‘అల’జడి

ABN , First Publish Date - 2022-12-10T00:10:10+05:30 IST

జిల్లాపై మాండస్‌ తుఫాన్‌ ప్రభావం శుక్రవారం కనిపించింది. ఉదయం నుంచే ప్రారంభమైన చలిగాలులు సాయంత్రానికి అధికమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల జల్లులు మొదలయ్యాయి.

‘అల’జడి

ఒడ్డుకుచేరిన పడవలు

తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో

ఒక మోస్తరు వర్షం

ఇంకామించితే నష్టపోతామని

రైతుల ఆందోళన

జిల్లాపై మాండస్‌ తుఫాన్‌ ప్రభావం

అప్రమత్తమైన యంత్రాంగం

ఒంగోలు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై మాండస్‌ తుఫాన్‌ ప్రభావం శుక్రవారం కనిపించింది. ఉదయం నుంచే ప్రారంభమైన చలిగాలులు సాయంత్రానికి అధికమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల జల్లులు మొదలయ్యాయి. రాత్రికి తూర్పు, దక్షిణ ప్రాంతంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తీవ్రత అధికంగా కనిపించింది. మత్స్యకారులు సముద్రంలో వేటను నిలిపివేయడంతోపాటు పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, తదనంతరం తుఫానుగా, తీవ్ర తుఫానుగా మారింది. దానికి మాండ్‌సగా నామకరణం చేశారు. చెన్నై-పుదుచ్చేరి మధ్య శనివారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతమిళనాడుతోపాటు దక్షిణ, కోస్తాంధ్రపై కూడా ఉంటుందని రెండు రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర విపత్తుల శాఖ కూడా తదనుగుణంగాచర్యలకు ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత, జిల్లా స్థాయి కీలకశాఖల అధికారులకు కలెక్టర్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్‌ ప్రభావం ఉండే ప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను క్షేత్రస్థాయి సిబ్బంది గురువారమే అప్రమత్తం చేశారు. గురువారం సాయంత్రం నుంచే జిల్లాపై తుఫాన్‌ ప్రభావం కనిపించింది. శుక్రవారం పగలు వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు ఈదురు గాలులు అధికమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి జల్లులు ప్రారంభమయ్యాయి. ఒంగోలు, కొండపి, కనిగిరి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఒంగోలు నగరంలో సాయంత్రం కురిసిన వానకు జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. సముద్రంలో అలలు ఎగసిపడుతూ అల్లకల్లోలంగా ఉండటంతో కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, నాగులప్పలపాడు, ఒంగోలు మండలాల్లో తీర ప్రాంత మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా తుఫాన్‌ ప్రభావంతో పలుచోట్ల వర్షం కురుస్తుండగా మరింత అధికమైతే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. శనివారం తెల్లవారుజామున తుఫాన్‌ మహాబలిపురం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉండగా, సాయంత్రం వరకూ జిల్లాలో వర్షాలు కురుస్తాయని సమాచారం.

Updated Date - 2022-12-10T00:10:15+05:30 IST