పాపం పండేనా!

ABN , First Publish Date - 2022-12-07T01:40:39+05:30 IST

అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలు. లిక్కర్‌ స్కాంలు.. భూ అక్రమాలు. కోర్టులను సైతం తూలనాడుతూ వ్యాఖ్యలు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడులు. ఇవీ జిల్లాలో గత కొంతకాలంగా సాగుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతల బరితెగింపు చర్యలు. ఇప్పుడు అవన్నీ వారి మెడకు చుట్టుకుంటున్నాయి. పాపం పండినట్లు ఒక్కో బాగోతం బయటపడుతోంది.

పాపం పండేనా!

పాపం పండేనా!

వరుసగా వైసీపీ నాయకులపై విచారణలు

అండర్‌గ్రౌండ్‌లో ఒక మాజీ ఎమ్మెల్యే

ఈడీ విచారణ ఉచ్చులో ఎంపీ

చర్చనీయాంశంగా ఒంగోలు భూఆక్రమణలు

ఆ కేసుల్లో ఉద్యోగులే బలి అంటూ ప్రచారం

గతంలో మార్కాపురంలో జరిగింది అదే

తామూ తప్పించుకోవచ్చని నేతల్లో ధీమా

అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలు. లిక్కర్‌ స్కాంలు.. భూ అక్రమాలు. కోర్టులను సైతం తూలనాడుతూ వ్యాఖ్యలు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడులు. ఇవీ జిల్లాలో గత కొంతకాలంగా సాగుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతల బరితెగింపు చర్యలు. ఇప్పుడు అవన్నీ వారి మెడకు చుట్టుకుంటున్నాయి. పాపం పండినట్లు ఒక్కో బాగోతం బయటపడుతోంది. ఒకవైపు సీబీఐ, మరోవైపు సీఐడీ, ఇంకోవైపు కోర్టులు.. ఇలా ఒకదాని వెంట మరొక విచారణ నడుస్తోంది. ముఖ్యంగా ఒంగోలులో ఓ ప్రజాప్రతినిధి భూమేత వ్యవహారంపై సీఐడీ విచారణ చేపట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌స్కాంలో ఈడీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఎంపీ పేరు ఉండటం కలకలం రేపింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోర్టునుద్దేశించి చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం సీరియస్‌గా తీసుకొంది. సీబీఐ వెంటాడుతుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకున్న అధికారపార్టీ నేతలు ఎలా బయటపడతారన్న విషయం అలా ఉంచితే భూబాగోతాల కేసుల్లో నాయకులను పక్కకు తప్పించి ఉద్యోగులపైనే కొరడా ఝుళిపించే దిశగా సీఐడీ అధికారులు అడుగులు వేస్తున్నట్లు అప్పుడే విమర్శలు వస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉమ్మడి జిల్లాలో వరుసగా వైసీపీ నేతలపై ఆరోపణలు, ఆపై కేసుల విచారణలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. ప్రధానంగా మొన్న సీబీఐ, నిన్న ఈడీ, తాజాగా సీఐడీ నోటీసుల వ్యవహారం సంచలనంగా మారింది. ఒంగోలు భూకుంభకోణంలో కీలక నేతలు ఉన్నట్లు తేలడంతో మరింత చర్చనీయాంశమైంది. అయితే భూబకాసురులైన నేతలను వదిలేసి అందులో పాత్రధారులైన ఉద్యోగులకు ఉచ్చు బిగుస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులోభాగంగా సీఐడీ అధికారులు రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీచేశారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. వారు అడిగిన సర్వే నెంబర్లలోని భూములను పరిశీలిస్తే అన్నింటిలోనూ వివిధ రూపాల్లో చట్టవ్యతిరేక చర్యలు లేక హక్కుదారులపై దౌర్జన్యకర వ్యవహారాలు, బలవంతపు రిజిస్ట్రేషన్లు జరిగాయనేది నగ్న సత్యం. ముంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు వద్ద ప్రైవేట్‌ స్థలం వ్యవహారంలో ఒక కీలక ప్రజాప్రతి నిధి కిందిస్థా యిలో అదే పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల పాత్రపై బహిరంగంగానే చర్చ నడుస్తోంది. ఆ తర్వాత అదే భూమిలో మూ డు ఎకరాలు వ్యాపార రంగంలో ఉన్న ఒక ఎమ్మెల్యే తన బంధువుల పేరుతో కొనుగోలు చేశారు. ఇది బహిరంగ రహస్యమే. అదే స్థలాన్ని హక్కుదారులైన బలహీనుల నుంచి బలవంతంగా లాక్కున్నారని, వారికి ఇష్టమైన మేరకు డబ్బులు ఇచ్చి రిజిస్టర్‌ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రైవేటు స్థలం కాబట్టి సీఐడీ జోక్యంతో మాకు ఇబ్బంది లేదనే ధీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

భూబకాసురులు చిక్కేనా?

సీఐడీకి ఫిర్యాదు అందిన వాటిలో మంగమూరు రోడ్డులోనిది మినహా మిగిలిన భూములన్నీ ప్రభుత్వానికి చెందినవే. అవి అన్నీ కూడా అధికార పార్టీ నేతల ఆక్రమణలో ఉన్న మాట నిజం. ఈ ఆక్రమణలకు సంబంధించి ఒక ఫిర్యాదుదారుడు రెవెన్యూ అధికారుల పాత్రపైనే ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి సీఐడీ అధికా రులు కూడా రెవెన్యూ అధికారులకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఈ భూముల రిజిస్ర్టేషన్లు, ఇతర చట్టపరమైన రికార్డుల మార్పునకు సంబంధించి మాత్రమే ప్రస్తుతా నికి సీఐడీ అధికారులు రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మన జిల్లాలోని మార్కాపురం డివిజన్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు భారీగా జరిగాయి. అలాగే కనిగిరి దర్శి ప్రాంతాల్లోని వేల ఎకరా లు అన్యాక్రాంతమయ్యాయి. వాటికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు, వారి సమీప బంధువులు, ఆపై కిందిస్థాయి వైసీపీ నాయకులపై పుంకానుపుంకాలుగా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యనేతల పాత్ర బహిరంగం గానే కనిపించింది. కానీ అధికారుల దర్యాప్తు మాత్రం రికార్డుల తారుమారుకే పరిమితమైంది. తారుమారు చేసి భూములు ఆక్రమించిన పెద్దలను వదిలేసి వారి ఒత్తిళ్లకు లేక డబ్బులకు ఆశపడి సహకరించిన ఉద్యోగులపైనే చర్యలు తీసుకున్నారు. తప్పు చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడాన్ని అందరూ హర్షించారు. కానీ అధికార పార్టీ పెద్దలను వదిలేయటం ప్రజలను విస్తుబోయేలా చేసింది. ప్రస్తుతం ఒంగోలు భూ బాగోతాలపై సీఐడీ దృష్టిసారిం చటం కూడా ఆ తరహాలోనే పోతుందనే అనుమానులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అందుకే సీఐడీ అధికారుల ప్రాథమిక చర్యలు కూడా ఊతమిస్తున్నాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

మాజీ ఎమ్మెల్యేకు సీబీఐ భయం

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెంది ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అధికారపార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే గత కొంతకాలం నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వ పెద్దలు, కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని అనుచరులకు అందుబాటులో ఉన్నా బాహ్య ప్రపంచంలో మాత్రం తిరగటం లేదు. అందుకు కారణం సీబీఐ అధికారులు అతడిని అరెస్టు చేసేందుకు సిద్ధం కావటమే. సీఎం, వైసీపీ అధినేత జగమోహన్‌రెడ్డిమెప్పుకోసం కాబోలు ఒక దశలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపైన, న్యాయమూర్తులపైన వైసీపీ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యానాలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆ మాజీ ఎమ్మెల్యే ప్రథమస్థానంలో ఉన్నారు. న్యాయమూర్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలోనే కాక కొన్ని టీవీ చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్‌ నేరుగా ఫిర్యాదు చేయటంతో ఆ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. అలా రాష్ట్రంలో సుమారు 33 మందిపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. అందులో పలువురిని ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చటం, వారిని రిమాండ్‌కు పంపడం జరిగింది. వారిలో కొందరు అనంతరం బెయిల్‌ తెచ్చుకున్నారు. కానీ ఈ మాజీ ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన నోటీసులకు తిరుగు సమాధానం ఇచ్చారే తప్ప సీబీఐ అధికారుల దర్యాప్తునకు సహకరించడం లేదు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టేందుకు రంగంలోకి వచ్చారు. ఇది గమనించిన ఆ మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదని తెలిసింది. అయితే సీబీఐ అధికారులు అతడిని అరెస్టు చేసేందుకు తిరుగుతుండటంతో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే సమయంలో ఒంగోలులోని ఒక కోర్టు నుంచి ఆయనకు వేరే కేసులో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ అయింది. అయితే ఈ వారెంట్‌ను అమలు చేయాల్సింది రాష్ట్రపరిధిలోని పోలీసులు కావటంతో దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.

నోటీసులు వచ్చే అవకాశం

మరోవైపు ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సాక్షాత్తు ఎంపీ పేరునే పేర్కొనటం తెలిసిందే. సీబీఐ అధికారులు అలా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ముగ్గురిలో తెలంగాణకు చెందిన సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ అయ్యాయి. తదనంతరం మన ఎంపీకి కూడా నోటీసులు రావచ్చనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-12-07T01:40:41+05:30 IST