మార్కాపురం మున్సిపాల్టీలో ఏసీబీ తనిఖీలు
ABN , First Publish Date - 2022-08-05T04:56:18+05:30 IST
మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళికా విభాగం జనన, మరణ ధ్రువీకరణ విభాగంలోని ఫైళ్లను బృందం తనిఖీ చేసింది. పట్టణ ప్లానింగ్ విభాగంలో ఉన్న అధికారులు, సిబ్బందితో పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్ మాట్లాడారు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైళ్ల పరిశీలన
అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకుంటాం
ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్
మార్కాపురం(వన్‌టౌన్), ఆగస్టు 4: మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళికా విభాగం జనన, మరణ ధ్రువీకరణ విభాగంలోని ఫైళ్లను బృందం తనిఖీ చేసింది. పట్టణ ప్లానింగ్ విభాగంలో ఉన్న అధికారులు, సిబ్బందితో పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్ మాట్లాడారు. మార్కాపురం మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపై తనిఖీలు చేసేందుకు వచ్చామని తెలిపారు. వివిధ పనుల కోసం లంచాలు అడగుతూ వేధిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. పట్టణంలో అనధికారిక కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, ప్లాన్ ఒక విధంగా ఉంటే కట్టడాలు మరోలా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించామన్నారు. అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది చర్యలు తీసుకోకపోగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించామన్నారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న ఒక ఎంటర్‌ప్రైజెస్‌కు 2 భవనాల కోసం వేర్వేరుగా ప్లాన్లు తీసుకొని ఒకే భవనం నిర్మించినట్లు గుర్తించామన్నారు. దీంతో భవనం ప్లాన్ మొత్తం మారిపోయిందని టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తించామన్నారు. పట్టణంలో ప్రణాళిక ప్రకారం భవనాలు నిర్మించటం లేదని సెట్‌బ్యాక్‌లను వదలకుండా నిర్మిస్తున్నట్లు గుర్తించామన్నారు. పూర్తిస్థాయిలో వివిధ ఫైళ్లను పరిశీలించి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. ఈ తనిఖీలలో సీఐలు శేషు, టీవీ.శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ తనిఖీలతో మున్సిపాల్టీలోని సిబ్బంది సీట్లు వదిలి వెళ్లిపోయారు.