కనిగిరి, వైపాలెంపై స్పష్టత ఇచ్చిన బాబు

ABN , First Publish Date - 2022-09-30T05:35:54+05:30 IST

అన్ని విధాలా మీ పనితీరు బాగుంది. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగండి అంటూ కనిగిరి ఇన్‌ఛార్జ్‌ డాక్టరు ఉగ్రనరసింహారెడ్డిని అభినందించిన ఆపార్టీ అధినేత చంద్రబాబు. ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్‌ మీరే ఎలాంటి అపోహలను, ప్రచారాలను నమ్మకుండా ఎన్నికలకు సన్నద్ధం కండంటూ ఎరిక్షన్‌బాబుకి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భరోసా నిచ్చారు. ఇద్దరు నాయకులకు దాదాపు అన్ని విషయాలలో స్పష్టతనిచ్చినట్లు కూడా తెలుస్తోంది.

కనిగిరి, వైపాలెంపై స్పష్టత ఇచ్చిన బాబు
కనిగిరి ఇన్‌చార్జి ఉగ్ర నరసింహారెడ్డి సమీక్షిస్తున్న చంద్రబాబునాయుడు

ఉగ్ర పనితీరుకి  బాబు అభినందనలు 

  మీరే ఇన్‌ఛార్జ్‌.. నీదే బాధ్యత అంటూ ఎరిక్షన్‌కు భరోసా

  ఎరిక్షన్‌కు సహకరించాల్సిందేనంటూ డాక్టరు రవీంద్రకు సూచన

  (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

 అన్ని విధాలా మీ పనితీరు బాగుంది. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగండి అంటూ కనిగిరి ఇన్‌ఛార్జ్‌ డాక్టరు ఉగ్రనరసింహారెడ్డిని అభినందించిన ఆపార్టీ అధినేత చంద్రబాబు. ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్‌ మీరే ఎలాంటి అపోహలను, ప్రచారాలను నమ్మకుండా ఎన్నికలకు సన్నద్ధం కండంటూ ఎరిక్షన్‌బాబుకి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భరోసా నిచ్చారు. ఇద్దరు నాయకులకు దాదాపు అన్ని విషయాలలో స్పష్టతనిచ్చినట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలోనే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేకంగా భేటి అవుతున్న చంద్రబాబు నాయుడు బుధ, గురువారాలలో డాక్టరు ఉగ్రనరసింహారెడ్డి, ఎరిక్షన్‌బాబులతో వేర్వేరుగా సమావేశమై సమీక్ష చేశారు. కనిగిరిపై డాక్టరు ఉగ్రతో ఐదు పది నిమిషాల లోపే సమీక్ష ముగించిన చంద్రబాబు ఎర్రగొండపాలెం విషయంపై లోతైన సమీక్ష చేశారు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు డాక్టరు మన్నె రవీంద్రను కూడా పిలిచి ఎరిక్షన్‌బాబు విషయంలో పూర్తి స్పష్టతనిచ్చారు. ముందుగా డాక్టరు ఉగ్రతో సమావేశమైన చంద్రబాబు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయటమే గాక పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో ఉండటం పట్ల ఉగ్రకు అభినందనలు తెలిపారు. కనిగిరిలో శాశ్వత పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం, అన్నా క్యాంటిన్‌ ఏర్పాటు తదితర అంశాలపై డాక్టరు ఉగ్ర ఇచ్చిన సమాచారం అనంతరం ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటంలోను నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల చేతిలో దగా పడ్డవారికి అండగా నిలవటంలోను ఉగ్ర నిర్వహించిన పాత్రపై అభినందించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలలో పాల్గొనేవిధంగా ముందుకు సాగాలని ఉగ్రకు సూచించారు. వచ్చే ఎన్నికలలో గెలుపుని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించుకున్నారా లేదా అంటూ  కొన్ని అంశాలపై లోతైన సమీక్ష చేసినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ కూడా అన్ని విషయాలలో మీకు అండగా ఉంటుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.


 ఎరిక్షన్‌కు భరోసా

 ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నారంటూ అడపాదడపా వస్తున్న ప్రచారాలను పరిగణలోకి తీసుకోవద్దని ఎరిక్షన్‌బాబుకి చంద్రబాబు సూచించారు. మీరు స్థానికంగా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న పనితీరు బాగుందని రాష్ట్ర పార్టీ కూడా మీకు అన్నివిధాలా అండగా ఉంటుందని ఇదే ఒరవడితో ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. చివర్లో తాము రంగంలోకి వస్తామంటూ కొంతమంది చేసుకునే ప్రచారాన్ని నమ్మవద్దని మీ విషయంలో పార్టీ ధృడమైన నిర్ణయంతో ఉందని కూడా చెప్పినట్లు తెలిసింది. అయితే ఎప్పుడో పార్టీలోకి వస్తారని భావించి వారికోసం ప్రస్తుతం పార్టీలో ఉన్నవారిని విస్మరించవద్దని కొన్ని గ్రామాలలో ఉన్న అలాంటి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఎరిక్షన్‌కు ఆయన సూచించారు. అలాగే ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు, జడ్‌పి మాజీ వైస్‌ ఛైర్మన్‌ డాక్టరు మన్నె రవీంద్రను కూడా పిలిపించుకుని మాట్లాడటం విశేషం. మీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఎరిక్షన్‌బాబే కొనసాగుతారు. పార్టీకి అంకితమై పనిచేస్తున్న ఓ మంచి నాయకుడు ఆయన. ఎరిక్షన్‌బాబుకి మీ నుంచి కూడా సంపూర్ణ సహాయసహకారాలు అందించి ప్రోత్సహించమని చంద్రబాబు చెప్పారు.ఈ విషయంలో ఇతరత్రా అపోహలకు తావు లేకుండా ముందుకు సాగాలని భవిష్యత్తులో మీ సేవలకు తగిన అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు డాక్టరు రవీంద్రకు చెప్పినట్లు తెలుస్తోంది.


Read more