రైతువారీ లెక్క..!

ABN , First Publish Date - 2022-12-16T22:54:33+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో జిల్లాలో ఈనెల 9 నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు ముసురుపట్టి విస్తారంగా భారీవర్షాలు కురవడంతో లక్షల ఎకరాలు నీట మునిగి, పైర్లు దెబ్బతిన్నాయి. తద్వారా సుమారు రూ.500 కోట్లుకుపైగా రైతులు నష్టపోయారు. అత్యధికంగా పొగాకు పంటకు నష్టం వాటిల్లగామినుము, మిర్చి, పత్తి, కంది, శనగ, వరి, అలసంద, మొక్కజొన్న ఇలా తదితర పంటలు దెబ్బతిన్నాయి.

రైతువారీ లెక్క..!

ప్రాఽథమికంగా 98,305 ఎకరాలకుపైగా గుర్తింపు

అత్యధికంగా మినుము, అలసంద, పొగాకు

పొగాకు తోటల పరిశీలిస్తున్న సీటీఆర్‌ఐ బృందం

భారీగా దెబ్బతిన్న పంటలు

కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతులు

-కొండపి మండలంలో వివిధ గ్రామాల్లో తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పొగాకు తోటలను సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందం శుక్రవారం పరిశీలించింది. వెన్నూరు, చోడవరం, ముప్పవరం, పెరిదేపి, కొండపి, పెదకండ్లగుంట గ్రామాలతోపాటు జరుగుమల్లి మండలంలోని కామేపల్లి, పైడిపాడు, అక్కచెరువుపాలెం గ్రామాల్లో వివిధ పరిస్థితుల్లో ఉన్న తోటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు.

-టంగుటూరు మండలంలోని ఈక్రాప్‌ బుకింగ్‌, దాని వెంటనే పంట నష్టం నమోదు జోరుగా సాగుతోంది. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం అందుకు ఈక్రాప్‌ బుకింగ్‌ నిబంధన విధించింది. ఈక్రాప్‌ బుకింగ్‌ యాప్‌ తుఫాన్‌ ముగిశాక లాగిన్‌ ఇచ్చారు. ఈవారంలోనే వ్యవసాయ సిబ్బందికి పర్మిషన్‌ వచ్చింది. దీంతో ఈక్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు

-మాండస్‌ తుఫానుకు దెబ్బతిన్న పంటల నష్టాలపై సమగ్ర లెక్కలు తీసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు, పొగాకు బోర్డు అధికారులు వారి వారి పరిధిలో రైతువారీ పంట నష్టాలపై దృష్టిసారించారు. అందుకోసం వందలాది మంది క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం పంట నష్టాలు జరిగిన గ్రామాల్లో సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు.ఖరీఫ్‌ పంటలకు ఈ క్రాప్‌ నమోదుప్రక్రియ గతంలోనే ముగియగా, రబీకి చేపట్టలేదు. దీంతో దెబ్బతిన్న పంటలలో రబీ సీజన్‌లో వేసిన వాటికి ముందు ఈక్రాప్‌ నమోదు చేసి ఆ వెంటనే నష్టం అంచనాల సర్వే కూడా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, తదనుగుణంగా ప్రక్రియ నడుస్తోంది.

ఒంగోలు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మాండస్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో జిల్లాలో ఈనెల 9 నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు ముసురుపట్టి విస్తారంగా భారీవర్షాలు కురవడంతో లక్షల ఎకరాలు నీట మునిగి, పైర్లు దెబ్బతిన్నాయి. తద్వారా సుమారు రూ.500 కోట్లుకుపైగా రైతులు నష్టపోయారు. అత్యధికంగా పొగాకు పంటకు నష్టం వాటిల్లగామినుము, మిర్చి, పత్తి, కంది, శనగ, వరి, అలసంద, మొక్కజొన్న ఇలా తదితర పంటలు దెబ్బతిన్నాయి.కొన్ని మొలక నుంచి మూడు వారాలు, నెలలోపు ఉన్నవి దెబ్బతినగా, మరి కొన్ని పంటలు చేతికంది వచ్చే దశలో ఉండి పాడైపోయాయి.కాగా మండస్‌ తుఫాను వల్ల జిల్లాలో సుమారు 98,305 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో వ్యవసాయ శాఖ పరిధిలోని పంటలు 35 మండలాల్లోని 510 గ్రామాలలో సుమారు 67,265 ఎకరాలలో ఉండగా, ఉద్యాన శాఖ పరిధిలో మరో 8,974 ఎకరాలు దెబ్బతింది.

సర్వే చేపట్టిన అధికారులు

వ్యవసాయ శాఖ పరిధిలో దెబ్బతిన్న పంటలు ప్రాథమిక అంచనా ప్రకారం 44,441 ఎకరాలలో మినుము, 17,805 ఎకరాలలో అలసంద, 4,344 ఎకరాలలో వరి, 553 ఎకరాలలో పత్తి దెబ్బతినగా పరిమితంగా ఇతర పంటలు చూపారు. పొగాకు బోర్డు పరిధిలోని పొగ తోటలుసుమారు 15,520 ఎకరాల్లో దెబ్బతినగా, ఉద్యాన శాఖ పరిధిలో మిర్చి 8,610 ఎకరాల్లో, కూరగాయలు ఇతరాలు మరో 36 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇలా ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించే ప్రక్రియలో కీలకమైన రైతు వారీ, పంటల వారీ సర్వే చేపట్టారు. వారంలో సర్వే పూర్తిచేసి నష్టపోయిన రైతుల జాబితాల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిశీలన మరో వారంలో పూర్తిచేసి రెండు వారాల్లో మొత్తం వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

సీటీఆర్‌ఐ శాస్త్రవేతల పరిశీలన

అలాగే గురువారం జిల్లాలో పర్యటించిన పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు కూడా రైతువారీ నష్టాల సర్వే చేయాలని బోర్డు సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే దెబ్బతిన్న పొగ తోటలను సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తగ్గించుకునే అవకాశం ఉన్న పరిస్థితులను పరిశీలించి, రైతులకు తగు సూచనలు చేస్తున్నారు. ఇక కలెక్టర్‌ ఆదేశాలతో వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది రైతుభరోసా కేంద్రం యూనిట్‌గా రైతువారీ, పంటల వారీ సమగ్ర నష్టాల సర్వేగురువారం నుంచే చేపట్టారు. ప్రభుత్వం పరిహారం అందించడంలో ఈ క్రాప్‌ నమోదు కీలకం కాగా, రబీలో సాగు చేసి దెబ్బతిన్న పంటలకు ఆ ప్రకియను కూడా ఒకేసారి చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) ఎస్‌. శ్రీనివాసరావు తెలిపారు. త్వరితగతిన సర్వే పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెప్పారు. పొగాకు 15,520 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారుల సమాచారాన్ని బట్టి తెలుస్తుండగా, రైతువారీ గ్రామల వారీ సమగ్ర నివేదికలను పొగాకు బోర్డు సిబ్బంది రూపొందిస్తున్నారు.

అంతా తాలుకాయలుగా మారాయి:

- ఉలావు లింగన్న, మిర్చి రైతు, కంభం

నేను 3 ఎకరాల మిర్చి పంట వేశాను. అయితే భారీవర్షాల మూలంగా చెట్లపైనే కాయలకు తెగుళ్లు సోకాయి. అంతా తాలుకాయలుగా మారాయి. దిగుబడి తగ్గడంతోపాటు ధర కూడా క్షీణించింది. ఏమిచేయాలో అర్థంకాకుండా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - 2022-12-16T22:54:38+05:30 IST