ఆ ఇద్దరూ ఇళ్లు కట్టుకున్నారు

ABN , First Publish Date - 2022-08-05T05:01:43+05:30 IST

దర్శి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానికత నిరూపించుకునే విషయంలోను పో టీపడ్డారు. ఇద్దరు ఏడాది కాలంలోనే సొంత గృహలు నిర్మించుకొని ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యారు.

ఆ ఇద్దరూ ఇళ్లు కట్టుకున్నారు
ఎమ్మెల్యే మద్దిశెట్టి గృహం, బూచేపల్లి గృహం

దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి మధ్య ఇంటిపోరు


ఒకరు 8న, మరొకరు 11న ప్రారంభోత్సవాలు                                           

స్థానికత నిరూపణలోను పోటీపడ్డారు

వెళ్లాలా... వద్దా.. నేతలు, అధికారులు అయోమయం

నేతల  మధ్య ముదిరిన ఆధిపత్య పోరు  

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

దర్శి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానికత నిరూపించుకునే విషయంలోను పో టీపడ్డారు. ఇద్దరు ఏడాది కాలంలోనే సొంత గృహలు నిర్మించుకొని ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి తన గృహ ప్రారంభోత్సవం 8వ తేదీ ఏర్పాటుచేయగా మాజీ ఎమ్మెల్యే శిప్రసాద్‌రెడ్డి తన గృహ ప్రారంభోత్సవం 11వ తేదీ ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఇద్దరూ అటు పార్టీ పెద్దలను నియోజకవర్గంలోని నేతలు, అభిమానులను ఆహ్వనిస్తున్నారు. దీంతో అటు పార్టీ శ్రేణుల్లోను అధికారుల్లోను అయోమయ పరిస్థితి నెలకొంది. 


ఇద్దరు బయటివారే..

దర్శి నియోజకవర్గంలో ఇటు మద్దిశెట్టి అటు బూచేపల్లి ఇద్దరూ బయట నియోజకవర్గాల నుంచి వచ్చి అక్కడ రాజకీయం చేస్తున్న వారే. 2004లో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తండ్రి దివంగత సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొంది తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. 2009 ఎన్నికల్లో సుబ్బారెడ్డి కుమారుడైన శివప్రసాద్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుత ఎమ్మెల్యే వేణుగోపాల్‌ 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఇద్దరూ నియోజకవర్గానికి బయటివారే. బూచేపల్లి స్వగ్రామం చీమకుర్తి మండలం ఓబచెత్తపాలెం. చీమకుర్తిలో స్థిరపడ్డారు. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ స్వగ్రామం కనిగిరి నియోజకవర్గం, పా మూరు మండలం, లక్ష్మీనర్సాపురం. బెంగళూరులో స్థిరపడ్డా రు. ఇటు శివప్రసాద్‌రెడ్డి 2004లో తండ్రి గెలుపొందిన నాటి నుంచి దర్శిని ఎంచుకొని బలపడ్డారు. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ 2009 పీఆర్‌పీ తరఫున పోటీ చేసినప్పటి నుంచి దర్శిని సొంత నియోజకవర్గంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత లక్ష్మీనర్సాపురంలో సొంతిళ్లు కూడా కట్టుకున్నారు. గ త ఎన్నికల్లో బూచేపల్లి పోటీకి దూరంగా ఉండటంతో వైసీపీ వేణుగోపాల్‌ను రంగంలో దింపగా బూచేపల్లి మద్దతు ఇచ్చా రు. ఎన్నికలైన తర్వాత ఏడాది తిరగక ముందే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆధిపత్య పోరు మొదలైంది. ప్రస్తుతం శివప్రసాద్‌రెడ్డి తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్‌పర్సన్‌. ఆమె దర్శి జడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు.


ఒకరు పొదిలి రోడ్డులో.. ఇంకొకరు కురిచేడు రోడ్డులో...

కాగా ఇద్దరు నాయకులు ఇప్పటివరకు దర్శిలో ఇళ్లు లేవు. అయితే దర్శి నుంచి పొదిలి వెళ్లే రోడ్డులో దివంగత సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కొంత స్థలం కొన్నారు. ఆ తర్వాత శివప్రసాద్‌రెడ్డి మరికొంత కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే వేణుగోపాల్‌ ఏడాదిన్నర క్రితం దర్శి నుంచి కురిచేడు వైపు వెళ్లే రోడ్డులో కేఎ్‌సఆర్‌ విహార్‌ లేఅవుట్‌లో స్థలం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పెరిగిన తర్వాత ఇద్దరు సొంతిళ్ల నిర్మాణం వైపు దృష్టిసారించారు. సుమారు 25సెంట్లు స్థలం తీసుకున్న ఎమ్మెల్యే అందులో 10 సెంట్లలో గృహనిర్మాణం చేపట్టారు. ఇటు బూచేపల్లి కూడా ఎకరం స్థలానికి ప్రహరీ నిర్మించి అందులో 10సెంట్లలో గృహనిర్మాణం ప్రారంభించారు. అధికారికంగా ఈనెల 8న ప్రారంభోత్సవం చేపట్టారు. మూడు అంతస్తులుగా ఆయన గృహం నిర్మించారు. ఇటు బూచేపల్లి కూడా ఈనెల 11న అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఆయన కూడా గ్రౌండ్‌ప్లోర్‌తోపాటు రెండంతస్తులతో నిర్మాణం చేపట్టారు. ఇద్దరు నాయకులు కూడా వారి కార్యాలయాలు, అలాగే కార్యకర్తలతో సమావేశాల నిర్వహణకు అవసరమైన మీటింగ్‌ హాల్‌, కుటుంబసభ్యులతో కలిసి ఉండేందుకు అవసరమైన పడక గదులతో కూడిన నిర్మాణాలు, అలాగే సిబ్బంది ఉండేందుకు గదులు కూడా నిర్మించారు. ఇద్దరు నాయకులు కూడా నిర్మాణాలకు కోట్లు వ్యయం చేశారు.  


అందరిలో అయోమయం

ఇదిలా ఉండగా ఇద్దరు నాయకులు ఇళ్ల ప్రారంభోత్సవాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి సీఎంను కలిసిన శివప్రసాద్‌రెడ్డి ఇంటి నిర్మాణ విషయం తెలిపి 11న ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే కూడా తన ఇంటి నిర్మాణ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాడని అంటున్నారు. అలాగే ఇద్దరు నాయకులు ప్రారంభోత్సవాలకు ఆహ్వానించటం మొదలుపెట్టారు. పార్టీలోనే రాష్ట్ర జిల్లా నాయకులతోపాటు అధికారులు, నియోజకవర్గ నాయకులు, శ్రేణులను ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా ఒకవైపు ముద్రపడిన వారిని మినహా మిగిలిన వారికి ఇద్దరి నుంచి ఆహ్వానాలు వెళుతున్నాయి. దీంతో ఒకరి ఇంటికి వెళ్లి మరొకరి ఇంటికి వెళ్లకుంటే ఎవరు ఏమనుకుంటారో అనే అయోమయ పరిస్థితి కొందరు జిల్లా నాయకులు, అధికారుల్లో నెలకొంది. రెండు కార్యక్రమాలకు వెళ్లేందుకు కొందరు సిద్ధం కాగా, ఏదో ఒక సాకుతో రెండింటికి దూరంగా ఉండాలని మరికొందరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నియోజకవర్గ అధికారులు, నాయకులు పరిస్థితి అంతే. రాజకీయంగా అధిపత్యపోరు నడుపుతున్న ఇద్దరూ స్థానికత నిరూపించుకునే విషయంలో పోటీపడుతున్న తీరు చూసి నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుండటం విశేషం.


Updated Date - 2022-08-05T05:01:43+05:30 IST