ఇంకొల్లు సీఐల మార్పుతో గందరగోళం

ABN , First Publish Date - 2022-10-12T03:43:07+05:30 IST

ఇంకొల్లు సీఐగా ఎవరు వస్తున్నారో.. ఎప్పుడు ఎవరు ఎందుకు వెళ్లి పోతున్నారో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఇంకొల్లు సీఐల మార్పుతో గందరగోళం

ఎవరు వస్తున్నారో..ఎప్పుడు   

వెళ్తున్నారో తెలియని పరిస్థితి

వెనువెంటనే ముగ్గురు బదిలీ

తాజాగా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

ఇంకొల్లు, అక్టోబరు 11 : ఇంకొల్లు సీఐగా ఎవరు వస్తున్నారో.. ఎప్పుడు ఎవరు ఎందుకు వెళ్లి పోతున్నారో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు అధికారి పేరు తెలిసేలోపే  ఆ స్థానంలో కొత్త అధికారి పేరు వినిపిస్తోంది. ఇంకొల్లు సర్కిల్‌ సీఐలు వెనువెంటనే ముగ్గురు మారారు. బాధ్యతలు స్వీకరించిన ఒక్కరోజులోనే ఒక సీఐని బదిలీ చేశారు.  గత నాలుగు నెలలుగా ఇంకొల్లులో సీఐ ఎవరనేది తెలియని పరిస్థితి ఉంది. జూలై 24వ తేదీన కె.సుబ్బారావు సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చిందో గాని రెండోరోజే ఆయనను బదిలీ చేశారు.  జూలై  26వ తేదీన రంగనాథ్‌ను నియమించారు. చినగంజాం మండలంలో ఆర్మీ జవాన్‌ మృతికి ఆయనే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.  దీంతో సుబ్బారావును ఉన్నతాధికారులు నాలుగు రోజుల క్రితం ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. తాజాగా సీఐ వి.సత్య నారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం  సర్కిల్‌ కార్యాలయంలో సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. వెంటవెంటనే ముగ్గురు సీఐలు రావడం, వెళ్లడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మరోపక్క సీఐ లేకపోవడంతో సర్కిల్‌ పరిధిలోని బెల్ట్‌షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ఎక్కువైంది. ఇప్పటికైనా సీఐగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ ఇంకొల్లులో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్‌, మద్యం అక్రమ వ్యాపారాలపై దృష్టిసారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Read more