జన జాతర

ABN , First Publish Date - 2022-09-16T05:41:29+05:30 IST

దివ్యాభరణాలతో అలంకృతులైన పోలేరమ్మ బుధవారం రాత్రి అత్తారిల్లైన చాకలింటి నుంచి పూలతో అలంకరించిన సప్రంపై ఆసాదుల తప్పెట్ల నడుమ ఊరేగింపుగా పోలేరమ్మ గుడి వద్దకు బయల్దేరారు.

జన జాతర

 అశేష జనసందోహం నడుమ పోలేరమ్మ విరూపోత్సవం


 ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో వెంకటగిరి పట్టణం పోటెత్తింది. అశేష భక్తుల మొక్కుల నడుమ పోలేరమ్మ జాతర గురువారం సాయంత్రం ఆరుగంటలకు వైభవోపేతంగా ముగిసింది. జాతరకు బయటి ప్రాంతాలనుంచి తరలివచ్చిన బంధువులు, స్నేహితులతో ప్రతి ఇంటా సందడి నెలకొంది.


వెంకటగిరి, సెప్టెంబరు 15 : దివ్యాభరణాలతో అలంకృతులైన పోలేరమ్మ బుధవారం రాత్రి అత్తారిల్లైన చాకలింటి నుంచి పూలతో అలంకరించిన సప్రంపై ఆసాదుల తప్పెట్ల నడుమ ఊరేగింపుగా పోలేరమ్మ గుడి వద్దకు బయల్దేరారు. గురువారం తెల్లవారుజామున పోలేరమ్మ దేవస్థానం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేప మండలతో వేసిన మండపంలో కొలువుదీరాక భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం వర్షం కారణంగా జనం తాకిడి పెద్దగా లేకపోయినా 10 గంటల తర్వాత వర్షం తెరిపి ఇవ్వడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. నగరి ఆభరణాలైన బంగారు శూలం, సరుడును రాజా అనుచరుల ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరించి తీసుకు వెళ్ళారు. నగరి సారెలైన సరవళ్లను రాజా అనుచరులు అమ్మవారికి సమర్పించారు. దీంతో ఎట్టివారు కుండలో వెలిగించిన గండ దీపాన్ని అమ్మవారికి చూపించి  పొలిమేరల్లోకి తీసుకుపోయారు. అక్కడ అమ్మవారి బలి దున్నపోతును నరికి ఆ రక్తంతో పొలికుండల్లోని అన్నంతో కలిపి ఊరి పొలిమేరల్లో చల్లారు. ఈ పొలి చల్లడం వల్ల ఊరిని చీడపీడలు ఆశించవన్నది ఇక్కడి ప్రజల నమ్మకం. దున్నపోతు రక్తంతో తడిచిన కత్తిని అమ్మవారికి చూపిన తరువాత రాజావారి నగరిలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ట్రక్కును తీసుకు వచ్చి అమ్మవారి ప్రతిమను వుంచి భక్త జనసందోహం నడుమ శివాలయం వద్దకు తరలించారు. తరువాత ఆభరణాలను తొలగించి  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌పై ప్రతిమను వుంచారు. కైవల్యానది మీదుగా మల్లయ్య తోట వద్ద ఏర్పాటు చేసిన విరూప మండపానికి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమను విరూపం గావించారు. అమ్మవారి ప్రతిమ విరూపం చేసే వరకు గండర దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారి మట్టిని ఇంటవుంచుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని,తింటే రోగాలు దూరమవుతాయన్న నమ్మకంతో మట్టిని దక్కించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు పోటీపడ్డారు.


ఊరేగింపు గంటలో కానిచ్చేశారు

దర్శన క్యూల వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్న జనం ఊరేగింపులో అయినా అమ్మవారిని తనివిదీరా దర్శించు కోవాలనుకుంటే నిరాశే ఎదురైంది. ఊరేగింపు వేగంగా ముందుకు సాగి గంట వ్యవధిలోనే ముగిసింది. ఊరేగింపులో చివరి వరకూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. విరూపోత్సవంలో పోలీసులు లాఠీలకు పని చెప్పడం.... మరో వైపు పోలీసు వాహనాలు, అధికార పార్టీ నాయకుల వాహనాలు చక్కర్లు కొట్టడంతో తోపులాట కారణంగా భక్త్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా పోలేరమ్మను బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణా హైకోర్టు జడ్జి సి. హేమలత తదితర ప్రముఖులు దర్శించుకున్నారు.



Updated Date - 2022-09-16T05:41:29+05:30 IST