జీతాలకు హాజరు లింకు

ABN , First Publish Date - 2022-11-25T00:19:20+05:30 IST

అనుకున్నంత అయింది. ఏదైతే జరగకూడదని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారో దాన్నే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లేదు లేదంటూనే టీచర్ల ముఖ ఆధారిత గుర్తింపు హాజరును ఉపాధ్యాయుల జీతాలకు లింకు చేసేందుకు తెరచాటు ప్రయత్నాలను ప్రారంభించింది.

జీతాలకు హాజరు లింకు

ఆందోళనలో ఉపాధ్యాయులు

ఒంగోలు(విద్య), నవ ంబరు 24 : అనుకున్నంత అయింది. ఏదైతే జరగకూడదని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారో దాన్నే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లేదు లేదంటూనే టీచర్ల ముఖ ఆధారిత గుర్తింపు హాజరును ఉపాధ్యాయుల జీతాలకు లింకు చేసేందుకు తెరచాటు ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ ఆధారిత గుర్తింపు హాజరు నమోదులో నిమిషం లేటు అయినా ఒకపూట సెలవుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జీతాలకు హాజరు లింకు శరాఘాతంగా మారనుంది. అందరికి ఒకేసారి కాకుండా ఒక్కొక్కరికి వరుసగా ఈ విధానాల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొదటగా ప్రయోగాత్మకంగా ఆయా జిల్లాల్లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు (మోడల్‌ స్కూళ్లు) పనిచేసే ఉపాధ్యాయుల జీతాలకు ముఖ ఆధారిత హాజరును లింకు చేయమని ప్రభుత్వం ఇటీవల పాఠశాల విద్యా ఆర్‌జేడీలకు మౌఖిక ఆ దేశాలు జారీచేసింది. దీంతో అయ్యవార్లలో ఆందోళన మొదలైంది. ఉమ్మడి జిల్లాలో 37 కేజీబీవీలు, 11 ఏపీ మోడల్‌ సూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి డిసెంబరు నెల జీతాలను ముఖ ఆధారిత హాజరు ప్రకారం ఇవ్వనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే క్రమక్రమంగా ప్రభుత్వ రంగంలోని పాఠశాలలన్నింటిలో పనిచేస్తున్న టీచర్లకు ముఖ ఆధారిత హాజరును జీతాలకు అనుసంధానం చేయనున్నారు. దీంతో నెట్‌వర్క్‌ సక్రమంగా లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులపై కక్షసాధింపే

ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరును జీతాలకు లింకు చేయడం ఉపాధ్యాయులపై కక్షసాధింపేనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ ఆధారిత హాజరు అమలును మొదట ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. ఆ సమయంలో టీచర్ల హాజరు నమోదును 10 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. అయితే ఇందుకు భిన్నంగా పల్నాడు జిల్లాలోని ఒక పాఠశాలలో నలుగురు టీచర్లు నిమిషం లేటుగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేయడంతో వారికి ఆ జిల్లా విద్యాశాఖ శ్రీముఖాలు పంపింది. ముఖ ఆధారిత హాజరు నమోదును పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ చేయకపోవడంతో సెలవులు, ఇతర విషయాల్లో ఇప్పటికి టీచర్లు తికమకపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికి 80శాతం మంది టీచర్లు ముఖ ఆధారరిత హాజరును నమోదు చేయగలుగుతున్నారు. 90శాతంపైగా టీచర్లు ముఖ ఆధారిత హాజరుకు తమ పేర్లు యాప్‌లో నమోదు చేసుకున్నా నెట్‌వర్క్‌ సమస్యతో అందరూ వేయలేకపోతున్నారు.

వేధిస్తున్న నెట్‌వర్క్‌ సమస్య

జిల్లాలోని వైపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు, అర్ధవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం తదితర మండలాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్నాయి. తాజాగా ముఖ ఆధారిత హాజరు నమోదుకు పాఠశాల జీపీఎ్‌సను అనుసంధానం చేయడంతో పాటు పాఠశాలలో ఉండి హాజరు వేస్తేనే నమోదు అవుతుంది. అయితే పాఠశాల ఉన్న ప్రాంతంలో నెట్‌వర్క్‌ లేకపోవడంతో ఇంటర్నేట్‌ చక్రం తిరుగుతుందే కానీ హాజరు నమోదు కాకపోతుండటంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్య పరిష్కరించకుండా జీతాలకు ముఖ ఆధారిత హాజరును లింకు చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని జీతాలకు ముఖ ఆధారిత హాజరును లింకు చేయకుండా వదిలేస్తారో లేక మొండిగా ముందుకు వెళతారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2022-11-25T00:19:23+05:30 IST