అట్లా బ్రహ్మారెడ్డి, బోగిరెడ్డి విజయశేఖర్‌రెడ్డి, అట్లా శివారెడ్డి పాల్గొన్నారు. చారిత్రక ఏలేశ్వరాలయంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీ్‌సలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.