ముంచేసిన కలుపు నివారణ మందు

ABN , First Publish Date - 2022-01-31T04:01:18+05:30 IST

ఓ పేరున్న కంపెనీ మందును మిరప పైరులో కలుపు నివారణ కోసం వాడితే మొక్కలకు పెరుగుదలే లేకుండా చేసింది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్ట పోయారు.

ముంచేసిన కలుపు నివారణ మందు
ముంచేసిన కలుపు నివారణ మందు

పిచికారీతో ఆగిన మొక్క పెరుగుదల 

తీవ్రంగా నష్ట పోయిన రైతులు

న్యాయం చేయాలని వేడుకోలు

దొరవారిసత్రం, జనవరి 30 : ఓ పేరున్న కంపెనీ మందును మిరప పైరులో కలుపు నివారణ కోసం వాడితే మొక్కలకు పెరుగుదలే లేకుండా చేసింది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్ట పోయారు. మండలంలోని పూలతోట గ్రామంలో ఏటా మాదిరే ఈ ఏడాదీ రైతులు సుమారు 70 ఎకరాల్లో మిరపను సాగుచేశారు. కొందరు సొంతం తోపాటు కౌలు భూముల్లోనూ పైరును వేశారు.  గ్రామంలోని  వెంకట రమణ ఫర్టిలైజర్స్‌ దుకాణం నుంచి దుకాణ యజమాని సలహా మేరకు రైతులు  గుర్తింపు పొందిన కంపెనీ కలుపు నివారణ మందును మిరప తోటల్లో పిచికారీ చేశారు.  కొంత మేర  కలుపు నివారణ జరిగినా, మొక్కలు ఎదుగుదల లేకుండా ఆగిపోయాయి. పైరు వేసిన 15 నుంచి 20 రోజుల్లో రైతులు ఈ మందును పిచికారీ చేశారు.  45 రోజులు గడిచినా పెరుగుదల లేకుండా గిటకరించుకు పోయాయి. రైతులు మొక్కల పెరుగుదలకు కాంప్లెక్స్‌ ఎరువులను, మందులను  వేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కలుపు నివారణ కోసం పిచికారీ చేసిన మందు వల్ల ఇలా జరిగిందని రైతులు గుర్తించారు. ఆ  గ్రామంలో 40 మంది రైతులకు చెందిన 34 ఎకరాల్లో మిరప పైరు దెబ్బతింది. ఈ మందును పిచికారీ చేయని రైతుల తోటల్లో మాత్రం మొక్కలు ఏపుగా  పెరిగాయి. మిరప పంట బాగా కాపు కాస్తే ఎకరానికి రూ. 2.5 లక్షల వరకు చేతికి వస్తుందని, పెట్టుబడి రూ. 70 వేల పోయినా, రూ. 1.80 లక్షల ఆదాయం వస్తుందని, అలాంటిది  తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలోని ఫర్టిలైజర్‌ దుకాణ యజమాని అవగాహన లోపం వల్ల ఇలా జరిగిందని రైతులు వాపోతున్నారు. ఆ దుకాణాన్ని మూడు రోజుల పాటు రైతులు మూత వేశారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.   


కంపెనీ నుంచి పరిహారం చెల్లించాలి

ఐదెకరాల లీజు భూమిలో మిరప పైరు వేశాను.  మంచి గుర్తింపు ఉన్న కంపెనీది కావడంతో పిచికారీ చేశాను. మిరప మొక్కలో పెరుగుదల ఆగిపోయింది. కంపెనీ ప్రతిని ధులు సిపార్సుతోనే రైతులకు ఈ మందు ఇచ్చానని దుకాణ యజమాని చెబుతున్నాడు. నష్టపోయిన రైతులకు కంపెనీ నుంచి పరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.           -యువరాజు, రైతు

ఆ మందును ల్యాబ్‌కు పంపుతున్నాం

పిచికారీ మందును ఆ దుకాణంలో సీజ్‌చే శాం. ఆ మందును ల్యాబ్‌కు పంపుతు న్నాం. మిరప పైరులో ఈ మందును వాడవచ్చో లేదోనని కంపెనీయే తెలపాలి. రైతులకు, ఫర్టిలైజర్‌ దుకాణ దారునికి అవగాహన లేక ఇలా జరిగింది. ఈ విషయం ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లాం.  నష్టపోయిన రైతు లకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాం. 

 - రాజ్‌కుమార్‌, ఏడీఏ, సూళ్లూరుపేట


Updated Date - 2022-01-31T04:01:18+05:30 IST