ముఖ్యనేత అనుచరుల వెంచర్లపై చర్యలేవీ?
ABN , First Publish Date - 2022-12-16T23:00:22+05:30 IST
కనిగిరి ప్రాంతంలో అక్రమంగా, అనధికారికంగా వేసిన వెంచర్లపై రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వారంరోజులుగా చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఒక వర్గం రియల్టర్లు గుర్రుగా ఉన్నారు. అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందరికీ ఒకే నిబంఽధన ఉండాలని పట్టు
కనిగిరి, డిసెంబరు 16: కనిగిరి ప్రాంతంలో అక్రమంగా, అనధికారికంగా వేసిన వెంచర్లపై రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వారంరోజులుగా చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఒక వర్గం రియల్టర్లు గుర్రుగా ఉన్నారు. అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పట్టణ సమీపంలోని కొత్తూరు ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా వేసిన వెంచర్లలోని హద్దురాళ్ల తొలగింపును తహసీల్దార్ పుల్లారావు, మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు నేతృత్వంలో సచివాలయ, మున్సిపల్ సిబ్బంది చేపట్టారు. ఎక్స్‌కవేటర్‌తో ఆయా వెంచర్లలోని హద్దు రాళ్లను తొలగించారు. ఈ సమయంలో ఆయా వెంచర్లకు చెందిన రియల్టర్లు, వైసీపీకి చెందిన మరో వర్గం నాయకులు బ్రహ్మారెడ్డి, మూలే గోపాల్‌రెడ్డిలు తహసీల్దార్ పక్షపాత వైఖరిని నిలదీశారు. కందుకూరు రోడ్డులో దళితులకు చెందిన భూములను ఆక్రమించి ఇష్టానుసారంగా వెంచర్లు వేయడమే కాకుండా, ప్రధాన రోడ్డు వెంట మూడంతస్థులు భవనాలు నిర్మిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కనిగిరి చుట్టుపక్కల నియోజకవర్గ ముఖ్య నేత అనుచరులు వేసిన వెంచర్లు, పట్టణ సమీపంలోని వివిధ రోడ్డు మార్గాల వెంట అనధికారికంగా వెంచర్లు వేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అంతేకాకుండా ముఖ్యనేత అనుచరులకు చెందిన వెంచర్లలోని హద్దురాళ్లు తొలగించకుండా మిగతా వాటిపై అంత తొందరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఒకే నిబంధన, న్యాయం అమలు చేయాలని సూచించారు. ఈ సమయంలో తహసీల్దార్ అక్రమ వెంచర్లన్నింటిపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. అక్రమంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకునేందుకు 7 నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. కొందరు అక్రమ భవనాల నిర్మాణానికి పునాది తీసినప్పుడే తాము ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోవలేదని తహసీల్దార్‌ను నిలదీశారు. ప్రస్తుతం ఆయా భవనాలు పూర్తై నివాసం కూడా ఉంటున్నా మీరు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.