అందరూ దివ్యాంగులేనా..?

ABN , First Publish Date - 2022-11-20T23:46:09+05:30 IST

విధి చిన్నచూపు చూసిన విభిన్న ప్రతిభావంతులను పింఛన్‌ ఇచ్చి ప్రభుత్వాలు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే అక్రమమార్గంలో పింఛన్‌ పొందేందుకు కొంత మంది మండలంలో బధిరులుగా ధ్రువపత్రాలు పొందారు. వాటి ద్వారా నెలనెలా దివ్యాంగుల పింఛన్‌ను తీసుకుంటున్నారు.

అందరూ దివ్యాంగులేనా..?

ఒకే మండలంలో 771 మందికి పింఛన్లు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ

రాచర్ల, నవంబరు 20 : విధి చిన్నచూపు చూసిన విభిన్న ప్రతిభావంతులను పింఛన్‌ ఇచ్చి ప్రభుత్వాలు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే అక్రమమార్గంలో పింఛన్‌ పొందేందుకు కొంత మంది మండలంలో బధిరులుగా ధ్రువపత్రాలు పొందారు. వాటి ద్వారా నెలనెలా దివ్యాంగుల పింఛన్‌ను తీసుకుంటున్నారు. ఒకే మండలంలో 771 మంది దివ్యాంగులు ఉండటంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. వారు ఎంపీడీవో కవితాచౌదరిని విచారణకు ఆదేశించారు. అయితే ఇది మొక్కుబడిగా సాగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దివ్యాంగుల పింఛన్‌ తీసుకుంటున్న వారిలో 600 మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులకు తృణమో,ఫణమో ముట్టజెప్పి అక్రమమార్గంలో సర్టిఫికెట్లు పొంది పింఛన్‌దారుల జాబితాలో చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఒక్కోగ్రామంలో 100 మందికిపైగా పింఛన్లు

మండలంలో దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్న వారి సంఖ్యను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. గుడిమెట్ట పంచాయతీలో 107, ఆకవీడు పంచాయతీలో 125 జెపిచెరువులో 78, యడవల్లిలో 46, సత్యవోలులో 37, అనుమలపల్లెలో 55, రాచర్లలో 113, చినగానిపల్లెలో 41, చోళ్ళవీడులో 52, అనుమలవీడులో 97 మంది, సోమిదేవిపల్లి 20 మంది దివ్యాంగుల పింఛను పొందుతున్నారు. వీటిలో అక్రమమేన్ని సక్రమమేన్ని అనేది అధికారులే లెక్కతేల్చాలి ఉంది.

నిపుణులు లేకుండా విచారణ

పింఛన్‌ పొందుతున్న వారు నిజంగా దివ్యాంగులా? లేదా? అన్నది నిర్ధారించడానికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ అవసరం. అయితే అలాంటిదేమి లేకుండా కేవలం ఎంపీడీవో పర్యవేక్షణలో ఓ ఉద్యోగి మొక్కుబడిగా విచారిస్తున్నారు. దీంతో యథాప్రకారం అక్రమ పింఛన్లు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అక్రమమార్గంలో తీసుకున్న సర్టిఫికెట్లతో పింఛన్‌లు పొందుతున్న వారికి అధికార పార్టీ నేతల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ తూతూమంత్రంగా సాగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-11-20T23:46:28+05:30 IST