-
-
Home » Andhra Pradesh » Nellore » Thermal losses are created by the government
-
థర్మల్ నష్టాలు సర్కారీ సృష్టే
ABN , First Publish Date - 2022-10-27T05:42:48+05:30 IST
దేశంలోనే మొట్ట మొదటి సూపర్‌క్రిటికల్ థర్మల్ స్టేషన్‌ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ 278 రోజుల నుంచి జెన్కో ఉద్యోగులు

ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర ఇది
లీజుపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం
నిర్వహణ కోసమని బయట ప్రచారం
278రోజులుగా ఉద్యమిస్తున్నాం
అయినా..దూకుడుగా ప్రైవేటీకరణ
ఇకనైనా ఆపకపోతే ఊరుకోం
జెన్కో సిబ్బంది,పార్టీల నేతల హెచ్చరిక
నేడు నెల్లూరు థర్మల్ కేంద్రంలోని మూడోయూనిట్ ప్రారంభించనున్న సీఎం
నెల్లూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్ట మొదటి సూపర్‌క్రిటికల్ థర్మల్ స్టేషన్‌ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ 278 రోజుల నుంచి జెన్కో ఉద్యోగులు ఆందోళనలు, అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నాయి. ఇవేవీ లెక్కచేయకుండా సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం కృష్ణపట్నం విచ్చేస్తున్నారు. థర్మల్ కేంద్రంలోని మూడో యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు. అయితే.. ఈ తతంగమంతా ప్రైవేటుపరం చేయడం కోసమేనని పలువురు జెన్కో ఉద్యోగులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వాదిస్తున్నారు.
ప్రభుత్వం నడిపితే నష్టాలు రావడమేమిటి? ప్రైవేటు వ్యక్తులు నడిపితే లాభాలు రావడమేమిటి? అని నిలదీస్తున్నారు. మొన్నటి వరకు లాభాల్లో ఉన్న థర్మల్ ప్లాంటు ఇప్పుడెందుకు నష్టాల్లోకి వెళ్లింది అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన బొగ్గుసరఫరా చేయకపోవడంతోనే నష్టం వస్తోందని గట్టిగా వాదిస్తున్నారు. కడపలోని ఆర్‌టీపీఎస్, విజయవాడలోని వీటీపీఎస్‌లతో పోలిస్తే కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తమ అనుభవం నుంచి వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
లీజు నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి
థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. నిర్వహణ కోసం అప్పగిస్తున్నాం అనడం పచ్చి అబద్ధం. ఎంతో విశిష్ఠత కలిగిన ఈ కేంద్రాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఊరుకోం. భూ నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కాంట్రాక్టు కార్మికులుగా చేర్చుకున్న 1200 మందిని పర్మినెంట్ చేయాలి.
- అనీల్, కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకుడు
వైజాగ్‌లో ఒక మాట.. ఇక్కడొక మాట
దేశంలోనే మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్‌ను నడపలేక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. అదానీకి అప్పగించాలన్న కుట్రలో భాగంగానే కృష్ణపట్నం థర్మల్ స్టేషన్‌ను నష్టాల్లోకి తీసుకెళ్లారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటే వ్యతిరేకించిన వైసీపీ... థర్మల్ ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరణ చేస్తోంది?
- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ నేత,
జెన్కో పరిరక్షణ కమిటీ సభ్యుడు
ఆర్‌టీపీఎస్‌తో లేని సమస్య కృష్ణపట్నంతో వచ్చిందా?
ముద్దనూరులోని ఆర్‌టీపీఎస్, విజయవాడలోని వీటీపీఎస్ ప్లాంట్‌లు జెన్కో ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. వాటితో లేని సమస్య కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌తో వచ్చిందా..? అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన విద్యుత్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటీకరణ చేస్తోంది. ఒక్కసారి ప్రైవేటు వ్యక్తుల చేత్తుల్లోకి వెళ్లాక వారు చెప్పిందే వినాలి. విద్యుత్ డిమాండ్ ఏర్పడినప్పుడు వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతుంది.
- చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన
కార్యదర్శి, జెన్కోపరిరక్షణ కమిటీ సభ్యుడు
ఓ అండ్‌ఎం కాదు.. 25 ఏళ్ల లీజు
దాదాపు రూ.23 వేల కోట్ల ప్రజల ధనంతో నిర్మించిన కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌ను అదానీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇందులోభాగంగానే కొంతకాలం నుంచి ప్లాంట్‌ను నష్టాల్లోకి తీసుకెళ్లింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎమ్) మాత్రమే ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. కేబినెట్‌లో 25 ఏళ్లకు లీజుకు ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. టెండర్ అదానీకి దక్కేలా నిబంధనలు రూపొందించారు. జాతికి అంకితం పేరుతో అదానీకి అంకితం చేస్తున్నారు.
- మోహన్‌రావు, సీపీఎం నేత,
జెన్కో పరిరక్షణ కమిటీ కన్వీనర్
ప్రజలపైనే భారం
తక్కువ నిర్వహణ ఖర్చు కలిగిన కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును అదానీకి అప్పగించారు. ఇప్పుడు విద్యుత్ ప్లాంట్‌ను కూడా అప్పగించబోతున్నారు. ఈ ఏడాది వేసవిలో విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయో చూశాం. భవిష్యత్‌లో ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని ప్రైవేటు సంస్థ యూనిట్ ధర పెంచితే ఆ భారం ప్రజలపై మోపాల్సి ఉంటుంది. ప్రైవేటీకరణ ప్రభావం పర్యావరణ పరిరక్షణ చర్యలపైనా పడుతుంది.
- దామా అంకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి,
జెన్కో పరిరక్షణ కమిటీ సభ్యుడు